ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు చెల్లించాలి : యుటిఎఫ్‌

Dec 19,2023 21:59

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

                   పుట్టపర్తి అర్బన్‌ : ఉద్యోగ ఉపాధ్యాయులు ఆర్థిక బకాయిలు చెల్లించాలని యుటిఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌ కార్యాలయంలో ఏవో వెంకటనారాయణకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్ర రెడ్డి ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్‌ మాట్లాడుతూ, ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రతినెల 1వ తేదీన వేతనాలు ఇవ్వాలని ఉత్తర్వులు ఉన్నప్పటికీ రెండు సంవత్సరాలుగా ఆలస్యంగా వేతనాలు జమ చేస్తున్నారన్నారు. పిఆర్‌సి ముందు పిఆర్‌సి తర్వాత డిఎ బకాయిలతో పాటు, జెడ్‌పిసిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ తదితర బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి దశలవారీగా ఉద్యమాలు చేపడుతున్నట్లు తెలిపారు. 19 న ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులకు వినతి పత్రాలు సమర్పిస్తామని, ఈనెల 27న తాలూకా, డివిజన్లలో ఆరు గంటలపాటు ధర్నాలు, జనవరి 3న జిల్లా కేంద్రంలో 12 గంటలపాటు ధర్నాలు, నిరసనలు జనవరి 7, 8 తేదీలలో 36 గంటల పాటు ధర్నా నిర్వహిస్తామన్నారు. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు బూతన్న, కార్యదర్శులు లక్ష్మీనారాయణ, నరేష్‌ కుమార్‌, నాయకులు నారాయణస్వామి, బాబు, సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు. కదిరి టౌన్‌ : పురపాలక సంఘ పాఠశాలల్లో నెలకొన్న ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలపై జిల్లా స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు యుటిఎఫ్‌ నాయకులు తెలిపారు. 21న స్థానిక జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సదస్సుకు యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారన్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులు భూతన్న, అధ్యక్షులు జయచంద్ర రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌ హాజరవుతారన్నారు.అధికసంఖ్యలో ఉపాధ్యాయులు హాజరై సదస్సును విజయవంతం చేయాలని సత్యసాయి జిల్లా యుటిఎఫ్‌ కోశాధికారి డి. శ్రీనివాసులు, కార్యదర్శి చెన్నూర్‌ తాహెర్‌ వలి, కదిరి పట్టణ యుటిఎఫ్‌ నాయకులు మధుసూదన్‌, భార్గవ, ఖాజా, ఫయాజ్‌, పవన్‌ కోరారు.

➡️