ఉత్తర చైనాలో అంతు చిక్కని వ్యాధి

Nov 24,2023 11:03 #northern China, #terminal disease
  • వివరాలు కోరిన డబ్ల్యుహెచ్‌ఓ

న్యూయార్క్‌ : ప్రధానంగా ఉత్తర చైనాలో అంతుచిక్కని వ్యాధితో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలి కాలంలో ఇన్‌ఫ్లూయంజా, న్యుమోనియా తరహా లక్షణాలతో బాధ పడుతున్న కేసులు ఎక్కువయ్యాయి. దగ్గు లేనప్పటికీ శ్వాసకోశ ఇబ్బందులు, జ్వరం వంటి లక్షణాలు బాగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా బీజింగ్‌, లియోనింగ్‌, ఇతర నగరాల్లో పిల్లల ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోయి వున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. తైవాన్‌ మీడియా సంస్థ అయిన ఎఫ్‌టివి న్యూస్‌ ఈ వార్తలను అందించింది. జ్వరంతో బాధపడుతున్న పిల్లలను తీసుకుని తల్లిదండ్రులు ఆస్పత్రుల ముందు క్యూలు కట్టి నిలుచోవడం ఎక్కువగా కనిపిస్తోందని తెలిపింది. జీరో కోవిడ్‌ వ్యూహంలో భాగంగా చైనా మూడేళ్లుగా అమలు చేసిన కఠిన చర్యలను గతేడాది డిసెంబరు నుండి ఎత్తివేసింది. ప్రస్తుతం ఫ్లూ, న్యుమోనియా, శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయని ఈ నెలారంభంలో చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ స్వయంగా పత్రికా సమావేశంలో వెల్లడించింది. కోవిడ్‌ ఆంక్షలను ఎత్తివేసిన తర్వాత ఇన్‌ఫ్లూయంజా, మైక్రోప్లాస్మా న్యుమ్నోఇయా, రెస్పిరేటరీ సింక్టికల్‌ వైరస్‌ (ఆర్‌ఎస్‌వి) వంటి వ్యాధులు ప్రబలమవుతున్నాయని పేర్కొంది. అయితే ఈ అస్వస్థతకు సంబంధించిన నిర్దిష్ట సమాచారం ఇంకా తెలియాల్సిన అవసరం వుందని ఆన్‌లైన్‌ మెడికల్‌ కమ్యూనిటీ ప్రొమెడ్‌ తెలిపింది.

➡️