ఉత్కంఠకు తెర

Feb 24,2024 21:26

విజయనగరం ప్రతినిధి: విజయనగరం నుంచి మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు కుమార్తె అదితి విజయలక్ష్మి గజపతిరాజుకు మరోసారి అవకాశం కల్పించారు. ఆమె గత ఎన్నికల్లో పోటీచేసి, స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిపై ఓడిపోయారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. గజపతినగరం అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ ఎంపి కొండపల్లి పైడితల్లి నాయుడు మనుమడు కొండపల్లి శ్రీనివాస్‌ (కొండపల్లి కొండలరావు కుమారుడు)ను ప్రకటించారు. దీంతో, స్థానిక మాజీ ఎమ్మెల్యే కెఎ నాయుడుకు ఆశాభంగం కలిగింది. బొబ్బిలి నుంచి ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆర్‌ఎస్‌వికెకె రంగారావు (బేబీ నాయన)ను రంగంలోకి దింపుతున్నారు. ఈసారి మాజీ మంత్రి, బేబీనాయన సోదరుడు ఆర్‌విఎస్‌కె రంగారావు పోటీ నుంచి తప్పుకున్నారు. రాజాం నియోజకవర్గం నుంచి అంతా ఊహించినట్టే మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌ పేరును అధిష్టానం ఖరారు చేసింది. నెలిమర్ల నియోజకవర్గం నుంచి జనసేన నాయకులు లోకం మాధవి పేరు ఖరారు కావడంతో అక్కడ టిడిపి తరపున టిక్కెట్‌ ఆశించిన కర్రోతు బంగార్రాజు ఖంగుతిన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గం బోనెల విజరుకు, కురుపాం తోయక జగదీశ్వరికి అవకాశం లభించింది. సాలూరు నుంచి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుమ్మడి సంధ్యారాణికి అవకాశం కల్పించారు. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి, ఎస్‌.కోట, మన్యం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో, ఆయా నియోజకవర్గాల్లోని ఆశావహుల్లో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.మూడు చోట్ల ఎదురు చూపు చీపురుపల్లి, ఎస్‌.కోట, పాలకొండ నియోజకవర్గాల్లోని ఆశావహులకు ఎదురు చూపులు తప్పలేదు. ముఖ్యంగా చీపురుపల్లి అసెంబ్లీ అభ్యర్థి ప్రకటన పెండింగ్‌లో ఉండడం, అటు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కూడా ఎక్కడా సీటు కేటాయించకపోవడంతో ఆయనను చీపురుపల్లి నుంచి రంగంలో దింపాలన్న పార్టీ ఆలోచన మరింత బలపడినట్టుగా కనిపిస్తోంది. ఎస్‌.కోట అసెంబ్లీ స్థానం కోసం స్థానిక మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పాలకొండలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ, పార్టీ నాయకులు పడాల భూదేవి, గేదెల రవి పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా సమాచారం. వీరిలో పార్టీ నేతలు చంద్రబాబు, లోకేష్‌ ఆశీస్సులు ఎవరికి ఉంటాయో వేచిచూడాల్సిందే.

➡️