ఈవోగారు…సపరేటా…!టిటిడికి వర్తించని ఎన్నికల నిబంధనలు

ఈవోగారు...సపరేటా...!టిటిడికి వర్తించని ఎన్నికల నిబంధనలు

ఈవోగారు…సపరేటా…!టిటిడికి వర్తించని ఎన్నికల నిబంధనలుప్రజాశక్తి – తిరుపతి బ్యూరో ‘టిటిడి ఇన్‌ఛార్జి ఈవో ఎవి ధర్మారెడ్డి డిప్యూటేషన్‌ గడువు మే 14తో ముగియనుంది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఆ సమయంలో వేరే వారిని భర్తీ చేయడం తగదు.. ఈ నేపథ్యంలో ముందుగానే టిటిడిలో రెగ్యులర్‌ ఈవోను నియమించి ఉండొచ్చని’ రాయలసీమ పోరాట సమితి కన్వీనర్‌ నవీన్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. టిటిడిలో రెగ్యులర్‌ ఈవోగా పనిచేసేందుకు నిజాయితీ, అర్హత కలిగిన ఐఎఎస్‌ అధికారులు ఎందరో ఉన్నారని గుర్తు చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈవో ఎవి ధర్మారెడ్డి డిప్యూటేషన్‌ కాలపరిమితి సూపర్‌ఏన్యుయేషన్‌ జూన్‌ 30 వరకూ ఇవ్వాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు లేఖ రాయడంలో ఆంతర్యం ఏంటని మండిపడ్డారు. మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాల్లో వేసవి సెలవులతో పాటు అన్ని పరీక్షలు పూర్తయినందున తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, దాదాపు 30 గంటల పాటు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో దర్శనం కోసం వేచి ఉంటారని, ఈ కారణంగా ధర్మారెడ్డి లాంటి అనుభవం కలిగిన అధికారి డిప్యుటేషన్‌ పిరియడ్‌ మే 14తో ముగియనుందని, మరో ఆరు వారాలు గడువు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంలో మర్మమేమిటో భక్తులకు సమాధానం చెప్పాలన్నారు. ఏళ్ల తరబడి ఇతర ఐఎఎస్‌లకు అవకాశం ఇవ్వకుండా ఎవి ధర్మారెడ్డినే కొనసాగించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. శ్రీవారికి సంబంధించిన బ్యాంకు డిపాజిట్లు, ఆర్థిక లావాదేవీలు సక్రమంగా జరుగుతున్నాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయని, రెగ్యులర్‌ ఐఎఎస్‌ను నియమించి శ్రీవారి భక్తుల్లో అపోహను తొలగించాలన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్‌, ఎస్‌పి, ఇతర రెవెన్యూ ప్రభుత్వాధికారులను ఎన్నికల కోడ్‌ కారణంగా బదిలీ చేశారని, ఈవోకు మినహాయింపు ఏంటని ప్రశ్నించారు.

➡️