ఆహారం కోసం ఎదురుచూసేవారిపై, శరణార్ధ శిబిరాలపై ఇజ్రాయిల్‌ దాడులు

Mar 15,2024 00:34 #gaja, #israel hamas war, #War
  • డజన్ల సంఖ్యలో మృతి, 83మందికి గాయాలు

గాజా : ఆకలి బాధతో ఆహారం కోసం ఎదురుచూస్తున్న వారిపై, శరణార్ధ శిబిరాలపై ఇజ్రాయిల్‌ దారుణంగా దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో డజన్ల సంఖ్యలో మరణించగా, పెద్ద సంఖ్యలో గాయపడ్డారని అధకారులు తెలిపారు. సెంట్రల్‌ గాజాలోని బురేజి శరణార్ధ శిబిరం, నుస్రత్‌ శరణార్ధ శిబిరాలపై ఇజ్రాయిల్‌ బలగాలు జరిపిన దాడిలో 17మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. మరోవైపు రాఫా నగరంలో ఆహారం కోసం యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ ఆహార కేంద్రం వెలుపల బారులు తీరి నిలుచున్న వారిపై ఇజ్రాయిల్‌ సైన్యం దారుణంగా బాంబు దాడులు జరిపింది. ఈ దాడిలో మొత్తంగా ఐదుగురు మరణించగా, గాజా నగరంలో జరిపిన మరో దాడిలో ఆరుగురు మరణించగా, 83మంది గాయపడ్డారు. ఇటీవలి వారాల్లో సాయం కోసం వేచి వున్న సామాన్యులపై దారుణమైన దాడులకు దిగడం బాగా ఎక్కువైంది. గాజాలో సాయం అందుకోవడానికి వెళ్లడం కూడా చాలా ప్రమాదకరమైనదిగా మారింది. దాడులు జరిగిన కువైట్‌ రౌండ్‌ అబౌట్‌ ప్రాంతం మృత్యు కుహరంగా మారిందని మీడియా వర్గాలు వ్యాఖ్యానించాయి. ఆహారం కోసం వెళ్ళిన వారిని ఇలా చంపేస్తుంటే ఇంకా గాజాలోకి సహాయ ట్రక్కులు రావడంలో ప్రయోజనం ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇజ్రాయిల్‌ బలగాల ఈ దూకుడు చర్యలతో సహాయ కార్యకర్తల విధులకు కూడా తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఇప్పటివరకు ఇలా ఆహార పంపిణీ కేంద్రాలపై జరిగిన దాడుల్లో 400మంది వరకు పాలస్తీనియన్లు మరణించారు. ఇదిలా వుండగా, గాజాలో పరిస్థితులను, ఇజ్రాయిల్‌ చర్యలను ఖండిస్తూ, గాజాలో తక్షణమే కాల్పుల విరమణ జరగాలని కోరుతూ ఇయు పార్లమెంట్‌ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. రంజాన్‌ ప్రార్ధనల సందర్భంగా అల్‌ అక్సా మసీదులోకి పాలస్తీనియన్లను అనుమతించనీయకుండా ఆంక్షలు విధించడంపై జోర్డాన్‌ మండిపడింది. ఇటువంటి చర్యలు ప్రమాదకరమైనవని, ఆమోదయోగ్యం కాని చర్యలని పేర్కొంది.

➡️