ఆర్థిక వ్యవస్థలో విద్యార్థుల భాగస్వామ్యం

Dec 9,2023 21:01

  ప్రజాశక్తి-రేగిడి  :  ఇంజినీరింగ్‌ విద్యార్థులు పురోగమిస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావాలని, అందుకు నూతన పరిజ్ఞానం వైపు దూసుకువెళ్లాలని టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ పిలుపునిచ్చారు. రాజాంలోని జిఎంఆర్‌ఐటిని శనివారం జిఎంఆర్‌ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జునరావుతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు లక్ష్యాలను ఎంచుకొని ప్రణాళికాబద్ధంగా చదివి భారత ఆర్థిక వ్యవస్థల వైపు నడవాలన్నారు. భారత్‌ ఆర్థిక రంగం అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతోందన్నారు. టూరిజం, ఫైనాన్స్‌ సర్వీస్‌ తదితర రంగాల్లో మంచి ప్రగతి కనిపించిందని చెప్పారు. ఇక్కడ అనుభవం, నిపుణులైన బోధకులు ఉన్నారని, అంకిత భావం సమిష్టి బాధ్యత కనిపిస్తుందని చెప్పారు. రాజాం పట్టణ, పరిసర ప్రాంత ప్రజల కోసం జిఎంఆర్‌ సంస్థల అధినేత మల్లికార్జున రావు చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అమోఘమని కొనియాడారు. ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని కితాబిచ్చారు. ఈ సందర్భంగా జిఎంఆర్‌ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జునరావు మాట్లాడుతూ సంస్థ ద్వారా చేపడుతున్న పలు సామాజిక సేవా కార్యక్రమాలను వివరించారు. అనంతరం జిఎంఆర్‌ కేర్‌ ఆస్పత్రిని నారాయణన్‌ సందర్శించారు. ఎమ్‌డి డాక్టర్‌ డి.రాజేంద్ర, వైద్యులు ఆయనకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిఎంఆర్‌ ఎయిర్‌పోర్టు బిజినెస్‌ చైర్మన్‌ రాజు, జిఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బిజినెస్‌ చైర్మన్‌ బివిఎన్‌ రావు, ప్రముఖ పారిశ్రామికవేత్త నీలాచలం, గ్రంధి చినబాబు, ఫౌండర్‌ సిఇఒ అశ్విన్‌ లోహని, సిఇఒ లక్ష్మణమూర్తి, ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ గిరీష్‌, జిఎంఆర్‌ ఐటి ప్రిన్సిపల్‌ ప్రసాద్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️