ఆనందం.. ఆవిరి..!

ప్రజాశక్తి – ఆగిరిపల్లి

నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకాలని ఐదుగురు స్నేహితులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అదీ జనారణ్యానికి దూరంగా మామిడితోటలో పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అత్యంత ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. అదే ఉత్సాహంతో ఉదయమే ఇళ్లకు బయల్దేరిన ఆ యువకులు గమ్యం చేరకుండానే అనూహ్యరీతిలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరొకరు గాయాలతో విజయవాడలోని ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విజయవాడ నగరంలోని మొఘల్రాజపురానికి చెందిన తలశీల కృష్ణచైతన్య (24), నున్న గ్రామానికి చెందిన శెట్టి సాయికుమార్‌ (24), నున్న రాకేష్‌(25), మరో ఇద్దరు స్నేహితులు కలిసి నూతన సంవత్సరం వేడుకలు జరుపుకు నేందుకు ఆగిరిపల్లి మండలంలోని కనసానపల్లి గ్రామంలో గల నున్న రాకేష్‌ కుటుంబీకులకు చెందిన మామిడితోటకు ఆదివారం చేరుకున్నారు. రాత్రి సమయంలో వేడుకలు జరుపుకున్న ఐదుగురు యువకులు సోమవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో తమ స్వగ్రామాలకు బయల్దేరారు. వీరిలో కృష్ణ చైతన్య, సాయికుమార్‌, రాకేష్‌ బుల్లెట్‌ మోటారు సైకిల్‌పై, మరో ఇద్దరు వేరే మోటారు సైకిల్‌పై బయల్దేరారు. వీరు ప్రయాణం ప్రారంభించి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లగానే కనసానపల్లి గ్రామ శివారుకు రాగానే వీరి వాహనానికి గేదె అడ్డొచ్చింది. దానిని తప్పించబోయే క్రమంలో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఖాళీ భూమిలో ఎటువంటి రక్షణా లేని నేలబావిలోకి దూసుకుపోయింది. బుల్లెట్‌తోపాటు ముగ్గురూ నేలబావిలో పడిపోయారు. బాగా వెనుక కూర్చున్న రాకేష్‌ బావిలో ఉన్న నీటిలో పడిపోకుండా ముళ్లకంపను పట్టుకోగా బుల్లెట్‌ సహా కృష్ణచైతన్య, సాయికుమార్‌ నీట మునిగిపోయారు. దీంతో స్థానికులు, గ్రామపెద్ద ఎ.సంజీవరావు హుటాహుటీన అక్కడకు చేరుకుని అతికష్టంపై రాకేష్‌ను రక్షించి ఆస్పత్రికి తరలించారు. బావి నిండా ముళ్లకంపలు, బురద ఉండటంతో నీట మునిగిన వారిని బయటకు తీయడం కష్టసాధ్యమైంది. దీంతో సంజీవరావు, ఎఎస్‌ఐ, పోలీసులు ఆ బావిలో నీటిని తోడించి ఎట్టకేలకు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కృష్ణచైతన్య, సాయికుమార్‌ మృతదేహాలను బావిలోంచి బయటకు తీశారు. వీరు వాహనంతోసహా బావిలో పడిపోయే సమయంలో బావి అంచులకు, మెట్లకు తలలు తగలడం వల్ల తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆగిరిపల్లి ఎస్‌ఐ ఎన్‌.చంటిబాబు తెలిపారు.

➡️