ఆదుకోండి.. న్యాయం చేయండి

వేండ్ర ఒకటో వార్డు వాసుల ఆవేదన
ఆక్రమణలు తొలగించాలనిహైకోర్టు ఆదేశాలపై రోడ్డు ఎక్కి నిరసన
బాధితులకు అండగా వైసిపి, టిడిపి, సిపిఎం
ప్రజాశక్తి – పాలకోడేరు
”నాలుగు తరాల నుంచి ఈ భూమిని నమ్ముకుని తినోతినకో పైసా పైసా కూడబెట్టి ఇల్లు నిర్మించుకుని ఇక్కడే నివాసం ఉంటున్నాం. ఒక వ్యక్తి ఆర్థిక స్వలోభం కోసం మమ్మల్నందరినీ రోడ్డుకు ఈడ్చారు. పిల్ల బిడ్డలతో తమంత ఎక్కడికి పోతాం. మమ్మల్ని ఆదుకుని న్యాయం చేయాలి’ అని వేండ్ర ఒకటో వార్డు వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వేండ్ర అగ్రహారం వంతెనకు చేర్చి వేండ్ర గ్రామానికి చెందిన ఒకటో వార్డు ఉంది. దీనికి చేర్చి సర్వే నెంబర్‌ 137/1లో 4.63 సెంట్ల గ్రామకంఠం ప్రభుత్వ భూమి ఉంది. స్థానికంగా ఉన్న శంభుడు చెరువు చుట్టూ 45 కుటుంబాలు గృహాలు నిర్మించుకుని 150 ఏళ్ల నుంచి నివసిస్తున్నారు. పంచాయతీకి ఆస్తి పన్ను కూడా చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో ఇదే గ్రామానికి చెందిన కడలి దుర్గారావు ఈ గృహాలన్ని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించారని, తొలగించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని ఈ ఏడాది మే నెలలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో ఇళ్ల తొలగింపునకు అనుకూలంగా తీర్పు వెలువడింది. అప్పట్లో హైకోర్టు ఉత్తర్వుల అమల్లో అధికారులు జాప్యం చేశారు. సదరు పిటీషనర్‌ జిల్లా కలెక్టర్‌, పంచాయతీ కార్యదర్శిపై ఈ నెల 8న కోర్టు ధిక్కరణ ఫిటిషన్‌ దాఖలు చేయడంతో సంబంధిత అధికారులకు హైకోర్టు నుంచి నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ఈ నెల 26వ తేదీన ఆక్రమణలను తొలగిస్తున్నామని, తక్షణమే ఖాళీ చేయాలని 23న ఇన్‌ఛార్జి పంచాయతీ కార్యదర్శి ఎ.పోలయ్య 45 కుటుంబాలకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తొలగింపును అడ్డుకునేందుకు బాధిత కుటుంబాలతో పాటు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. రహదారిపై ధర్నా, ఆందోళన నిర్వహించారు. హైకోర్టులో ఫిటిషన్‌ వేసిన కడలి దుర్గారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు అతని దిష్టి బొమ్మను ఊరేగించి పంచాయతీ కార్యాలయం వద్ద దహనం చేశారు. ఉండి ఎంఎల్‌ఎ మంతెన రామరాజు, పాలకోడేరు ఎంపిపి భూపతిరాజు సత్యనారాయణరాజు (చంటి రాజు), సిపిఎం మండల కార్యదర్శి శేషాపు ఆశ్రయ బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. తహశీల్దార్‌ షేక్‌ హుస్సేన్‌, ఇన్‌ఛార్జి ఎంపిడిఒ ఎం.నాగేంద్రకుమార్‌, ఎస్‌ఐ నాళం శ్రీనివాసరావుతో బాధితుల తరపున చర్చలు జరిపారు. పూర్వం నుంచి ఉన్న ఇళ్లను కూల్చివేస్తే బాధితులు రోడ్డున పడతారని, ప్రత్యామ్నయం చూపే వరకు ఆక్రమణల తొలగింపు నిలిపి వేయాలని కోరారు. ప్రజాప్రతినిధులు, బాధితుల అభ్యర్థన మేరకు వచ్చే నెల పదో తేదీ వరకు ఆక్రమణల తొలగింపును వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించి వెనుదిరగడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.న్యాయ పోరాటం చేస్తాం : ఎంఎల్‌ఎ మంతెన రామరాజుబాధిత కుటుంబాలకు చట్టాలపై సరైన అవగాహన లేకపోవడం, మరో పక్క అధికారుల తప్పిదం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఎంఎల్‌ఎ మంతెన రామరాజు తెలిపారు. ఒక వ్యక్తి తన వ్యక్తిగత స్వార్థం కోసం 45 కుటుంబాలను రోడ్డున పడవేసే పరిస్థితికి తీసుకోచ్చా రన్నారు. బాధితుల తరపున న్యాయపోరాటం చేసి శాశ్వత పరిష్కారం చూపడానికి కృషి చేస్తానని తెలిపారు. అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం : ఎంపిపి చంటి రాజుఎవరై అధైర్యపడొద్దని, అండగా ఉంటామని ఎంపిపి భూపతిరాజు సత్యనారాయణ రాజు (చంటిరాజు) భరోసా కల్పించారు. బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించి సంఘీభావం తెలిపి అండగా నిలిచారు. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడే నివసిస్తున్న అందరికీ న్యాయం చేసే విధంగా తన వంతు కృషి చేస్తానన్నారు. డిసిసిబి ఛైర్మన్‌, నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎల్‌.నరసింహరాజు దృష్టికి సమస్యను తీసుకెళ్లామని చెప్పారు. చర్యలు మానుకోవాలి : సిపిఎం మండల కార్యదర్శి ఆశ్రయఎన్నో ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న నిరుపేదల గృహాలను తొలగిస్తామని అధికారులు చేపట్టిన చర్యలు మానుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి శేషాపు ఆశ్రయ డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాలను పరామ ర్శించిన ఆయన ఆందోళనలో పాల్గొని మాట్లాడారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామన్నారు.

➡️