ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు కుటుంబాన్ని ఆదుకోవాలి

ప్రజాశక్తి- మేడికొండూరు : అప్పుల బాధ తాళలేక, ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు కుటుంబానికి ప్రభుత్వం రూ.7 లక్షల పరిహారం ఇవ్వాలని కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.శ్రీనివాసరావు, నాయకులు బి.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. మండలంలోని ఎలవర్తిపాడుకు చెందిన ఓర్సు సోమయ్య (30) అనే యువ కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆ కుటుంబాన్ని నాయకులు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పదేళ్ల నుండి కౌలు వ్యవసాయం చేస్తున్న సోమయ్య 5 నుండి 8 ఎకరాల వరకూ సాగు చేస్తున్నాడని, రెండేళ్లుగా మిర్చిపైరుకు తామర పురుగు, బొబ్బరు వైరస్‌ సోకడం వల్ల రూ.10 లక్షల వరకూ అప్పులయ్యాయని చెప్పారు. ఈ ఏడాది మిర్చికి మంచి ధర ఉండడంతో పంట బాగా పండితే అప్పులు తీరుతాయని భావించి మూడున్నర ఎకరాల్లో మిర్చి, అరెకరంలో పత్తి వేశాడని, అయితే వర్షాభావం, ప్రభుత్వం సాగునీరు విడుదల చేయని కారణంగా మళ్లీ నష్టాలు తప్పవనే నిరాశతో ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. మృతునికి 13 ఏళ్ల కుమారుడు, 11 ఏళ్ల కుమార్తె, భార్య, మతిస్థిమితం లేని తల్లి ఉన్నారని, ఆ కుటుంబానికి వ్యవసాయం కోసం చేసిన అప్పులు రూ.12 లక్షలుండగా కొద్దిపాటి బంగారం, రెండుసెట్లలో ఉన్న పూడిగుడిసె కూడా తాకట్టులో ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సత్వరమే స్పందించి కౌలురైతు కుటుంబాన్ని ఆదుకోవాలని, పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకోవడంతోపాటు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పరామర్శించిన వారిలో నాయకులు ఎస్‌.కె ఇమామ్‌, షరీఫ్‌ ఉన్నారు.

➡️