ఆఖరి శ్వాస వరకూ ప్రజా పోరాటాల్లోనే

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి

ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ ఆఖరిశ్వాస వరకూ ప్రజాపోరాటాలే ఊపిరిగా ముందుకు సాగారు. సాబ్జీ మృతికి కొద్ది నిముషాల ముందు సైతం ఆయన కైకలూరు, ఆకివీడులోని అంగన్‌వాడీ ఉద్యోగుల ఆందోళనల్లో పాల్గొన్నారు, భీమవరంలో జరుగుతున్న ఆశాల ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఉద్యోగ, ఉపాధ్యాయులనే కాకుండా బడుగు జీవులను సైతం శోకసంద్రంలో ముంచెత్తింది. ఆయనతో ఉన్న స్నేహాన్ని, ఆయన చేసిన సహాయాలను, కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన తీరును గుర్తు చేసుకుంటూ అంతా తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. సాబ్జీ ఉపాధ్యాయ నేత నుంచి 2021 మార్చి 14న జరిగిన ఉభయగోదావరి ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిచి ప్రజాజీవితంలోకి అడుగుపెట్టారు. ఎంఎల్‌సి గెలిచిన తర్వాత నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో జరిగే ఆందోళనల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొని మద్దతుగా నిలిచేవారు. జిల్లా కలెక్టరేట్‌ వద్ద జరిగిన ప్రతి ఆందోళనలో ఆయన భాగస్వామిగా ఉన్నారు. సిపిఎస్‌ను వ్యతిరేకిస్తూ ఏలూరు జిల్లా కలెక్టరేట్‌ వద్ద పెద్దఎత్తున జరిగిన ఆందోళనలో ఎంఎల్‌సిగా సాబ్జీ పాత్ర గురించి ఎంతచెప్పినా తక్కువే. ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి సమస్యను అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా, ఆందోళనలు, నిరసనల్లో కార్యక్రమంలో ప్రత్యేక్షంగా పాల్గొని తనదైన శైలిలో పోరాటం జరిపేవారు. వ్యవసాయ కార్మికులు, రైతులు, కౌలురైతుల పోరాటాల్లో భాగస్వాములయ్యారు. ఏలూరులో డిగ్రీ కాలేజీ భవనాల నిర్మాణంపై విద్యార్థుల పోరాటానికి, ఎయిడెడ్‌ పాఠశాలల మూసివేతపై చేపట్టిన ఆందోళనల్లో, స్కూళ్ల విలీనం సందర్భంగా చేపట్టిన నిరసనల్లోనూ, ఇలా ఏ ప్రజాసమస్యపై ఆందోళన, నిరసన సాగిన ఎంఎల్‌సి సాబ్జీ అక్కడకు చేరుకుని తన గళం వినిపించేవారు. జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశాల్లోనూ, ఏలూరు నగరపాలకసంస్థలో, కలెక్టరేట్‌లో జరిగే సమీక్ష సమావేశాల్లోనూ ప్రజా సమస్యలపై తనదైన శైలిలో సమస్యను ప్రస్తావించేవారు. ఆర్థిక స్తోమత లేక చదువుకునేందుకు ఇబ్బంది పడుతున్న అనేక మంది పేదవిద్యార్థులకు అండగా నిలిచారు. నేడు సాబ్జీ అంత్యక్రియలు ఏలూరు ప్రతినిధి:ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్‌సి, ఉపాధ్యాయ ఉద్యమనేత షేక్‌ సాబ్జీ భౌతికకాయానికి ఆదివారం ఏలూరులో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద శుక్రవారం రోడ్డుప్రమాదంలో సాబ్జీ మృతి చెందిన సంగతి తెలిసిందే. భీమవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం అదే రోజు రాత్రి ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించి మార్చురీలో భద్రపర్చారు. సాబ్జీ కుమార్తె ఆస్రిఫా అమెరికా నుంచి ఆదివారం ఉదయం రానున్నారు. దీంతో సాబ్జీ అంత్యక్రియలకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 గంటలకు ఆశ్రం ఆసుపత్రి నుంచి సాబ్జీ భౌతికకాయాన్ని ఏలూరులోని యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయానికి తీసుకువస్తారు. అక్కడ కొద్దిసేపు ఉంచి, అనంతరం ప్రజల సందర్శనార్థం కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న ఇండోర్‌ స్టేడియానికి తీసుకెళ్తారు. అక్కడ నుంచి సాబ్జీ స్వగృహానికి తరలించి కొద్దిసేపు అక్కడ ఉంచుతారు. అనంతరం అంతిమయాత్ర ప్రారంభమ వుతుంది. సత్రంపాడు, శాంతినగర్‌, కొత్తబస్టాండ్‌, ఫైర్‌ స్టేషన్‌, జ్యూట్‌మిల్లు వంతెన మీదుగా పడమరవీధిలోని శ్మశానవాటిక వరకూ అంతిమయాత్ర సాగనుంది. అంతిమ వీడ్కోలులో పలువురు ప్రముఖలు పాల్గొనున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతోపాటు సిపిఎం రాష్ట్ర నాయకులు, వివిధ పార్టీల, సంఘాల నేతలు, పిడిఎఫ్‌ ఎంఎల్‌సిలు కెఎస్‌.లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు, మాజీ ఎంఎల్‌సి వి.బాల సుబ్రమణ్యం, యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, జిల్లా అధికారులు సాబ్జీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించనున్నారు. సాయంత్రం మూడు గంటలకు యుటిఎఫ్‌ కార్యాల యంలో సంతాప సభ నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించాలని కలెక్టర్‌ ప్రసన్నవెంకటేష్‌ ఉత్తర్వులు జారీ చేయడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగమయ్యారు.

➡️