ఆకాశమే హద్దు

Mar 24,2024 09:26 #Sneha, #Stories

అబివృద్ధి చెందుతున్న ఆ పట్టణంలో జనాభాకి లోటు లేదు. ఎంతమంది వచ్చినా చోటు తరగదు అన్నట్లు .. నివాసయోగ్యమైన ఇళ్లే లెక్కకు మిక్కిలిగా లేచాయి.
ఆ మలుపులో .. వెంకటేశ్వరస్వామి గుడికి, ఆనుకుని ఉన్న రోడ్డుకి ఎదురుగా అన్నీ ఆకాశహర్మ్యాలే. నాలుగు అంతస్తులూ, అయిదు అంతస్తులవి. అలా మొట్టమొదటగా తగిలేది అయిదు అంతస్తులతో ఉన్న ‘ టెంపుల్‌ బెల్సు’ అపార్టుమెంటు. దాని ప్రక్కనే ‘సుజనా’ అపార్టుమెంటు. అది రెండు బ్లాకులుగా ఉంటుంది. ఆ తరువాతది ‘ రాజరత్నా రెసిడెన్సీ’ అన్ని హంగులూ ఉన్న అయిదు అంతస్తుల భవంతి. అన్ని భవంతులూ దగ్గర దగ్గరగా ఉన్నట్లు కనిపించినా .. ఏదీ మాట అందే అంత దగ్గరలో ఉండవు.
అయినా ఆ పిల్లల స్నేహ వారధి అక్కడే వేళ్ళూనుకుంది.
ఈ రోజుల్లో జనాలు నడక కోసం ఎక్కడో దూరంగా ఉన్న పార్కులకు, వాకింగ్‌ ట్రాక్లకు వెళ్ళలేక, అందుబాటులో ఉన్న అపార్టుమెంట్ల పైనే ఉన్న ఆ కాస్త స్థలంలోనే, చక్కర్లు కొట్టేస్తున్నారు. పెద్దల ప్రపంచంలో పెద్దలు ఉంటే .. పిల్లలు .. మేమున్నాం అంటూ తయారవడంతో సాయంత్రాల్లో .. మేడల పైనున్న ఆకాశం క్రింద సందడే సందడి. నోటు పుస్తకాల కాగితాలు చించి రాకెట్లు వేసేవాళ్ళు కొందరైతే, గాలిపటాలు ఎగరేసే వాళ్ళు మరికొందరు. ఈ మేడ మీద అబ్బాయి గాలిపటం మంజాని, మరో మేడ మీద అబ్బాయి గాలిపటంతో తెంపెయ్యాలనుకోవడం. చూపరులకి ఆటవిడుపూ, కాలక్షేపమూను. అలా అని ఒకరికొకరు మిత్రులూ కాదు .. శత్రువులూ కాదు. ఇలాంటి నేపధ్యంలో ..
రాజరత్నాలో నాలుగవ ఫ్లోర్‌ లోఉండే ..రెండేళ్ళ చిన్నారి మౌక్తిక ను బాల్కనీ గ్రిల్‌ లోకి ఎక్కించి అన్నం పెట్టేది అమ్మ. ఎదుటి మేడ మీద ఆడే పిల్లల్ని చూపిస్తూ ‘ అదిగో, అన్నయ్యలు రాకెట్లు చేసి, ఎలా ఎగరేస్తున్నారో! చూడు. అదిగో! అక్క ఎలా గెంతుతుందో! చూడు’ అంటూ మరపించి నోట్లో ముద్దలు కూరేది.
అలా అన్నం తింటూనే .. వాళ్ళని చూసి ” హా .. హా ..హా ” అంటూ కేరింతలు కొట్టేది.
ఆ కేరింతలే వాళ్ళని ఆకట్టుకున్నాయి.
పిల్లలు పిల్లలకే మిత్రులన్నట్లు ” హారు! పాపా. నీ పేరేమిటి?” అడిగాడు హుస్సేన్‌ తనుండే మేడ సుజనా అంచుకంటా వచ్చి. హుస్సేన్‌ వాళ్ళు ఆ ఇంట్లోకి కొత్తగా వచ్చారు. నిండా పదేళ్ళు లేకపోయినా కనిపించిన అందర్నీ కొత్తా, పాతా లేకుండా పలకరిస్తుంటాడు. వెంటే తమ్ముడు చోటు.
”మౌక్తిక” చెప్పింది అమ్మ, పాప తరుఫున.
‘ హరు! మౌక్తికా ‘ గట్టిగా పిలిచాడు. తన పేరే వినిపించడంతో మరింతగా ” హా .. హా ..హా” అంటూ గ్రిల్‌ పట్టుకుని ఊగసాగింది. అలా మేడ మీదకి అంటూ వస్తే .. హుస్సేనూ, అతని తమ్ముడూ పాపని పలకరించకుండా ఉండే వారు కాదు. అదీ చాలదన్నట్లు ‘నిన్న నా పుట్టినరోజు అంటీ, మా నాన్న నాకు ఒక కారు బొమ్మ ప్రజెంట్‌ చేసారు. నిన్న అదే నడుపుకున్నాను .. మేడ మీద. నల్లటి కారు. మీరు చూసారా!’ అంటూ కబుర్లు.
‘ ఆ. చూసాను. చాలా బాగుంది’ మెచ్చుకుంది మౌక్తిక తల్లి. ఆ ఇంటికి ఆడుకోవడానికి నేల మీద చోటు లేదు .. ఆ టెర్రేసే వాళ్ళ ఆటస్థలం.
‘నా బర్త్‌ డే పార్టీకి మీ పైనున్న .. చింటూ, బంటూలు కూడా వచ్చారు. మౌక్తిక ఇంకా నడిచి రాలేదని పిలవలేదు ‘ వివరణ ఇచ్చాడు. ఈ సందడికి పైనున్న అయిదవ ఫోర్లో ఉండే కవల అన్నదమ్ములు చింటూ.. బంటూలు టెర్రెస్‌ మీదకు పరిగెత్తుకుంటూ వచ్చేవారు. ‘ ఒరేరు! ఏం చేస్తున్నావురా’ అంటూ.
ొొొ
ఆ రోజు శెలవు కావడంతో .. టెర్రెస్‌ పైకి చేరుకున్నారు పిల్లలు. మధ్య మధ్యలో తల్లుల అదిలింపులు ‘మరీ అంత చివ్వరికి వెళ్ళిపోకండి’ అంటూ. రోజులు గడుస్తుంటే మౌక్తిక ‘ అమ్మ .. నాన్న ‘ అంటూ మాటలు పలుకుతుంది. మౌక్తికతో మాట్లాడుతునే, హుస్సేన్‌ ఏదో గుర్తు వచ్చినట్లు ..
పైనే నిలబడి ఉన్న చింటూ, బంటూలను ఉద్దేశించి ‘ ఒరేరు! నేను ‘చైనా’ వెళ్ళానురా. అక్కడ చాలా ప్రదేశాలే తిరిగాం. సౌదీలో దిగలేదు గానీ, అమెరికాలోని ఎతైన టవర్స్‌ని బాగా దగ్గరగా చూసానురా’ చెప్పాడు ఉత్చాహంగా. ఆ మాటని ఆ అన్నదమ్ములు ఇద్దరూ నమ్మలేదు.
‘అబ్బా! నిజంగా చూసావా రా! లేక మా దగ్గర కోస్తున్నావా? ‘ నిలదీసాడు చింటూ. నాలుగవ తరగతిలోకి వచ్చాడు మరి.
‘బాగా అడిగావు’ అన్నట్లు చింటు వైపు చూసి చప్పట్లు కొట్టాడు బంటి.
‘ అరే! నిజంగానే వెళ్ళానురా .. మా నాన్న తీసుకెళ్ళారు. వచ్చేటపుడు రాజమండ్రి ఎయిర్‌ పోర్టులో’ ఫ్లైట్‌ దిగాము. నాకు పాస్పోర్టు కూడా ఉంది. మీకు లేదా! పాస్పోర్టు’ అడిగాడు హుస్సేను.
అప్పటికి అవి నిజమే అని గ్రహించిన చింటూ, బంటూలు ‘మాకు అలాంటివి ఏమీ లేవురా!’ డీలా పడ్డారు. అందుకు హుస్సేన్‌ ‘ఈ సారి ఏదైనా ట్రిప్‌ తగిలినప్పుడు మీ నాన్నని ఓకే చెప్పమనండి. అప్పుడు మీరూ వెళ్ళవచ్చు’ అన్నాడు హుషారుగా.
ఈ మధ్య కొత్త స్నేహం ఒకటి కలిసింది హుస్సేనుకి. వీధి మొదట్లో, అదే లైనులో ఉన్న టెంపుల్‌ బెల్సులో తన ఈడు వాడే అచ్యుత్‌. ఆ అయిదు అంతస్తుల మేడ మీదకి వచ్చి, ఆ అబ్బాయికి చెయ్యూపుతూ ‘ఒరేరు! హోం వర్క్‌ చేశావా?’ గట్టిగా అరచాడు హుస్సేన్‌.
ఆ పిలుపు అందుకున్న ఆ అచ్యుత్‌ ‘ హా! చేశాను’ గట్టిగా అరిచాడు.
ఇటు రాజరత్నాలో ఉండే మౌక్తికను .. అటు తమ అపార్టుమెంటుకి కాస్త దూరంగా ఉన్న టెంపుల్‌ బెల్సులో ఉండే అచ్యుత్‌నూ కలుపుకుంటూ మధ్య ఉన్న హుస్సేన్‌ టెర్రెస్‌ పైన, ఆకాశం కింద స్నేహ వారధిని ఏర్పరచుకున్నాడు. ఆనందాల హరివిల్లు నింగిని విరిసేలా.

  • పి.ఎల్‌.ఎన్‌. మంగారత్నం , 97014 26788
➡️