ఆందోళన ఉధృతం చేస్తాం

ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లుగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో

శ్రీకాకుళం అర్బన్‌ : ధర్నాలో మాట్లాడుతున్న సాయిరాం

ఎపి జెఎసి జిల్లా చైర్మన్‌ సాయిరాం

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లుగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో అనుసరిస్తున్న వైఖరి ఉద్యోగ వర్గాలను తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని, ఐదేళ్లుగా ఉద్యోగులు ప్రభుత్వానికి ఎంతగానో సహకరిస్తూ సహనంతో ఉన్నారని ఎపి జెఎసి జిల్లా చైర్మన్‌, ఎన్‌జిఒ జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరాం అన్నారు. కలెక్టరేట్‌ సమీపంలో జ్యోతిరావు పూలే పార్కు వద్ద ఎపి జెఎసి ఆధ్వర్యాన శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఐదేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగీ పాలన, పాలనేతర అంశాల్లో సంపూర్ణంగా సహకరించామని అన్నారు. కానీ, ఉద్యోగులకు రావాల్సిన డిఎ బకాయిలను ఈ ఐదేళ్లలో చెల్లించలేదని అన్నారు. అలాగే పిఆర్‌సిలోనూ ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేశారన్నారు. దేశచరిత్రలో పిఆర్‌సి ద్వారా ఉద్యోగుల జీతాలు తగ్గించిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఉద్యోగుల బకాయిల సొమ్ము సుమారు రూ.25 వేల కోట్ల పైబడి రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉందన్నారు. తమ కుటుంబ అవసరాల కోసం ఉద్యోగులు రుణం కోసం దరఖాస్తు చేస్తే సమయానికి డబ్బు చేతికందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి దుస్థితి ప్రభుత్వ ఉద్యోగులు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. తమ ఆరోగ్య అవసరాల కోసం ప్రతినెలా చెల్లిస్తున్న వైద్య బీమా డబ్బులు సైతం ప్రభుత్వం ఆస్పత్రుల ఖాతాలకు జమచేయకపోవడం దారుణమన్నారు. అలాగే సరెండర్‌ లీవ్‌ల సొమ్ములు మూడేళ్లుగా రూ.8 కోట్లు బకాయి ఉందన్నారు. 12వ పిఆర్‌సి కోసం కొత్త కమిటీ నియమించడంతో పాటు ఐఆర్‌ను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌కుమార్‌, ఎపిటిఎఫ్‌ నాయకులు టెంక చలపతిరావులు మాట్లాడుతూ విద్యారంగంలో సమూల మార్పులు తెస్తామని నమ్మబలికి నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పెన్షనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు పార్వతీశం, ఎన్‌జిఒ నాయకులు పట్నాయక్‌, పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. ఆమదాలవలస : బకాయిలు చెల్లించాలని కోరుతూ జెఎసి నాయకులు తహశీల్దార్‌ కార్యాలయం జూనియర్‌ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో జెఎసి జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి బొడ్డేపల్లి మోహనరావు, ఎన్‌జిఒ మండల అధ్యక్ష, కార్యదర్శులు అప్పలరాజు, ఎన్‌.రమణమూర్తి, జాయింట్‌ సెక్రెటరీ కె.మనోహర్‌, పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి బొడ్డేపల్లి జనార్థనరావు, కోశాధికారి హెచ్‌.వి.సత్యనారాయణ, కె.షణ్ముఖరావు, బి.వి.రమణ పాల్గొన్నారు. పొందూరు : బకాయిలు చెల్లించాలని కోరుతూ జెఎసి నాయకులు పాత తాలూకా కేంద్రం తహశీల్దార్‌ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం డిటి వెంకటేశ్వరులును కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎపిటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు ఎం.మధన్‌మోహన్‌, యుటిఎఫ్‌ పూర్వ జిల్లా అధ్యక్షులు పొందూరు అప్పారావు, మండల ఉపాధ్యాయ సంఘ నాయకులు కె.విజరు కుమార్‌, రోజా, బస్వా సతీష్‌, ఎన్‌.సత్తిరాజు, రఘుపునాయుడు, తేజేశ్వరరావు పాల్గొన్నారు. టెక్కలి : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో జెఎసి నాయకులు నిరసన తెలిపారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్‌ బాలమురళీకృష్ణను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జెఎసి నాయకులు సంపతరావు, మోహనరావు, పి.సి.నంద, కోత ధర్మారావు, రోనంకి రామచంద్రరావు, గున్న ప్రసాదరావు, కూర్మ, అనిశెట్టి చిట్టన్న పాల్గొన్నారు. అలాగే అటుగా వచ్చిన వైసిపి నాయకులు చింతాడ గణపతికి సమస్యలను వివరించారు. పలాస : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో ఎన్‌జిఒ అధ్యక్షుడు బోనెల గోపాల్‌, సబ్‌ ట్రెజరీ ఆఫీసర్‌ రామారావు, ఎన్‌జిఒ అసోసియేషన్‌ సెక్రటరీ బి.ఉపేంద్ర, ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసరావు, ట్రెజరర్‌ ఎన్‌.ఉపేంద్ర, జాయింట్‌ సెక్రెటరీ గిరి ఉదయ శంకర్‌ పాత్రో, కంచరాను చాణిక్య, విమెన్‌ వింగ్‌ రోజా, సిఐటియు సంఘ నాయకులు గణపతి, అగ్రికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ పాపారావు, పంచాయతీ కార్యదర్శి అప్పారావు పాల్గొన్నారు.

 

➡️