అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జిల్లావాసి

అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంతబొమ్మాళి మండలం కోటపాడుకు

ఏప్రిల్‌లో బాధ్యతలు స్వీకరించనున్న కోత రవి

ప్రజాశక్తి – నౌపడ

అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంతబొమ్మాళి మండలం కోటపాడుకు చెందిన కోత రవి నియమితులయ్యారు. ఈమేరకు అస్సాం ప్రభుత్వ విభాగం మంగళవారం అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. ప్రస్తుతం ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న పవన్‌ కుమార్‌ బోర్తకూర్‌ పదవీకాలం ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగియనుంది. ఆయన తదనంతరం రవి బాధ్యతలు చేపట్టనున్నారు. కోత రవి 1993 ఐఎఎస్‌ బ్యాచ్‌ అధికారి. అతను ప్రస్తుతం అస్సాం ప్రభుత్వంలో హోం, పొలిటికల్‌ డిపార్ట్‌మెంట్‌ విభాగ అదనపు చీఫ్‌ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పరిశ్రమలు, వాణిజ్యం, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌, పాస్‌పోర్ట్‌, జైళ్లు తదితర విభాగాల్లో పనిచేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కోటపాడుకు చెందిన కోత అప్పోజీ, సన్యాసమ్మ మూడో సంతానం రవి. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఆరు నుంచి పదో తరగతి వరకు మండలంలోని దండుగోపాలపురం హైస్కూల్‌లో సాగింది. ఇంటర్మీడియట్‌ టెక్కలి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో, బాపట్లలో అగ్రికల్చర్‌ బిఎస్‌సిని పూర్తి చేశారు. ఎంఎస్‌సి ఎంట్రన్స్‌లో ఐఎఆర్‌ఐలో నాలుగో ర్యాంకు సాధించారు. ఢిల్లీలో పిహెచ్‌డి చేశారు. 1992లో మొదటిసారి సివిల్స్‌లో 252 ర్యాంకు సాధించారు. రెండోసారి 1993లో 48వ ర్యాంకు సాధించారు. 1993లో ఐఎఎస్‌గా ఎంపికైన ఆయన ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత పదవులు చేపట్టారు. పలువురు ప్రభుత్వాధినేతల మన్ననలను పొందారు. అమెరికాలోని భారత దౌత్య కార్యాలయంలో ఆర్థికవేత్తగానూ పనిచేశారు. కోత రవి తండ్రి అప్పోజి 27 ఏళ్ల పాటు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పనిచేశారు. రవి పెద్ద సోదరుడు కోత భీమారావు ఎపి హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. రెండో సోదరుడు కోత మధుసూదనరావు కాంగ్రెస్‌ పార్టీ కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రవికి టెక్కలి ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు, కోటపాడు సర్పంచ్‌ కోత ఇందిరమ్మ, కోత సతీష్‌ తదితరులు అభినందనలు తెలియజేశారు.

➡️