అస్వస్థతకు కారణాలపై అన్వేషణ

Feb 13,2024 00:25

జిజిహెచ్‌లో బాధితులను పరామర్శిస్తున్న మంత్రి రజిని
ప్రజాశక్తి-గుంటూరుజిల్లా ప్రతినిధి :
వాంతులు, విరోచనాలు లక్షణాలతో అస్వస్థత కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని సోమవారం పరామర్శించారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. పలువురికి వచ్చిన అనారోగ్య సమస్యలకు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. నివేదికలు త్వరగా వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్య అయి ఉండొచ్చని భావిస్తున్న నేపథ్యంలో ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా పరిశుభ్రమైన తాగునీటిని అందించాలని సూచించారు. వైద్య సిబ్బందిని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని చెప్పారు. 24 గంటలూ అన్ని ఆస్పత్రులు పనిచేయాలని ఆదేశించారు. ఐవీ ఫ్లూయిడ్స్‌, ఓఆర్‌ ఎస్‌ ప్యాకెట్లు సరిపడా సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇంటింటి సర్వే పకడ్బందీగా జరిగేలా చూడాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కష్ణబాబు మాట్లాడుతూ వాంతులు, విరోచనాల లక్షణాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని ప్రాథమిక లక్షణాలు ఉన్న సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు వచ్చి వైద్య చికిత్సలు చేయించుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రజల అస్వస్థతకు కారణాలను తెలుసుకునేందుకు అన్ని ప్రాంతల్లో పూర్తి స్థాయిలో మంచినీటి శాంపిళ్ళు సేకరించి ల్యాబ్‌ లకు పంపించాలన్నారు. అనారోగ్యానికి గురైన వారి శాంపిల్స్‌ సేకరించి ఫలితాలు విశ్లేషించాలన్నారు. మంత్రి విడుదల రజిని మీడియాతో మాట్లాడుతూ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అనారోగ్య సమస్యలు నమోదవుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి శారదాకాలనీ, లాంచెస్టర్‌ రోడ్డు, ఐపీడీ కాలనీల్లో మొత్తం 23587 ఇళ్ల కు వెళ్లి ఆరోగ్య సర్వే నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇప్పటికే 17312 ఇళ్లకు సంబంధించి సర్వే పూర్తయిందని తెలిపారు. అస్వస్థత కేసులు నగరంలోని పలు ప్రాంతాల నుంచి అక్కడ ఒకటి, అక్కడ ఒకటి చొప్పున వస్తున్నాయని, దీనికి కారణాలపై అన్వేషణ కొనసాగుతోందని అన్నారు. సోమ, మంగళవారాల్లో కొన్ని నివేదికలు వస్తాయని చెప్పారు.

➡️