అవగాహనతో రీ సర్వే నిర్వహించాలి

అవగాహనతో రీ సర్వే నిర్వహించాలి

ప్రజాశక్తి-అమలాపురంవైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష రీ సర్వేకు సంబంధించి అన్ని ప్రక్రియలూ అవగాహనతో నిర్వహించి దోష రహితంగా రెవెన్యూ రికార్డులు స్వచ్ఛీకరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజరు, రెవెన్యూ, సర్వే సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ఆమె కలెక్టరేట్‌ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రీ సర్వే, ఆడదాం ఆంధ్ర, అంగన్వాడీ సెంటర్ల నిర్వహణ, అసైన్డ్‌ భూములు, లంక భూముల ఇకెవైసి, ఉచిత హక్కులు సంక్రమణ, జన్‌ భాగీదారి, సంక్రాంతికి కోడిపందేల నివారణ వంటి అంశాలపై అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ సర్వే పనులను సకాలంలో పూర్తి చేయాలని వేక్టరైజేషన్‌, రోవర్స్‌ సహకారంతో పాయింట్స్‌ గుర్తింపు, డ్రాఫ్ట్‌ ఆర్‌ఒఆర్‌, ఫైనల్‌ ఆర్‌ఒఆర్‌, మ్యుటేషన్ల ప్రక్రియలు పూర్తిచేస్తూ రెవెన్యూ రికార్డులు ఆన్‌లైన్‌ వెబ్‌ ల్యాండ్‌లో, రికార్డుల పరంగా స్వచ్ఛకరించాలని ఆదేశించారు. ఈ నెల 10వ తేదీ నుంచి మండల స్థాయిలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రారంభించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ సిహెచ్‌.సత్తిబాబు, అధికారులు పాల్గొన్నారు.

➡️