అరటి రైతు కంట కన్నీరు

Mar 31,2024 21:23
పంటలు బాగా పండి దిగుబడి

ప్రజాశక్తి-ఆత్రేయపురం

పంటలు బాగా పండి దిగుబడి బాగా వచ్చి మంచి ధర పలికితే అంతకంటే రైతుకు ఆనందం ఉండదు. కాని వ్యాపారుల మాయాజాలంతో ధర ఉంటే దిగుబడి ఉండదు, దిగుబడి ఉంటే ధర లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చేసేదేమీ లేక అయినకాడికి అమ్ముకుని నష్టాల ఊభిలో కూరుకుపోతున్నాడు అన్నదాత. కౌలు రైతుల పరిస్థితి అయితే మరి దయనీయంగా మారుతోంది. మళ్లీ పెట్టుబడి పెట్టాలంటే అప్పు దొరక్క నానా అవస్థలు పడి చివరకు బలవన్మరణాలకు పాల్పడతున్నారు. ప్రస్తుతం అరటి రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం, రావులపాలెం, ఆలమూరు, కొత్తపేట మండలాలలో సుమారు 25 వేల ఎకరాల్లో రైతులు వివిధ రకాల అరటి పంటలను సాగుచేస్తున్నారు. వాతావరణం అనుకూలించడంతో ఈ ఏడాది మంచి దిగుబడి వచ్చింది. మంచి రేటు వస్తుందని ఆశించిన రైతులకు చివరికి కన్నీళేల మిగిలాయి. ఎకరాకు రూ.1.50 వేల వరకూ ఇప్పటికే రైతులు పెట్టుబడి పెట్టారు. కౌలురైతులు రూ.60 వేల వరకూ కౌలు ఇచ్చియున్నారు. పంట బాగా పండటంతో గెలలను కోసి రావులపాలెం అరటి మార్కెట్‌కు తరలిస్తే గెలవక్కింటికి రూ.100 కూడా రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. గెలలను కోసి రావులపాలెం మార్కెట్‌కు తీసుకురావడానికి కూలి రూ.300 అవుతోంది. కనీసం కూలి రేటు కూడా రాకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. ఇప్పటికే పక్వానికి వచ్చిన గెలలు అరటి తోటల్లో గెలలు ముగ్గిపోతున్నాయి. కర్పూరం రకం అరటికి ఒడిశాలో విపరీతమైన డిమాండు ఉంటుంది. గోదావరి జిల్లాల్లో నుంచే ఎక్కువగా అక్కడికి కర్పూరరకం అరటి గెలులు ఎగుమతి అయ్యేది. అయితే ప్రస్తుతం అక్కడ కూడా కర్పూరం సాగు విస్తారంగా చేపట్టారు. అలాగే రావులపాలెం మార్కెట్‌ నుంచి మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌ తదితర రాష్ట్రాలకు అరటి ఎగుమతులు చేస్తూ ఉంటారు ఆ రాష్ట్రాల్లోనూ అరటి సాగును చేపట్డంతో ఎగుమతులు తగ్గాయి. అరటిని కొనుగోలు చేసే నాధులు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కళ్లెదుటే పంట ముగ్గు పోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. గతేడాది కార్తీక మాసంలో తొమ్మిది కర్పూర గెలలకు రూ.2,500 నుంచి రూ.3వేల వరకూ ధర పలికింది. ప్రస్తుతం తొమ్మిది గెలలు సైకిల్‌కు కట్టి పంపిస్తే రూ.3 వందలు వస్తోంది. కూలే రూ.300 చెల్లించాల్సి వస్తుందని, తమకు రూపాయి కూడా మిగలట్లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రావులపాలెం, అంబాజీపేట, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో అరటి మార్కెట్‌ యార్డులు ఏర్పాటు చేశారు. ఇక్కడ దళారీ వ్యవస్థ పెరిగిపోవడంతో గిట్టుబాటు ధర లభించట్లేదని రైతులు చెబుతున్నారు. కూలి ఖర్చులు కూడా రాకపోవడంతో పంటను మార్కెట్‌కు తరలించే పరిస్థితి కానరాకపోవంతో పొలాల్లోనే గెలలను వదిలేస్తున్నారు. ప్రభుత్వం స్పందించాలని, గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని అరటి రైతులు కోరుతున్నారు. లేకుంటే అప్పులు తీర్చలేక ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు.

➡️