అమెరికా అంతరిక్ష సంస్థకు శ్రీసిటీ-వీఆర్వీ ఉత్పత్తులు

Nov 30,2023 21:40
యుఎస్‌కు ఎగుమతి చేస్తున్న ట్యాంకులతో విఆర్‌వి సిబ్బంది

అమెరికా అంతరిక్ష సంస్థకు శ్రీసిటీ-వీఆర్వీ ఉత్పత్తులు ప్రజాశక్తి- వరదయ్యపాలెం శ్రీసిటీలోని వీఆర్వీ ఆసియా పసిఫిక్‌ ప్రైవేట్‌ పరిశ్రమ గడిచిన వారంలో ఒక ప్రముఖ యుఎస్‌ ప్రైవేట్‌ అంతరిక్ష సంస్థకు పలు భారీ ద్రవ ఆక్సిజన్‌ నిల్వ ట్యాంకులను ఎగుమతి చేయడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని అధిగమించింది. 37 మీటర్ల పొడవు, 6 మీటర్ల వ్యాసం, 200 టన్నుల బరువు కలిగిన ఈ భారీ నిల్వ ట్యాంక్‌, వి ఆర్‌ వి ఇంజనీరింగ్‌, క్రయోజెనిక్‌ టెక్నాలజీని అభివద్ధి చేయడంలో సంస్థ ప్రతిభను చాటి చెప్పింది. అంతరిక్ష రంగం అవసరాలకు అనుగుణంగా భారీ క్రయోజెనిక్‌ నిల్వ ట్యాంకుల తయారీలో ప్రపంచవ్యాప్త గుర్తింపు వీఆర్వీ కి దక్కిందిని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జిఎల్‌ రంగేకర్‌ తెలిపారు. 2019 మే నెలలో ఇస్రో యొక్క సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌కు ద్రవ నైట్రోజన్‌ షీల్డ్‌తో కూడిన భారీ లిక్విడ్‌ హైడ్రోజన్‌ నిల్వ ట్యాంక్‌ను సరఫరా చేయడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇటీవలి ‘చంద్రయాన్‌’ విజయవంతమైన ప్రయోగంలోను ఈ కంపెనీ ఉత్పత్తులు వినియోగించడం గమనార్హం. కోవిడ్‌-19 సంక్షోభ సమయంలో కీలక పాత్ర పోషించి దేశవ్యాప్తంగా వైద్య ఆక్సిజన్‌ సిలిండర్లు, నిల్వ ట్యాంకులను సరఫరా చేసింది. శ్రీసిటీ విరాళంగా తిరుపతి స్విమ్స్‌, బర్డ్‌, రుయా హాస్పిటల్స్‌ తో సహా తిరుపతి, నెల్లూరు జిల్లాలలోని ప్రభుత్వ ఆసుపత్రులకు అందచేసిన ఆక్సిజన్‌ నిల్వ ట్యాంకులను సకాలంలో సరఫరా చేసి వీఆర్వీ ఎంతో సహకరించింది.యుఎస్‌కు ఎగుమతి చేస్తున్న ట్యాంకులతో విఆర్‌వి సిబ్బంది

➡️