అమిత్‌ షా అస్సాం పర్యటన రద్దు

Mar 15,2024 00:32 #Amit Shah, #CAA, #CAA nirasana
  •  సిఎఎ నిరసనల ఎఫెక్టు

గౌహతి: సిఎఎకి వ్యతిరేకంగా ప్రజల నిరసనలకు భయపడి కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా అస్సాం పర్యటనను రద్దు చేసుకున్నారు. మార్చి 15న అస్సాంలో జరిగే ఓ అధికారిక కార్యక్రమానికి ఆయన హాజరవ్వాల్సి ఉంది. అమిత్‌ షా పర్యటన రద్దయిందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. మరోవైపు అస్సాంలో సిఎఎ వ్యతిరేక ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ముఖ్యంగా విద్యార్థులు ఉద్యమంలోకి దిగారు. ఈ రోజు గౌహతి సహా పలు జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి . ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌ షా దిష్టిబొమ్మలను నిరసనకారులు దగ్ధం చేశారు. శివసాగర్‌లో ఆందోళనకారులతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. మరోవైపు, అస్సాం ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ సిఎఎకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేసింది. పార్టీ తరపున అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేబ్‌బ్రత సైకియా, బార్‌పేట కాంగ్రెస్‌ ఎంపీ అబ్దుల్‌ ఖలేక్‌ సుప్రీంకోర్టులో కేసు వేశారు. సిఎఎ అమల్లోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో మూడు కేసులు దాఖలయ్యాయి. మార్చి 11వ తేదీ రాత్రి రూల్‌ను అమలు చేసిన మరుసటి రోజే డివైఎఫ్‌ఐ, ముస్లిం లీగ్‌లు కేసు వేశాయి. మూడు అంశాలను దష్టిలో ఉంచుకుని కేసు దాఖలు చేసినట్లు దేబ్‌బ్రత సైకియా సుప్రీంకోర్టులో పిటషన్‌ వేశారు. మొదటిది, సిఎఎ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14ను ఉల్లంఘిస్తుంది. ఈ విభాగం సమానత్వ హక్కు గురించి మాట్లాడుతుంది. కానీ మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వాలనేది సిఎఎ ఉద్దేశం. రెండవది, సిఎఎ అస్సాం ఒప్పందాన్ని బలహీనపరిచింది. చాలా పోరాటాల తర్వాత 1985లో అస్సాం ఒప్పందం కుదిరింది. మూడవది, సిఎఎ ఆరు ముస్లిమేతర మతస్తులకు పౌరసత్వాన్ని అందిస్తుంది. ముస్లింలతో పాటు తమిళులు కూడా ఈ చట్టం నుండి మినహాయించబడ్డారు. శ్రీలంక నుండి వచ్చిన తమిళులు కూడా ఈ చట్టం ప్రకారం పౌరసత్వానికి అర్హులు కాదు. రాజ్యాంగ విరుద్ధమైన, అస్సాం ఒప్పందాన్ని ఉల్లంఘించే ఈ చట్టాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశామని సైకియా తెలిపారు.

➡️