అమలాపురం టిక్కెట్‌ స్థానికులకే కేటాయించాలి : రమణారావు

ప్రజాశక్తి-ఉప్పలగుప్తం

స్థానికులకే అమలాపురం టిక్కెట్టు కేటాయించాలని, అటువంటి పరిస్థితుల్లోనే తామంతా పార్టీకి కట్టుబడి పని చేస్తామని వైసిపి నాయకుడు, గుడ్‌సీడ్‌ ఫౌండేషన్‌ ఫౌండర్‌ కుంచే రమణారావు అన్నారు. చల్లపల్లి పంచాయతీ జగ్గరాజుపేటలో గురువారం ఆయన తన అనుచర వైసిపి కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ఆవిర్భావం నుంచి వ్యయ ప్రయాసలకోర్చి పార్టీ అభివృద్ధికి, అభ్యర్థుల విజయానికి కష్టపడి అప్పటి నుంచి ఇప్పటి వరకూ పనిచేస్తున్నానని అన్నారు. అయినప్పటికీ వైసిపి అధిష్టానం తనకు సముచిత స్థానం ఇవ్వలేదన్నారు. అమలాపురం నియోజకవర్గం నుంచి కష్టపడి గెలిపించిన నాయకుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనను, పార్టీ కార్యకర్తలను దూరం పెట్టి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. అయినా పార్టీపై ఉన్న మక్కువతో పార్టీలోనే కొనసాగుతున్నానని అన్నారు. తాను సంపాదించిన సంపాదనలో కొంత కష్టాల్లో ఉన్న పేదలకు ఆర్థిక సాయం అందజేస్తున్నానని అన్నారు. సిఎం జగన్‌ సంక్షేమ పాలనను ప్రజలకు వివరిస్తూ పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని తెలిపారు. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా జగన్‌ను మళ్లీ సిఎంగా చేసేందుకు కష్టపడి పనిచేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. స్థానికులకు కాకుండా సిట్టింగ్‌కే మళ్లీ టిక్కెట్టు కేటాయిస్తే తమ కార్యాచరణను త్వరలో వెల్లడిస్తానని ఆయన అన్నారు. అమలాపురం అసెంబ్లీ వైసిపి టిక్కెట్‌ స్థానికులకే ఇవ్వాలని లేని పక్షంలో సహకరించేది లేదని వైసిపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న వైసిపి నేత కుంచే రమణారావు

 

 

➡️