అమరావతి ఊసెత్తని మోడీ

Mar 18,2024 00:18

అభివాదం చేస్తున్న నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్‌కల్యాణ్‌
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :
చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద టిడిపి, జనసేన, బిజెపి ఆధ్వర్యంలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభ ప్రజలకు ఎటువంటి భరోసానూ కల్పించలేకపోయింది. రాజధాని అమరావతి రైతులకు తీవ్ర నిరాశ మిగిలింది. ప్రధాని మోడీ ప్రసంగానికి ముందు మాట్లాడిన చంద్రబాబునాయుడు, పవన్‌ కల్యాణ్‌ అమరావతి రాజధాని గురించి ప్రస్తావించలేదు. చంద్రబాబు, పవన్‌ వైసిపిని, సిఎం జగన్‌ను విమర్శించారు. మోడీని పొగడ్తలతో ముంచెత్తారు. మోడీ కూడా తన ప్రసంగంలో తమ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి జరిగే మేలు ఏమిటో చెప్పలేదు. వైసిపి పాలనపై సునిశితంగా విమర్శలు చేశారు. అవినితి పెరిగిందని, అభివృద్ధి జరగడం లేదని విమర్శలు చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలోనూ ఒకే కూటమి అధికారంలో ఉంటే అభివృద్ధి బాగా జరుగుతుందని మాత్రమే మోడీ చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే తాను కోటప్పకొండ సమీపంలోని చిలకలూరిపేట సభకు వచ్చానన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. వికసిత్‌ భారత్‌ మాదిరిగా వికసిత్‌ ఆంధ్ర ప్రదేశ్‌ నినాదంతో ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమి పోటీ చేస్తుందన్నారు. ఎన్‌డిఎ కూటమిపై ప్రజల్లో అభిమానం పెరిగిందని, జగన్‌రెడ్డి ప్రభుత్వంపై ఉన్న కోపంతో ప్రజలు ఈ సభకు భారీగా వచ్చారని అన్నారు. రాష్ట్రంలోని మంత్రులు పరిపాలన కంటే.. ఎవరు ఎక్కువ అవినీతి చేస్తారో అనే అంశంపైనే దృష్టి పెట్టారు. రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే వారంతా కూటమిని గెలిపించుకోవాలన్నారు. 2014 నుంచి 2019 మధ్య మంజూరుచేసిన విద్యా, వైద్య సంస్థల గురించి ఏకరవుపెట్టిన మోడీ రాజధానితోపాటు రాబోయే కాలంలో ప్రజా సమస్యల పరిష్కారంపై ఎటువంటి ప్రస్తావనా చేయలేదు.రాజధానికి పూర్వ వైభవం కల్పిస్తానని మోడీ ప్రకటిస్తారని ఆశపడిన రైతులకు నిరాశ మిగిలింది. పలువురు అమరావతి రైతులు మోడీ రాకతో అమరావతికి పూర్వ వైభవం అంటూ ప్లకార్డులు పట్టుకుని గ్యాలరీలో కూర్చున్నారు. కానీ ఎవ్వరూ సభలో ఆ ప్రస్తావన చేయలేదు. సభలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, బిజెపి అధ్యక్షులు పురందేశ్వరి, టిడిపి నుంచి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నందమూరి బాలకృష్ణ, రామానాయుడు, లావు శ్రీకృష్ణదేవరాయులు, కొల్లు రవీంద్ర,పత్తిపాటి పుల్లారావు, తంగిరాల సౌమ్య, అనగాని సత్యప్రసాద్‌, బిజెపి నుంచి జి.వి.ఎల్‌.నరసింహారావు, సుజనా చౌదరి, సిఎం రమేష్‌, సోము వీర్రాజు, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, సత్యకుమార్‌, జనసేన నుంచి కొణతల రామకృష్ణ, గాదె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మోడీకి ఘన స్వాగతంచిలకలూరిపేట మండలం బొప్పూడి వద్దకు హెలికాఫ్టర్‌లో చేరుకున్న ప్రధాని మోడీకి పలువురు టిడిపి, బిజెపి,జనసేన నాయకులు ఘనస్వాగతం పలికారు. ప్రధాని ప్రయాణించే హెలికాఫ్టర్‌తోపాటు అదనంగా మరో రెండు హెలికాఫ్టర్లు వచ్చాయి. స్వాగతం పలికిన వారిలో చంద్రబాబు నాయుడు, పురందేశ్వరి,పవన్‌ కల్యాణ్‌ తదితరులున్నారు.

➡️