అనుమానాస్పద లావాదేవీలపై నిఘా

వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చట్టవిరుద్ధమైన, పరిమితికి మించిన అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలపై సమాచారం అందించాలని

ఎస్‌పి జి.ఆర్‌ రాధిక

ప్రజాశక్తి – శ్రీకాకుళం

వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చట్టవిరుద్ధమైన, పరిమితికి మించిన అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలపై సమాచారం అందించాలని ఎస్‌పి జి.ఆర్‌ రాధిక బ్యాంకు అధికారులకు సూచించారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌పి అధ్యక్షతన పలు బ్యాంకుల అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్యాంకు లావాదేవీలు, అక్రమ నగదు స్వాధీనంపై ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిందని తెలిపారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు నగదు లావాదేవీలపై బ్యాంకు అధికారులు దృష్టిసారించాలన్నారు. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున బ్యాంకుల్లో దాచుకున్న ధనాన్ని ఉపయోగించి ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో భారీ మొత్తంలో డబ్బులు జమ చేయడంతో పాటు ఖాతాల నుంచి తరచూ విత్‌ డ్రా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఏదైనా భారీ మొత్తం అమౌంట్‌ డిపాజిట్‌ చేయబడినా, ఉపసంహరించబడినా అలాంటి లావాదేవీలు అనుమానాస్పదంగా అనిపిస్తే, తప్పనిసరిగా సంబంధిత అధికారులకు సమాచారాన్ని అందించాలని చెప్పారు. పోలింగ్‌ తేదీకి ఆరు నెలల ముందు బ్యాంకుల ద్వారా కొన్ని బ్యాంకు ఖాతాల నుంచి అనేక ఖాతాలకు ఏవైనా అసాధారణ ఆన్‌లైన్‌ లావాదేవీలు జరిగితే, ఆ సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలన్నారు. ఎటిఎం సెంటర్‌ నుంచి అసాధారణంగా డబ్బు విత్‌ డ్రా జరిగితే, ఆ విషయాన్ని వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు. బ్యాంకు లాకర్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. బ్యాంకు, ఎటిఎం కేంద్రాల వద్ద పటిష్ట భద్రత కల్పించి, సిసి కెమెరాలు సక్రమంగా పనిచేసే విధంగా పర్యవేక్షించాలన్నారు. లాకర్ల వద్ద ఉన్న సిసి కెమెరాలను ప్రతిరోజూ పరిశీలించాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్‌పి జె.తిప్పేస్వామి, ఎస్‌బి డిఎస్‌పి కె.బాలరాజు, పలు శాఖల బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

➡️