అనంతపురంలో అదనపు కమిషనర్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న నాయకులు

అనంతపురంలో అదనపు కమిషనర్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న నాయకులు

సమ్మె హామీలపై జీవోలు విడుదల చేయాలి

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌

సమ్మె సమయంలో మున్సిపల్‌ పారిశుధ్యం, ఇంజనీరింగ్‌ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించిన జీవోలను వెంటనే ఇవ్వాలని కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎటిఎం నాగరాజు డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం నగరంలోని మున్సిపల్‌ కార్యాలయంలో అదనపు కమిషనర్‌ రమణారెడ్డికి మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా పర్మినెంట్‌ చేయాలని, సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆయా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ డిసెంబర్‌ 26 నుంచి జనవరి 10వ తేదీ వరకూ సమ్మె చేస్తే కార్మిక సంఘాల నాయకులతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. కావున ఆయా సమస్యల పరిష్కారానికి వెంటనే జీవోలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 25వ తేదీలోపు జీవోలు ఇవ్వకుంటే 27న మున్సిపల్‌ కార్యాలయం వద్ద పెద్దఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ కార్మికుల యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లికార్జున, సంజీవరాయుడు, పారిశుధ్య నగర కార్యదర్శి తిరుమలేశ, నల్లప్ప, కోశాధికారి పోతులయ్య, జిల్లా కమిటీ నాయకులు ఆదినారాయణ, కోవిడ్‌ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

గుత్తి : సమ్మె సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ జీవోలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజనీరింగ్‌ కాంట్రాక్టు కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపల్‌ కార్యాలయం ఎదుట కార్మికులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమ్మె కాలపు జీతాల జీవోను తక్షణమే జారీ చేయాలన్నారు. సంక్రాంతి కానుక సొమ్ము కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.75వేలు, మట్టి ఖర్చుల కోసం రూ.20వేలకు సంబంధించిన జీవోలను జారీ చేయాలన్నారు. లేనిపక్షంలో తిరిగి సమ్మెలోకి దిగుతామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ జి.శ్రీనివాసులుకు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ పారిశుధ్య కాంట్రాక్టు కార్మికుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.సూర్యనారాయణ, ఎన్‌.రామాంజనేయులు, కోశాధికారి బాలరంగయ్య, ఇంజనీరింగ్‌ కార్మికుల సంఘం అధ్యక్షుడు ఎస్‌.రాజా, ఉపాధ్యక్షుడు ఎస్‌ఎ.మురళి, కార్యదర్శి రవిశంకర్‌, కోశాధికారి నక్కా శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️