అధికార నందిపై ఆదిదేవుని అభయం

Mar 10,2024 22:42
అధికార నందిపై ఆదిదేవుని అభయం

ప్రజాశక్తి- శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజైన ఆదివారం ఉదయం ఆదిదేవుడు అధికార నందిపై పురవిహారం చేశారు. ఆదిదేవుని దేవేరి జ్ఞానప్రసూనాంబదేవి కామధేనువుపై ఆయనను అనుసరించారు. అంతకు మునుపు అలంకార మండపంలో గంగాభవానీ సమేత శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించారు. ఆలయ పురోహితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం గంగాభవానీ సమేత శ్రీకాళహస్తీశ్వరుని అధికార నందిపై పైనా… జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని కామధేనువు పైనా అధిష్టించి పురవిహారానికి తీసుకువచ్చారు. మూషిక వాహనంపై వినాయకుడు, చప్పరాలపై శ్రీవళ్లీ, దేవపేన సమేత కుమారస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప స్వామి, అమ్మవార్లను అనుసరించారు. మంగళవాయిద్యాలు, మేళ తాళాల మధ్య పురవిహారానికి వచ్చిన ఆదిదంపతులను దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. కర్పూర హారతుల సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నేడు సభాపతి కల్యాణం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సాలను పురస్కరించుకుని 9రోజైన సోమవారం సభాపతి కల్యాణం నిర్వహించనున్నారు. సభాపతిగా పిలువబడే నటరాజస్వామికి శివకామసుందరితో కల్యాణం నిర్వహిస్తారు. ఈ కల్యాణం ఆలయ ప్రాంగణంలోని 16కాళ్లు మండపం వద్ద జరుగుతుంది. ఇక సభాపతి కల్యాణం జరిగే రాత్రిని ఆనందరాత్రిగా వ్యవహరిస్తారు. నాగభూషణుడు నటరాజుగా ఆనంద తాండవం చేస్తాడు. నారద తుంబరుడు, సకల యక్ష, గాంధర్వ గానంతో, వాయిద్యఘోషలతో ఆనందరాత్రి వేళ కైలాసగిరులు ప్రతిధ్వనించనున్నాయి.దక్షిణ కైలాసానికి కల్యాణ శోభ దక్షిణ కైలాసానికి కల్యాణ శోభ సంతరించుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు అందజేసిన పట్టు వస్త్రాలను ధరించి గంగాభవానీ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి గజ వాహనం పైనా… జ్ఞానప్రసూనాంబదేవి సింహ వాహనం పైనా అధిరోహించి పెండ్లి మండపానికి బయలు దేరారు. ఆదిదంపతుల కల్యాణం కోసం పెండ్లిమండపం ముస్తాబైంది. ఈకల్యాణ వేడుకలు తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమవారం వేకువ జామున 3గంటల ప్రాంతంలో ఆది దంపతుల కల్యాణం నిర్వహించాలని ఆలయ పండితులు ముహూర్తం నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి గంగాభవానీ సమేత పరమశివుడు, జ్ఞానప్రసూనాంబ అమ్మవారి ఉత్సవ మూర్తులను అలంకార మండపంలో స్వర్ణాహరణాలతో అలంకరించారు. ఆలయ పురోహితులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం రాత్రి 11గంటల ప్రాంతంలో గంగాభవానీ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని గజ వాహనం పైనా… జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని సింహ వాహనం పైనా అధిష్టింప చేసి పెండ్లిమండపం వద్దకు తీసుకొచ్చారు. స్వర్ణాభరణాలు ధరించి… గజ. సింహ వాహనాలపై ఊరేగుతూ విద్యుత్‌ దీప కాంతుల వెలుగుల్లో ధగధగ లాడుతున్న శివపార్వతులను చూసి భక్తులు పరవశించి పోయారు. మంగళ వాయిద్యాలు, మేళ తాళాలు మోగుతుండగా… పదాతి దళాలు ముందు నడుస్తుండగా స్వామి, అమ్మవార్లు పెండ్లిమండపం వద్దకు చేరుకున్నారు. అర్ధరాత్రి తరువాత శివపార్వతుల పెళ్లితంతు ప్రారంభమైంది. స్వామి, అమ్మవార్ల కల్యాణ ఘడియలో పెళ్లి చేసుకునేందుకు పలు జంటలు తరలి వచ్చాయి. కాగా వందల సంవత్సరాలుగా ఈ కల్యాణ మహౌత్పవానికి ఉభయదారులుగా కైకాల వంశస్తులే ఉంటూ వస్తున్నారు. ఈ వంశానికి చెందిన తిరుపతి జిల్లా చెంబేడు గ్రామంతో పాటు 14 గ్రామాలకు చెందిన ప్రజలు ఉభయదారులు. అలాగే తమిళనాడులోని తిరుత్తణి ప్రాంతానికి సెంగుందర్‌, కులవెళ్తుత్తూరు, మరబినార్‌ కులాలకు చెందిన వారు అమ్మవారి తరపున ఉభయ దారులుగా ఉంటున్నారు.భక్తులకు అన్నదానం మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున జరిగే ఆదిదంపతుల కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు విచ్చేసిన భక్తులకు స్థానిక నగరివీధిలో వాయు లింగేశ్వర మొబైల్‌ షాప్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి అన్నదానం చేశారు. ఆదిదంపతుల కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తుల ఆకలిని తీర్చేందుకు మొబైల్‌ షాప్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అన్నదానం చేయడం తమ అదష్టంగా భావిస్తున్నట్లు అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు సాహిర్‌, సురేంద్ర యాదవ్‌ తెలిపారు.శ్రీకాళహస్తీశ్వరునికి టీటీడీ పట్టువస్త్రాలు శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆది దంపతుల కల్యాణం కోసం ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్య నిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి ఈ పట్టువస్త్రాలు తీసుకువచ్చారు. పట్టువస్త్రాలను తీసుకువచ్చిన ధర్మారెడ్డికి ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్వీ నాగేశ్వరరావు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. మణికంఠ ఆలయం వద్ద నుంచి పట్టు వస్త్రాలను మంగళ వాయిద్యాలు, మేళ తాళాల మధ్య వేడుకగా తీసుకెళ్లారు. అలంకార మండపంలో ఈ పట్టువస్త్రాలను వేదపండితులకు శాస్త్రోక్తంగా అందజేశారు. అనంతరం ఏవీ ధర్మారెడ్డి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. కాగా శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ అమ్మవారి కల్యాణం కోసం కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి, విజయవాడ కనకదుర్గ, శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయాల ఆధ్యర్యంలో కూడా పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అధికారులు వీరికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి పట్టు వస్త్రాలను స్వీకరించారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు.

➡️