అద్భుతం బాలోత్సవం.. మదిని(ప)ండుగ జ్ఞాపకం..!

బాలోత్సవంలో ప్రదర్శనలు చేస్తున్న చిన్నారులు

         చెప్పలేనంత సంతోషం.. మాటల్లో వర్ణించలేనంత ఆనందం… చూసిన ప్రతి ఒక్కరూ మెచ్చుకునేంత అద్భుతం.. మదిలో చెదిరిపోని జ్ఞాపకం… పిల్లల ఆనందాల హరివిల్లు బాలోత్సవంలో ఆవిష్కృతం..!

        ఆట పాటలతో మెప్పించారు.. వైజ్ఞానిక ప్రదర్శనలతో ఆలోచింపజేశారు… అందరినీ అకట్టుకునేలా ప్రతిభను బయటకు తీశారు.. తమకు అవకాశం ఇస్తే ఏమైనా చేయగలం అని ‘బాల’చిచ్చరపిడుగులు నిరూపించారు..! ఉరిమే ఉత్సాహంతో మూడు రోజుల పాటు ‘అనంత’పండుగను తీసుకొచ్చిన పిల్లలు ఈ ఏడాదికి సెలివచ్చి, మళ్లీ ఏడు కలుద్దాం అంటూ బాలోత్సవానికి వీడ్కోలు పలికారు. బాలల సృజనాత్మక మేళవింపుగా సాగిన అనంత బాలోత్సవాలు బుధవారం ముగిశాయి. మూడు రోజుల పాటు అనంత కేంద్రంగా జరిగిన ఈ పిల్లల పండుగ ప్రతి మదిలోనూ చెదిరిపోని జ్ఞాపకంగా మిగిలింది.

            అనంతపురం ప్రతినిధి : ‘అనంత బాలోత్సవ’ సంబరం ముగిసింది. మూడు రోజులుగా అనంతపురం నగరంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానం పిల్లల ఆటపాటలతో సందడి కొనసాగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది విద్యార్థులు తమ ప్రతిభా పాటవాలను చాటుకునేందుకు పోటీపడ్డారు. వారిని ప్రోత్సహించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆరాటపడ్డారు. నిత్యం చదువుల్లో మునిగితేలే విద్యార్థులకు ఈ మూడు రోజుల ఆటవిడుపు వారిలోనూ నూతనోత్సహన్ని నింపింది.ఈ ఉత్సహం పిల్లలోనే కాకుండా వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో సైతం కన్పించింది.

ఆఖరి రోజు మరింత ఉత్సాహంగా

           బాలోత్సవం ఆఖరిరోజు మరింత ఉషారుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రెండు వేల మందికి పైగా విద్యార్థులు వివిధ రకాల ప్రదర్శనాల్లో పాల్గొన్నారు. చివరి రోజు నృత ప్రదర్శనలతోపాటు మట్టితో బొమ్మలు తయారు చేయడం, కర్రసాము, ముఖాభినయం నాటకీకరణ జానపద నృత్యం, కొలాటాల ప్రదర్శనలు జరిగాయి. ఈ ఒక్క రోజే సుమారు రెండు వేల మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తంగా మూడు రోజుల ఉత్సవాల్లో 135 పాఠశాలల నుంచి సుమారు ఆరు వేల మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొని వారి ప్రతిభను చూపారు. 64 ఇవెంట్స్‌లో పిల్లలు పాల్గొన్నారు.

బాలోత్సవం.. అభినందనీయం..!

కుష్బుకొఠారి బీసీ వెల్ఫేర్‌ డిప్యూటీ డైరెక్టర్‌

          పిల్లల్లో దాగున్న ప్రతిభతోపాటు సృజతనాత్మకతను వెలికితీయడానికి బాలోత్సవం ఎంతగానో ఉపయోగపడుతుందని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అని బీసీ వెల్ఫేర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ కుష్బు కొఠారి తెలిపారు. బాలోత్సవ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పిల్లలకు సందేశమిచ్చారు. మూడు రోజులపాటు ఇంత చక్కటి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఇటువంటి పోటీల ద్వారా విద్యార్థుల్లో దాగున్న ప్రతిభతోపాటు, సృజనాత్మకతను వెలియతీయడానికి దోహదం చేస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమం అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవ కమిటీ అధ్యక్షులు షమీమ్‌ షషీవుల్లా, కార్యదర్శి సావిత్రి, కోశాధికారి జిలాన్‌, సభ్యులు శ్రీనివాసరావు, రిటైర్డు డిప్యూటీ కలెక్టర్‌ గోవిందరాజులు, రిటైర్డు తహశీల్దారు జయరామప్ప, మానవతా రక్తదాతల సంస్థ ప్రతినిధి తరిమెల అమర్‌నాథరెడ్డి, అపెక్స్‌ అధినేత తిరుపాల్‌, కేర్‌ అండ్‌ క్యూర్‌ వైద్యులు అభిలాష్‌, యుటిఎఫ్‌ నాయకులు నాగేంద్ర, కోటేశ్వరరావు, గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.

➡️