అత్యాచారాలు అరికట్టకుండా వేడుకలేమిటీ

Mar 8,2024 22:58

ఐద్వా జిల్లా అధ్యక్షులు పి.హైమావతి
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌
మహిళలపై అత్యాచారాలు అరికట్టకుండా ప్రభుత్వాలు నిర్వహించే మహిళా దినోత్సవ వేడుకలకు అర్థం లేదని ఐద్వా జిల్లా అధ్యక్షులు పి.హైమావతి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏలూరు టైటాస్‌ నగర్‌లో శుక్రవారం సాయంత్రం మహిళలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యు.భారతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో హైమావతి మాట్లాడుతూ మన దేశంలో ప్రతి ఐదు నిమిషాలకు ఒక మహిళపై అత్యాచారం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు ప్రతియేటా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల అభివృద్ధికి కృషి చేస్తామని గొప్పలు చెబుతూనే ఉంటారని, దేశంలో చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, అకృత్యాలకు మాత్రం అడ్డుకట్ట వేయడం లేదని విమర్శించారు. ఇంటర్‌నెట్‌, సినిమాల్లో అశ్లీలత, హింసను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. మద్యం, డ్రగ్స్‌ మత్తు పదార్థాలు అరికట్టాలని కోరారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజెపి ప్రభుత్వం హడావిడిగా 33 శాతం రిజర్వేషన్‌ బిల్లు ఆమోదించి 2029 నుంచి అమలు అనడం దారుణమని విమర్శించారు. సిఐటియు నాయకులు పి.కిషోర్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల మహిళలపై రోజురోజుకీ దాడులు పెరుగుతున్నాయని, చిన్నారులు, మహిళల కేసులు విచారించడానికి ప్రభుత్వాలు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభ అభ్యుదయ సేవా సంఘం అధ్యక్షులు కె.ప్రభావతి మాట్లాడుతూ గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించాలని డిమాండ్‌ చేశారు. డివైఎఫ్‌ఐ నగర అధ్యక్షులు పి.దుర్గాప్రసాద్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఠాగూర్‌రాజా సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో పద్మలీల, రజిని, మంగమ్మ, మౌనిక, సుమతి, అనసూయ, నాగమణి పాల్గొన్నారు.

➡️