అటవీశాఖ అధికారుల తీరుపై ఎపిఒకు ఫిర్యాదు

Mar 26,2024 22:04

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునే గిరిజనుల పట్ల అటవీ శాఖ అధికారులు తీరు దారుణంగా ఉందని, వారిపై చర్యలు తీసుకోవాలని ఐటిడిఎ ఎపిఒకు మంగళవారం ఫిర్యాదు చేసినట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అన్నారు. ఫిర్యాదు అనంతరం స్థానిక ఐటిడిఎ కార్యాలయ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ కొమరాడ మండలం పెద్దశాఖ పంచాయతీ దర్శింగికి చెందిన గిరిజనులు ఎంత పోడు భూమి సాగు చేస్తే అంత భూమికి పట్టాలి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ గ్రామానికి చెందిన హెచ్‌.చిన్నయ్య, కిల్లక శంకర్రావు, కె.మంగులు, కె.కామేశ్వరరావు, కె.తానుబాబు తదితర గిరిజనులు తమ పోడు భూమిని సాగు చేస్తుకుంటే సోమవారం వారి పనిముట్లును అటవీశాఖ అధికారులు లాక్కోవడం దారుణమని, దీనిపై ఐటిడిఎ పిఒ చర్యలు తీసుకొని వారి సామగ్రి వెంటనే గిరిజనులకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి ఎపిఒ స్పందిస్తూ దర్యాప్తు చేపట్టి సమస్యను పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. వినతిని అందజేసిన వారిలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, గిరిజన సంఘం నాయకులు శంకర్రావు, సూరయ్య, కామేశ్వరరావు చిన్నయ్య, మంగులు, వెంకట్రావు పాల్గొన్నారు.

➡️