అక్రమ అడ్మిషన్లను వ్యతిరేకిస్తూ నిరసన

ప్రజాశక్తి – కడప అర్బన్‌ బిఇడి కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తి కాకముందే ప్రయివేట్‌ బిఇడి కళాశాల యాజమాన్యాలు మేనేజ్‌మెంట్‌ తరుపున అడ్మిషన్లు నిర్వహించడానికి పరోక్షంగా సహకరించిన వైవీయూ విసి, రిజిస్ట్రార్‌ వైఖరిని ఎండగడుతూ విద్యార్థి సంఘాల నాయకులు బుధవారం విసి భవనం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పిడిఎస్‌ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.అంకన్న, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్‌ మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న ప్రయివేట్‌, బిఇడి కళాశాలల యాజమాన్యాలు ఉన్నత విద్యా మండలి, యుజిసి నిబంధనలకు విరుద్ధంగా కౌన్సెలింగ్‌ పూర్తికాకమునుపే బిఇడి అడ్మిషన్లు మేనేజ్మెంట్‌ తరపున ఇష్టానుసారంగా నిర్వహించారని చెప్పారు. ఈ విషయమై పలుమార్లు విసి చింతాసుధాకర్‌, రిజిస్ట్రార్‌ వెంకట సుబ్బయ్య, సిడిసి రఘుబాబుల దష్టికి తీసుకువెళ్లిన, ఫిర్యాదు చేసిన ఎటు వంటి చర్యలు, విచారణ జరపకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రయివేట్‌ బిఇడి యాజమాన్యాలకు తొత్తుగా మారారని మండిపడ్డారు. ఆందోళన అనంతరం విసికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పిడిఎస్‌ యు జిల్లా కార్యదర్శి జి.శ్రీనాథ్‌ యాదవ్‌, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి ఎస్‌. షాకీర్‌ హుస్సేన్‌, పిడిఎస్‌స్‌యు జిల్లా నాయకులు స్వరూప్‌ తేజ,గణేష్‌, సురేంద్ర,రెడ్డి మనోజ్‌, డివైఎఫ్‌ఐ జిల్లా నాయకులు చంద్రశేఖర్‌, బాబు పాల్గొన్నారు.

➡️