అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా – చర్యలు తీసుకోవాలని సిఎస్‌ ఆదేశం

Mar 27,2024 22:56 #Dr. KS Jawahar Reddy, #sameeksha

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో వేసవి, విద్యార్థులకు పరీక్షల సమయం దృష్ట్యా ఎక్కడా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యుత్‌శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి ఆదేశించారు. విద్యుత్‌ సరఫరా పరిస్థితులపై ఇంధనశాఖ అధికారులతో సచివాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. మంచినీటి సరఫరా పథకాలకు ఎక్కడా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సరఫరాకు సంబంధించి కాల్‌ సెంటర్‌కు వచ్చే ఫిర్యాదులపై నిర్ధిష్ట కాల వ్యవధిలోపు సకాలంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని చెప్పారు. విద్యుత్‌ పంపిణీ సంస్థల వారీ లోడ్‌ మానిటరింగ్‌ సెల్‌ (ఎల్‌ఎంసి) ద్వారా పరిస్థితులను నిరంతరం మానిటర్‌ చేయడం ద్వారా మెరుగైన రీతిలో సరఫరాకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రామ స్థాయి వరకూ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం, ఇతర ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్‌ 1912ను ప్రజలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. ఫిర్యాదులపై సకాలంలో స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్‌ ప్రమాదాల నివారణకు ప్రజల్లో పెద్దయెత్తున అవగాహన కల్పించేందుకు పంపిణీ సంస్థల వారీ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ విద్యుత్‌ సరఫరా పరిస్థితులను సిఎస్‌కు వివరించారు. సరఫరాలో ట్రాన్స్‌ఫార్మర్‌ బ్రేడ్‌డౌన్‌, ఇతర అంతరాయాలను నిర్ధిష్ట కాల వ్యవధిలో పరిష్కరిస్తున్నామని తెలిపారు. పంపిణీ సంస్థల వారీ విద్యుత్‌ సరఫరాకు సంబంధించి 9 రకాల ఫార్మాట్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో వర్చువల్‌గా ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సౌరవ్‌ గౌర్‌, కార్యదర్శి కెవివి సత్యనారాయణ, సిపిడిసిఎల్‌, ఇపిడిసిఎల్‌ సిఎమ్‌డిలు సంతోష్‌ రావు, ఐ పృథ్వీతేజ్‌, ట్రాన్స్‌కో గ్రిడ్‌ డైరెక్టరు తదితరులు పాల్గన్నారు.

➡️