గుల్బర్గాలో నువ్వా..నేనా..!

Apr 26,2024 23:33 #Karnataka

-కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఖర్గే మేనల్లుడు రాధాకృష్ణ
-బిజెపి నుంచి సిట్టింగ్‌ ఎంపి జాదవ్‌
కర్ణాటకలోని గుల్బర్గా ఎంపి నియోజకవర్గంలో కాంగ్రెస్‌, బిజెపిల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు కొనసాగుతోంది. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గె ఈసారి పోటీలో లేరనే విషయం తెలిసిందే. ఖర్గె స్థానే ఆయన మేనల్లుడు రాధాకృష్ణ దొడ్డమానిని కాంగ్రెస్‌ బరిలోకి దింపింది. 2019 తప్ప ఓటమి లేని ఖర్గేకి ఈసారి గుల్బర్గా గెలుపు ఎంతో ప్రతిష్టాత్మకం కానుంది. 10 సార్లు అసెంబ్లీ, రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికైన ఖర్గే, రాధాకృష్ణ గెలుపుపై దృష్టి సారించారు. ఇప్పటికే పలుమార్లు ప్రచారంలో పాల్గొన్నారు. ఖర్గే చిన్న తమ్ముడు దొడ్డమాని రాధాభారు, ఖర్గే కుమారుడు ప్రియంక్‌తో పాటు శరణప్రకాష్‌ పాటిల్‌ జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ ఐదు గ్యారంటీలు, కల్యాణ కర్ణాటక ఆర్టికల్‌ 371జె అంశం, బిజెపి వైఫల్యాలను ప్రచారాస్త్రాలుగా చేసుకొని వాటిని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. దొడ్డమాని సౌమ్యతకు అక్కడి ప్రజలు సానుకూలత చూపు తుండటంతో హస్తం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు బిజెపి కూడా గుల్బర్గాలో గెలుపును ప్రతిష్టా త్మకంగా తీసు కుంది. సిట్టింగ్‌ ఎంపి ఉమేష్‌ జాదవ్‌కు సీటు కేటాయించింది. కాంగ్రెస్‌ ఎమ్మేల్యే అయిన జాదవ్‌ 2019లో కాషాయ జెండా కప్పు కున్నారు. కేంద్రంపై వ్యతిరేకత, రాష్ట్రానికి ప్రాజెక్టులను తేలేకపోవడం వంటి ప్రతికూలతలను జాదవ్‌ ఎదుర్కొంటున్నారు. ఎన్నికల తరుణంలో ఓట్లర్లను ఆకట్టుకునేందుకు బిజెపి టెక్స్‌టైల్‌ పార్క్‌, బెంగళూరు టు కల్బుర్గి వరకు రెండు రైళ్లు వంటివి కేటాయించింది. ఈ ఎన్నికల్లో జాదవ్‌కు రాధాకృష్ణ గట్టి పోటీ ఇవ్వనున్నారు. గుల్బర్గా నియోజవర్గ పరిధిలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వాటిలో ఆరు కాంగ్రెస్‌ గెలవగా, మిగిలిన రెండు చోట్ల బిజెపి, జెడిఎస్‌ గెలిచాయి. ఇక్కడ మే 7న ఎన్నికలు జరుగుతాయి.

➡️