అంగన్‌వాడీలకు కార్మికవర్గం అండగా నిలవాలి

Jan 12,2024 07:17 #Editorial

గౌరవ వేతనంతో పని చేస్తున్న అంగన్‌వాడీల మీద, అందులో మహిళల మీద ఇంత నిర్బంధాన్ని, నిందారోపణలు చేస్తున్నారంటే రాబోయే రోజుల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర రంగాల్లోని అసంఘటిత కార్మికులు చేసే ఉద్యమాల మీద ఎంతటి ఉక్కు పాదం మోపుతారో ఊహించవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న సమ్మె అంగన్‌వాడీలదే కావచ్చు కాని ఆ సమ్మెను అణచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు భవిష్యత్‌ ఉద్యమాలకు ప్రమాదకరం. అంగన్‌వాడీల సమ్మెకు అండగా నిలవడం కేవలం అంగన్‌వాడీల వేతనాల పెంపుదలకే కాదు, రాబోయే ఉద్యమాలను కాపాడుకోవడానికి, కార్మిక హక్కులను ప్రభుత్వాలు హరించకుండా నివారించుకోవడానికి అత్యవసరం.

               అంగన్‌వాడీల సమ్మెను అణచివేసేందుకు ప్రభుత్వం తుది ప్రయత్నాలకు సిద్ధమైంది. వేతనాల పెంపు అడగడమే నేరమైనట్లు ఎస్మా ప్రయోగించింది. పది రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని నోటీసులు ఇచ్చి విధుల నుండి తొలగిస్తామని బెదిరిస్తున్నది. ఇప్పటి వరకు అంగన్‌వాడీలకే పరిమితమైన ఈ సమ్మె పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత చర్యలు ఆంధ్ర రాష్ట్ర కార్మిక, ఉద్యోగ వర్గాల ఉద్యమాలకు సవాళ్లుగా మారాయి. ఈ నిరంకుశ చర్యలను ప్రతిఘటించడం అంగన్‌వాడీలకే కాదు ఆంధ్ర రాష్ట్ర శ్రమజీవుల ఉద్యమాలకు జవన్మరణ సమస్య. నియంతృత్వానికి నిదర్శనంగా ఉన్న క్రూరమైన ఎస్మా చట్టాన్ని గౌరవవేతనంతో బతికే అంగన్‌వాడీల మీదే ప్రయోగించారంటే రానున్న రోజుల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు హక్కుల గురించి, వేతనాల గురించి ఉద్యమించగలరా? అందుకే కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో పాటు సకల జనం…ఉద్యమిస్తున్న అంగన్‌వాడీలకు అండగా నిలవాలి. ప్రభుత్వ నిర్బంధాన్ని ఐక్యంగా ప్రతిఘటించాలి.

ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాలకు ఊపిరిలూదుతున్న అంగన్‌వాడీల సమ్మె చారిత్రాత్మకం, సువర్ణాక్షరం. 30 రోజులుగా లక్ష మంది మహిళలు పట్టు సడలకుండా జగమొండి ప్రభుత్వంపై పోరాడుతుండడం అబ్బురం, ఆశ్చర్యం. ఎస్మా లాంటి పాశవిక చట్టాలను అడ్డుపెట్టి ఈ ఉద్యమ క్రాంతిని ఆపాలని చూస్తున్న పాలకులకు స్వప్నంలో కూడా వీడని కాళికలయ్యారు అంగన్‌వాడీలు. వేతనాల కోసం, చట్టబద్ద సౌకర్యాల కోసం పోరాడుతున్న అతి బక్కజీవుల మీద బ్రహ్మాస్త్రం ప్రకటించిన ప్రభుత్వం అది తనకు భస్మాసురాస్త్రం అవుతుందని గుర్తించేలా చేయడం నేటి చారిత్రక అవసరం.

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలు కోసం సమ్మె చేయాల్సి రావడం ఈ ప్రభుత్వ ద్వంద్వ విధానాలకు నిదర్శనం. రాష్ట్రంలో 55,605 సెంటర్లలో పనిచేస్తున్న లక్ష పదివేల మందికి పైగా అంగన్‌వాడీలు తమకు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయమని గత నాలుగు సంవత్సరాలుగా అన్ని పద్ధతుల్లో ఈ ప్రభుత్వాన్ని అడిగారు. ఏలికలు జాలి మాటలతో జోకొట్టాలని చూశారే గాని…కడుపు నింపే కాసులు విదల్చలేదు. సరికదా, గతంలో అమలవుతున్న ప్రభుత్వ పథాకాలకు మీరు అనర్హులు అని తేల్చారు. దీంతో అంగన్‌వాడీల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లైంది. కడుపు మండింది. సమ్మెకు దిగాల్సిన అనివార్య పరిస్థితిని ఈ ప్రభుత్వం సృష్టించింది. ఇందుకు వైసిపి ప్రభుత్వం సిగ్గుపడాల్సిందిపోయి ఎదురు దాడికి దిగింది. అబద్ధాలను ప్రచారం చేస్తున్నది. బెదిరింపులు, చివరకు తొలగింపులకు సిద్ధమైంది. సమ్మెలో ఉన్న అంగన్‌వాడీలకు ప్రత్యామ్నాయం చూసుకుంటామని గాండ్రిస్తున్నది. దగ్గరలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పాలకపక్ష క్రూరత్వం ముసుగులు వేసుకుని బుసలు కొడుతున్నదే తప్ప…ఆ ఎన్నికలే దూరంగా ఉంటే నిర్బంధం ఏ రకంగా ఉండేదో అంగన్‌వాడీలకు తెలియనిది కాదు.

అంగన్‌వాడీలపై నిర్బంధాలు-నిందారోపణలు

              సమ్మె ప్రారంభమైన మొదటి రోజే సమ్మె చేయవద్దని ఐసిడిఎస్‌ కార్యదర్శి ద్వారా కార్మికులకు నోటీసులు పంపారు. నాలుగు రోజుల తర్వాత సెంటర్ల తాళాలు పగులగొట్టే విధ్వంసకర విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు. అంగన్‌వాడీల సేవలు పొందుతున్న తల్లులు, ప్రజలు, సెంటర్లు బాడుగలకు ఇచ్చిన ఇంటి యజమానులు ఈ దుర్మార్గాన్ని ప్రతిఘటించడంతో అలాంటి ఆదేశాలు మేము ఇవ్వలేదని ప్రభుత్వ పెద్దలు కపటత్వం ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. సచివాలయ సిబ్బంది ద్వారా సెంటర్లు నడపాలని చూశారు. చర్చల పేరుతో బుజ్జగింపులకు దిగారు. మీ కష్టం గొప్పదంటూనే ‘వేతనాలు తప్ప’ మిగిలిన వాటిని మాట్లాడుకుందామని చర్చలకు మోకాలు అడ్డువేశారు. తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానన్న ముఖ్యమంత్రి హామీ గురించి సమ్మె చేస్తుంటే ‘వేతనాలు తప్ప…’ అంటే చర్చలకు అర్థం ఏముంది? ముఖ్యమంత్రి స్పందించడంలేదు కాబట్టి మంత్రులు, ఎమ్మెల్యేలకు చెప్పుకుందామని వారి ఇళ్ళ దగ్గరకు వెళ్తుంటే పోలీసుల ద్వారా అడ్డుకునే అన్ని ప్రయత్నాలు చేశారు. కాని వేలమంది మహిళలను అడ్డుకుంటే జరిగే పరిణామాలను ఊహించి వెనక్కు తగ్గారు. సమ్మె శిబిరాల దగ్గర పోలీసులను మోహరించి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ‘జనవరి 5 లోపు విధుల్లో చేరకపోతే…’ అని హెచ్చరించారు. అధికారులు ప్రతిరోజూ మెసేజ్‌ల ద్వారా చేతనైనంత భయపెడుతూనే ఉన్నారు. ఇన్ని చేసి, ‘గతంలో టిడిపి వారు గుర్రాలతో తొక్కించారు. మేము అలా చేశామా…?’ అంటూ ప్రభుత్వ సలహాదారులు రాగాలాపన చేయడం మరింత విడ్డూరం.

ఈ సమ్మెల వెనుక జాతీయ రాజకీయపార్టీలు ఉన్నాయని, కమ్యూనిస్టులు ఉన్నారని, ఎవరో డబ్బులు ఇచ్చి సమ్మెను నడుపుతున్నారని దుష్ప్రచారం మొదలెట్టారు. ప్రతి ఉద్యమ సమయంలోనూ, ప్రతి సమ్మెలోనూ జరిగే తంతే ఇది. అధికారంలో ఎవరు ఉన్నా ఇవే పదాలను పదే పదే వల్లించడం చూసి జనం విసిగిపోయారు. అయినా ఏ జంకు లేకుండా నిస్సిగ్గుగా ఏలికలు వాటినే వాడేస్తుంటారు. అధికార పార్టీకి చెందిన సోషల్‌ మీడియా అసుర సైనికులు అనైతికమైన, అహేతుకమైన నిందారోపణలుతో పాటు, తల్లి తర్వాత తల్లిలాగా సేవలు చేస్తున్న అంగన్‌వాడీ తల్లులను దుర్భాషలాడుతూ దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు, వారి అనుచరులు తమ స్థాయి దిగజార్చుకుని మాట్లాడుతున్నారు. ఇలాంటి విమర్శల వెనుక కార్మికుల చైతన్యాన్ని గుర్తించ నిరాకరించడం, ఉద్యమాలకు అండగా నిలిచే కమ్యూనిస్టు పార్టీలను కార్మికుల నుండి దూరం చేయడమనే దోపిడీ వర్గ స్వభావం ఉంది. ప్రభుత్వం చేపట్టే నిర్బంధాలను, నిందారోపణలను అంగన్‌వాడీలు ఏ మాత్రం ఖాతరు చేయకపోగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు సమ్మె శిబిరానికి వచ్చి ఆర్థిక సహాయం చేస్తామంటే నిర్ద్వంద్వంగా అంగన్‌వాడీలు నిరాకరించారు. భోజనాలైనా ఏర్పాటు చేస్తామంటే వద్దన్నారు. ఉద్యమ నిర్వహణకు కొంగుపట్టి ప్రజల వద్ద భిక్షాటన చేసి నిధులను సమీకరించుకున్నారు. ప్రతి రోజూ వంద నుండి రెండు వందల రూపాయలు చార్జీల ఖర్చు పెట్టుకుని సమ్మె శిబిరాల్లో కూర్చుంటున్నారు. ఇంటి నుండే క్యారేజీ తెచ్చుకుని ప్రతి రోజూ సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. అక్కడికక్కడే పాటలు, నాటికలు రాసుకుని పాడుకుంటున్నారు. విచిత్ర వేషాలు, వినూత్న కార్యక్రమాలు చేస్తూ ఉద్యమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళుతున్నారు. ఇవన్నీ పాలకులకు కంటగింపుగా మారాయి. అందుకే ‘ఎస్మా’ అనే నల్లసర్పాన్ని బయటకు వదిలి అలజడి సృష్టించా లనుకుంటున్నారు.

అంగన్‌వాడీలకు అండగా…

                    గౌరవ వేతనంతో పని చేస్తున్న అంగన్‌వాడీల మీద, అందులో మహిళల మీద ఇంత నిర్బంధాన్ని, నిందారోపణలు చేస్తున్నారంటే రాబోయే రోజుల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర రంగాల్లోని అసంఘటిత కార్మికులు చేసే ఉద్యమాల మీద ఎంతటి ఉక్కు పాదం మోపుతారో ఊహించవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న సమ్మె అంగన్‌వాడీలదే కావచ్చు కాని ఆ సమ్మెను అణచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు భవిష్యత్‌ ఉద్యమాలకు ప్రమాదకరం. అంగన్‌వాడీల సమ్మెకు అండగా నిలవడం కేవలం అంగన్‌వాడీల వేతనాల పెంపుదలకే కాదు, రాబోయే ఉద్యమాలను కాపాడుకోవడానికి, కార్మిక హక్కులను ప్రభుత్వాలు హరించకుండా నివారించుకోవడానికి అత్యవసరం. నెల రోజులుగా పట్టుదలగా పోరాడుతున్న అక్కచెల్లెళ్లలో ఉద్యమ దీక్ష పెరుగుతుందే తప్ప తగ్గడంలేదు. ఇప్పుడు వారికి కావలసింది తోటి కార్మికుల, ఉద్యోగుల, ఉపాధ్యాయుల మద్దతు. సమ్మె శిబిరాల్లో నాయకుల మద్దతే కాదు, సంఘాల సభ్యుల భౌతిక మద్దతు, ప్రజల్లో ప్రచారం చేయడం ద్వారా వారి మద్దతు, ఆర్థికంగా సహకరించి అండగా నిలబడే సంఘీభావ మద్దతు కావాలి. ఈ ఉద్యమం జయప్రదమైతే ప్రత్యక్షంగా అది అంగన్‌వాడీలకు కొంత ఆర్థిక ప్రయోజనం కల్పిస్తుంది. కాని ప్రభుత్వం జయప్రదమైతే మొత్తం కార్మిక, ఉద్యోగ వర్గాలకే అత్యంత ప్రమాదకరంగా మారుతుంది.

అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మె సందర్భంగా విషాదకర సంఘటనలు జరిగాయి. సమ్మెకు మద్దతుగా నిలచిన పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ షాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రాజెక్టు తరుణవాయి గ్రామానికి చెందిన వనమ్మ, అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మడివరం ప్రాజెక్టు టి.కొత్తపల్లి ఆయా సుగుణమ్మ గుండెపోటుతో సమ్మె శిబిరాల్లోనే మరణించారు.

కమ్యూనిస్టులపై అక్కసు ఎందుకు ?

ఉద్యమిస్తున్న వారికి అండగా నిలిచే కమ్యూనిస్టులపై అక్కసు వెళ్లగక్కడం పాలకులకు కొత్త కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్మిక, ప్రజా పోరాటాల్లో పాల్గొనడం, కమ్యూనిస్టులను కీర్తించడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమాలను అణచివేయడం, కమ్యూనిస్టులను దూషించడం పాలకుల అనైతిక విధానం. ప్రతిపక్షంలో ఉంటే ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం అని గర్జించండం, అధికారంలోకి వచ్చిన తర్వాత అప్రజాస్వామికంగా వ్యవహరించడం వారి ఓట్ల రాజకీయాల స్వార్థ రీతి. అలా పూటకో రీతిగా కమ్యూనిస్టులు ఉండరు, ఉండలేరు. కాబట్టే కమ్యూనిస్టులంటే పాలకులకు భయం. ఢిల్లీలో జరిగిన రైతుల పోరాటమైనా గల్లీలో జరిగే అంగన్‌వాడీల సమ్మె అయినా ఉద్యమించే వారి పక్షాన నిలవడం కమ్యూనిస్టుల, ప్రజాతంత్రవాదుల బాధ్యత. అన్ని పార్టీలు ఓట్ల చుట్టూ తిరిగుతుంటే…ప్రజల కష్టాల చూట్టూ, వారు చేసే పోరాటాల చుట్టూ నిస్వార్థంగా అండగా నిలవడం మార్క్సిస్టుల నీతి.

/ వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు /వి. రాంభూపాల్‌
/ వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు /వి. రాంభూపాల్‌
➡️