కేక్స్‌తో.. ఖుషీఖుషీగా..

Dec 24,2023 12:27 #Sneha

పండుగలు.. బర్త్‌డేస్‌.. రిటన్‌ గిఫ్ట్స్‌.. ఇలా ఏ అకేషన్స్‌కైనా కేక్స్‌ సర్వ సాధారణం అయిపోయాయి. వాటితో పాటు చాకొలేట్స్‌, బిస్కెట్స్‌ ఉంటే పిల్లలకు పండుగే పండుగ. కాలాభావం కారణంగా వాటిని షాపుల్లో కొని, ఆర్డర్‌ చేసి తెప్పించుకుని సెలబ్రేషన్స్‌ చేసుకోవడం పరిపాటి అయింది. దానికంటే.. కాస్త శ్రద్ధపెట్టి మనమే వాటిని సులభంగా ఇంట్లో తయారు చేసుకుంటే.. ఆహా! పిల్లల లుక్కే వేరబ్బా! మరి వచ్చే క్రిస్‌మస్‌ పండక్కి రసాలూరే రుచులు.. ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం.

కేక్‌..

కావలసినవి : మైదా – కప్పు, పాలు – 1/2 కప్పు, వెనిగర్‌ – స్పూను, పంచదార – 1/2కప్పు, రిఫైన్డ్‌ ఆయిల్‌, కరిగిన వెన్న లేదా బటర్‌ – 1/4 కప్పు, తాజా పెరుగు – 1/2 కప్పు, వెనీలా ఎసెన్స్‌ – స్పూను, బేకింగ్‌ పౌడర్‌ – స్పూను, బేకింగ్‌ సోడా – 1/2 స్పూను, ఉప్పు – చిటికెడు

తయారీ : ఒక గిన్నెలో కాచి చల్లార్చిన పాలకు వెనిగర్‌ కలిపి పక్కనుంచాలి. పంచదారను మెత్తగా మిక్సీ పట్టుకొని మరో వెడల్పు గిన్నెలోకి తీసుకోవాలి. దానిలో నూనె లేదా వెన్న, పెరుగు, వెనీలా ఎసెన్స్‌ వేసి సిల్కీగా (2,3 నిమిషాలు) వచ్చేంత వరకూ కలపాలి. ఇప్పుడు మైదా, బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా, ఉప్పు వేసి కట్‌ అండ్‌ ఫోల్డ్‌ పద్ధతిలో కలపాలి. అవన్నీ కలిశాక వెనిగర్‌ వేసిన పాలుపోసి అదే పద్ధతిలో కలపాలి. వెడల్పు పాత్ర లోపల ఆయిల్‌ రాసి ఈ కేక్‌ మిశ్రమాన్ని పోసి కింద రెండు మూడు సార్లు తట్టాలి. పాత్ర అడుగున డ్రైఫ్రూట్స్‌ ముక్కలు వేసుకోవచ్చు. కుక్కర్‌లో చిన్న స్టాండ్‌ పెట్టుకుని మీడియం ఫ్లేం మీద కేక్‌ను ఉడికించాలి. దాదాపు 25 నుంచి 30 నిమిషాలకు ప్లప్ఫీకేక్‌ రెడీ అవుతుంది. కేక్‌ను ప్లేట్‌లోకి తీసుకుని క్రీమ్‌తో అలంకరించుకోవచ్చు. రుచికరమైన ఆరోగ్యకరమైన కేక్‌తో పండుగను పసందుగా జరుపుకోవచ్చు.

చాక్లెట్‌..

కావలసినవి : డార్క్‌ చాక్లెట్‌ – 300 గ్రా., కండెన్స్‌డ్‌ మిల్క్‌ – 400 గ్రా., వాల్‌నట్స్‌ ముక్కలు – 1/4 కప్పు, కోకోపౌడర్‌ – స్పూను, వెనీలా ఎసెన్స్‌ – 1/2 స్పూను, చాకొలేట్‌ మౌల్డ్‌

తయారీ : (ప్రాసెస్‌ పూర్తి అయ్యేవరకూ స్టౌ సిమ్‌లోనే ఉంచాలి) వాల్‌నట్స్‌ను చిన్న ముక్కలుగా చేసుకుని దోరగా వేయించుకోవాలి. అదే పాన్‌లో డార్క్‌చాక్లెట్‌ ముక్కలు, కండెన్స్‌డ్‌ మిల్క్‌ తీసుకోవాలి. పూర్తిగా కరిగే వరకూ ఆపకుండా తిప్పుతూనే ఉండాలి. కాస్త ఏమరుపాటుగా ఉన్నా అడుగంటి రుచి మారిపోతుంది. కరిగిన మిశ్రమంలో కోకోపౌడర్‌, వెనీలా ఎసెన్స్‌ చేర్చి సిల్కీగా వచ్చేంత వరకూ తిప్పుతూనే ఉడికించాలి. తర్వాత మౌల్డ్స్‌లో వేయించుకున్న వాల్‌నట్స్‌ ముక్కలు కొన్ని చల్లి, ఈ మిశ్రమాన్ని పోసి కింద రెండు సార్లు తట్టాలి. చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టి రాత్రంతా ఉంచాలి. అంతే యమ్మీ యమ్మీ చాక్లెట్స్‌ రెడీ.

బిస్కెట్లు..

కావలసినవి : మైదా పిండి-13/4 కప్పు, బ్రౌన్‌ షుగర్‌ – 190 గ్రా., డార్క్‌ చాక్‌లెట్‌, మిల్క్‌చాక్లెట్‌ ముక్కలు – 1/2 కప్పు, వాల్‌నట్స్‌ ముక్కలు – 1/2 కప్పు, గుడ్డు – ఒకటి, కార్న్‌ఫ్లోర్‌ – స్పూను, బేకింగ్‌ సోడా – 1/2 స్పూను, ఉప్పు – 1/4 స్పూను, బటర్‌ – 115 గ్రా., వెనీలా ఎసెన్స్‌ – స్పూను

తయారీ : ఒక వెడల్పు గిన్నెలో బటర్‌, బ్రౌన్‌షుగర్‌లను కాస్త కలిసేలా కలపాలి. గుడ్డు, వెనీలా వేసి మరలా కలిపితే మిక్చర్‌ కాస్త పలుచనయి బాగా కలుస్తుంది. వీలైతే విస్కర్‌తో కలపొచ్చు. దీనిలో మైదా, బేకింగ్‌ సోడా, ఉప్పు జల్లెడపట్టి కట్‌ అండ్‌ ఫోల్డ్‌ పద్ధతిలో కలపాలి. కాస్త కలిసిన తర్వాత చాక్లెట్‌, వాల్‌నట్స్‌ ముక్కలు కూడా కలిపి మరల కట్‌ అండ్‌ ఫోల్డ్‌ పద్ధతిలోనే కలపాలి. పిండి కలిపేటప్పుడు కానీ, ఉండలు చేసేటప్పుడు కానీ గట్టిగా నొక్కి చేయకూడదు. గులాబ్‌జామ్స్‌ చేసినట్లు సున్నితంగా ఉండలు చేసి, కుక్కర్‌లో దాదాపు 45 నిమిషాల నుంచి గంట సేపటికి క్రంచీ బిస్కెట్లు రెడీ.

(వీటి తయారీకి ఒవెన్‌ లేకపోతే.. కుక్కర్‌ అడుగున కళ్ళుప్పు కానీ, ఇసుక గానీ సమంగా పరిచి విజిల్‌, గాస్‌కట్‌ పెట్టకుండా పదిహేను నిమిషాలు ముందుగానే వేడి చేయాలి. ఒవెన్‌లో 180 డిగ్రీల సెంటీగ్రేల‌ దగ్గర 12 నుంచి 14 నిమిషాలు)

➡️