విజేతలు.. విభిన్న ప్రతిభావంతులు..

Dec 3,2023 12:53 #Sneha

నాటి ఐన్‌స్టీన్‌, న్యూటన్‌, లూయిస్‌ బ్రెయిలీ, హెలెన్‌ కెల్లర్‌, స్టీఫెన్‌ హాకింగ్‌ నుంచి నిక్‌ ఉయిచిచ్‌, ఇరా సింఘాల్‌, సుధాచంద్రన్‌ వరకూ.. ఇలా.. ఎవరి జీవితాన్ని తీసుకున్నా స్ఫూర్తి ఎగసిపడుతుంది. వారంతా పట్టుదలకు మారుపేరు. కఠోర శ్రమకు, ఆదర్శ జీవితాలకూ వన్నెలద్దిన వారు. సభ్య సమాజం నుంచి ఎన్ని ఈసడింపులు ఎదురైనా ఆత్మవిశ్వాసమే ఊపిరిగా అనితర సాధ్యమైన మార్గంలో పయనిస్తూ నూతన శకానికి నాంది పలికిన వారు. వికలాంగులే అయినప్పటికీ వారు కొత్త ఊపిరిలూదారు. అసలు వైకల్యం అంటేనే పెద్ద సవాలు. దాన్ని ఎదరించి మొక్కవోని దీక్షతో నేడు ముందుకు సాగుతున్నారు. లక్ష్యం ఎంతటి కష్టమైనదైనప్పటికీ దూసుకెళ్లడానికి సై అంటున్నారు. శ్రమిస్తే అసాధ్యమైనదంటూ ఏదీ లేదని నిరుపిస్తూ ‘విభిన్న ప్రతిభావంతులు’గా నిలుస్తున్నారు. అలాంటి వైకల్య బాధితుల ఈతిబాధలను, స్ఫూర్తి ఘట్టాలను తెలిపేదే ఈ ప్రత్యేక కథనం..

            ప్రపంచ జనాభాలో 15 శాతం మంది లేదా కనీసం వంద కోట్ల మంది ఏదో ఒక రకమైన వైకల్యంతోనే ఉంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) వైకల్యంపై విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. పేదరికం వల్ల ఉత్పన్నమవుతున్న వైకల్యం భారత్‌ లాంటి దేశాల్లో మరింత అధికం. 2011 నాటికే దేశంలో తక్కువలో తక్కువుగా 7 – 10 కోట్ల మంది వికలాంగులు ఉన్నట్టు క్షేత్రస్థాయి గణాంకాలు చెబుతున్నాయి. ఇది మన జనాభాలో పెద్ద భాగమే. అయినా వారిని ప్రధాన స్రవంతిలో ఎక్కడా చూడం. అంతమాత్రాన వీళ్లంతా మన మధ్యలో లేరని కాదు. ఒక జాతిగా, దేశంగా మనం వారిని ప్రధాన స్రవంతిలో కలపడంలో నిర్లక్ష్యం వహించాం.

మానవహక్కుల సమస్యగా..

ప్రపంచాన్ని నేటికీ వైకల్య సమస్య పట్టి పీడిస్తోంది. మానవ శరీరంలో దైనందిక కార్యక్రమాలు చేసుకునేందుకు అవసరమైన ఏ అవయవం పనిచేయకపోయినా అతను వికలాంగుడే. ఐక్యరాజ్యసమితి కూడా దీన్నే ధ్రువీకరించింది. అయితే వైకల్యం అనే పదానికి వివిధ దేశాలు పలు పలు విధాలుగా నిర్వచనాలు ఇచ్చుకున్నాయి. చైనా, బ్రిటన్‌ వంటి దేశాలు మంచి నిర్వచనాలు ఇవ్వడమే కాకుండా సంక్షేమానికీ పెద్దపీట వేశాయి. కేవలం వైద్యుని నిర్ధారణతో మాత్రమే భారతదేశంలో వైకల్యాన్ని చూస్తున్నారు. వైకల్య శాతం 40 కన్నా ఎక్కువగా ఉంటేనే ఇక్కడ ప్రభుత్వ పథకాలకు అర్హులు. ఇది ఎంతోమంది ఎదుగుదలకు పెద్ద అవరోధంగా ఉంది. వైకల్యాన్ని పలు రకాలుగా విభజించి చూడొచ్చు. వైకల్య బాధితులను మన దేశంలో ‘వికలాంగులు, విభిన్న ప్రతిభావంతులు, ప్రత్యేక అవసరాల వ్యక్తులు, దివ్యాంగులు’ అని పిలుస్తున్నారు.

వైకల్య రకాలు

భారత్‌తో వికలాంగుల చట్టం – 2016 ప్రకారం 21 రకాల వైకల్యాలను గుర్తించారు. అవి శారీరక వైకల్యం, వినికిడి వైకల్యం, అంధత్వం, తక్కువ చూపు వైకల్యం, మేధోపర వైకల్యం, మరుగుజ్జుతనం, కుష్టువ్యాధి, మెదడు పక్షవాతం. ఆటిజం, మానసిక ప్రవర్తన వైకల్యం, కండరాల బలహీనత, తీవ్రస్థాయి నరాల సంబంధిత వైకల్యం, ప్రమాణ స్థాయిలో నేర్చుకునే శక్తి తక్కువుగా ఉండే వైకల్యం, బహుళ వైకల్యం, మాటలో స్పష్టత లేకపోవడం, తలసేమియా, హిమోఫిలియా, సికిల్‌ సెల్‌ ఎనీమియా, పార్కిన్‌సన్‌, యాసిడ్‌ బాధిత వైకల్యం. దేశాల వారీగా చూస్తే అమెరికాలో 12, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో 18, జర్మనీలో 9, శ్రీలంకలో 5, పాకిస్తాన్‌లో 9 శాతం వరకూ వికలాంగులు ఉన్నారు. భారత్‌లో ఈ సంఖ్య 2.1శాతం (2 కోట్లా 19 లక్షలు) గా ఉంది.

sneha
sneha

పేదరికం – అంగవైకల్యం

అంగ వైకల్యం, పేదరికం, అనారోగ్యం వీటి మధ్య అంతర్గత సంబంధం ఉంది. పేదరికం వల్ల పోషకాహారం అందుబాటులో ఉండదు. ఇది అనారోగ్యానికి, ఆపై అంగవైకల్యానికి దారితీస్తుంది. గర్భిణులకు ఆరోగ్య వసతులు లేకపోవడం కూడా వైకల్య శిశువుల జననానికి ఆస్కారమిస్తాయి. ఐరన్‌, అయోడిన్‌, పోలిక్‌ యాసిడ్‌ లోపాలు, వ్యాధులు, ప్రమాదాలు అంగవైకల్యానికి కారణాలుగా నిలుస్తున్నాయి. వీటిని అధిగమిస్తేనే వైకల్య రహిత సమాజం సుసాధ్యం. 1991 నుంచి నూతన ఆర్థిక విధానాలను మన దేశంలో ప్రభుత్వాలు శరవేగంగా అమలు చేస్తున్నాయి. ఫలితంగా రోజురోజుకూ ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పౌష్టికాహారం తీసుకోలేని కుటుంబాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఫలితంగా పుట్టబోయే పిల్లలు వైకల్యం బారిన పడుతున్నారు. జనాభాలో కేవలం 46.37 శాతం మంది మాత్రమే జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలో ఉన్నారు. దేశంలో 10 మంది పిల్లల్లో నలుగురు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. సరిగ్గా ఇలాంటివారే వైకల్యులుగా మారుతున్నారు. కొన్ని వ్యాధులకు ప్రాథమిక దశలోనే చికిత్సనందిస్తే సరిపోతుంది. కానీ పేద కుటుంబాలు ఆర్థిక పరిస్థితి సరిలేక ఆసుపత్రులకు వెళ్లేందుకు మొగ్గు చూపడం లేదు. ఫలితంగా మరికొందరు అంగవైకల్యం బారిన పడుతున్నారు. ‘పేదరికం-వైకల్యం’ మధ్య సంబంధం ఉందని 2014లో వరల్డ్‌ డిజేబులిటీ రిపోర్టు, డబ్ల్యుహెచ్‌ఒ పేర్కొన్నా ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదు. పేదలకు సరైన పౌష్టికాహారం, వైద్య సదుపాయాలు కల్పించడం లేదు.

మతోన్మాదమూ కారణమే..

దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వికలాంగుల సంక్షేమం మరింత కుంటుపడింది. మత విద్వేషాలు పెరగడం మూలంగా బిజెపి పాలిత రాష్ట్రాల్లో అల్లర్లు, దాడులు పెచ్చురిల్లాయి. ఆర్‌ఎస్‌ఎస్‌, భజరంగదళ్‌, విశ్వ హిందూ పరిషత్‌, గో రక్షక దళాల దాడుల్లో మైనార్టీలు తీవ్రంగా గాయ పడి వైకల్యం బారినపడ్డారు. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రంలో పారా మిలిటరీ బలగాలు పేలట్‌ గన్స్‌ను ఇష్టానుసారంగా ఎక్కుపెడుతుండటం తో అంగవైకల్యం బారిన పడినవారు క్రమేపీ పెరుగుతున్నారు. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో మత విద్వేషకులు దాడులకు తెగబడటంతో వైకల్యుల శాతం పెరుగు తోంది. మోడీ వికలాంగులను ‘దివ్యాంగులు’ గా పిలవాలని, వారు చేయలేనిది ఏమీ లేదని వాగడాంబరాలకు పోయారు తప్పితే, వారి సంక్షేమానికి చేసిందేమీ లేదు.

విజేతలు
విజేతలు

అంతులేని సామాజిక వివక్ష

వైకల్యం కంటే బాధించేది, అడ్డుగా నిలిచేది సామాజిక వివక్షే. ప్రపంచ గతిని మార్చేసిన ఎంతో మంది విభిన్న ప్రతిభావంతుల సేవలు అందుకుని కూడా ఇంకా వివక్ష ఉందంటే అమానవీయమే. ప్రభుత్వాలు, సేవా సంస్థలు, దాతలు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నా వైకల్య రంగం పట్ల ఇంకా నిర్లక్ష్య ధోరణి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ చాలా చోట్ల వికలాంగులు హేళనకు గురవుతున్నారు. ‘కుంటోడు, సొట్టోడు, గుడ్డోడు, చెవిటోడు, మెంటలోడు, పిచ్చోడు, గూనోడు, కబోది’ అన్న పేర్లతో పిలుస్తున్నారు. ఇవి వికలాంగులను మరింత కుంగదీస్తున్నాయి. వికలాంగుల గణనపై భారత్‌లో తీవ్ర వివక్ష కొనసాగుతోంది. క్షేత్ర స్థాయిలో వీరు 7 -10 శాతం ఉంటారని వికలాంగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సర్వేలు చెబుతుంటే జనాభా లెక్కల్లో మాత్రం వీరు 2.1 శాతంగానే ఉన్నారు. నాడు జనాభా లెక్కల సమయంలో వీరి గణన సరిగా చేయలేదన్న విమర్శలు నేటికీ వినిపిస్తున్నాయి. మన దేశ వికలాంగుల్లో 75 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు. అక్షరాస్యతా శాతం 49 శాతంగా ఉంది. ఎస్సీ, ఎస్టీల పిల్లలు కన్నా వికలాంగ పిల్లలు ఐదు శాతం తక్కువగా స్కూళ్లకు వెళుతున్నారు. పలు సర్వేలను, జన గణనను ప్రభుత్వం నిర్వహిస్తున్నప్పుడు వికలాంగుల కోసం ఓ బ్లాక్‌ను కేటాయించినప్పటికీ 90 శాతం మంది అధికారులు, సర్వే సిబ్బంది ఆ ఆప్షన్‌ను పూరించడం లేదని ఆధారాలతో సహా వెల్లడైన విషయం. ఇది వివక్షను చాటడమే. ప్రభుత్వాలు వికలాంగులకు మద్దతునందిస్తే వారు మంచి జీవనాన్ని కొనసాగించి, ఉత్పత్తిలో భాగస్వాములు అవుతారు. దీన్ని అంతర్జాతీయ సమాజం అంగీకరించింది కూడా. కానీ నేడు ఆ పని జరగడం లేదు. ప్రభుత్వాలు క్రమేపీ బడ్జెట్‌ కేటాయింపులను తగ్గిస్తూ సంక్షేమ పథకాలను కుదించేస్తున్నాయి. దీంతో వికలాంగుల సంక్షేమం స్వచ్ఛంద సంస్థలు, కుటుంబ సభ్యుల మీద ఆధారపడి సాగుతోంది. వికలాంగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కూడా పాలకులు కల్పించడం లేదు. అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న రైల్వేలో వీరిని ఉద్యోగులుగా తీసుకోవడమే లేదు. మరోపక్క ప్రయివేటు కంపెనీల్లో వీరు 0.28 శాతం మంది మాత్రమే ఉద్యోగులుగా ఉన్నారు. ఈ సంఖ్యలే వీరు సమాజానికి ఎంత దూరంగా ఉన్నారో చెప్పకనే చెబుతున్నాయి. చట్టసభల్లో వీరి ప్రాతినిధ్యం అతి స్వల్పమనే చెప్పాలి. వికలాంగులను వివాహ కష్టాలూ వెంటాడు తున్నాయి. అత్యధికులు అవివాహితులుగా మిగిలిపోతున్నారు.

వికలాంగుల హక్కులు-చట్టాలు

వికలాంగులకు సమాన అవకాశాలు, హక్కులు కల్పించడం ద్వారా వారి మానసిక, శారీరక, శక్తి సామర్థ్యాలను సమాజ అభివృద్ధిలో మిళితం చేయాలనే లక్ష్యంతో 1981ని అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఇందులో భాగంగానే అనేక దేశాలు వికలాంగులను విలువైన మానవ వనరులుగా గుర్తించి వారికి అనేక చట్టాలు, హక్కులు కల్పించాయి. ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌, అమెరికా, కెనడా, యూరప్‌ తదితర దేశాలు.. వారి హక్కులను పక్కాగా అమలుపరిచి, వాటి ఫలితాల వల్ల అభివృద్థి పథంలో దూసుకుపోతున్నాయి. కానీ భారత్‌లో దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. మన దేశంలో వికలాంగుల చట్టాలు, పథకాలు కింది విధంగా ఉన్నాయి.

విజేతలు
విజేతలు

మెంటల్‌ హెల్త్‌ యాక్ట్‌ : మానసిక వికలాంగుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు దీన్ని 1993లో రూపొందించారు. దీని ప్రకారం వికలాంగులకు రక్షణ, పునరావాస సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వ, ప్రయివేటు ఆధ్వర్యంలో సంస్థలను ఏర్పాటు చేస్తారు.

జాతీయ ట్రస్టు చట్టం : ఆటిజం, సెరిబ్రల్‌ పాల్పి, బుద్ధి మాంద్యం, బహుళ అంగ వైకల్యాలతో బాధపడే వారి కోసం దీన్ని 1999లో రూపొందించారు.

యుఎన్‌సిపిఆర్‌డి ఒప్పంద పత్రం : భారత ప్రభుత్వ క్యాబినెట్‌ సిఫార్సులతో 2007 అక్టోబర్‌ 1న రాష్ట్రపతి దీనిని ఆమోదించారు. వికలాంగులు ఇతరులతో సమానంగా జీవించే హక్కును, భద్రతను, స్వాభిమానాన్ని పెంచడమే ఈ ఒప్పంద ముఖ్యోద్దేశం.

2016 వికలాంగుల చట్టం : వికలాంగుల ఆత్మగౌరవం, సంక్షేమం కోసం ఎన్నో పోరాటాల ఫలితంగా రూపుదిద్దుకుందీ చట్టం. చట్టం అమల్లోకి వచ్చి ఏడేళ్లు అవుతున్నా, ఇప్పటివరకూ ప్రభుత్వాలు దీన్ని సక్రమంగా అమలుచేయడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో నేటికీ దీనికి డ్రాఫ్ట్‌ రూల్స్‌ను రూపొందించలేదు. నూతన చట్టంలో వికలాంగులకు విద్యలో ఐదు శాతం, ఉద్యోగాల కల్పనలో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని, రవాణా రంగంలో అవసరమైన సదుపాయాలను అందుబాటులోకి తేవాలని, ప్రత్యేక బోధనా పద్ధతులు అవలంబించాలని, వికలాంగుల ఆత్మగౌరవానికి భంగం కలిగించేవారికి కఠిన శిక్షలు విధించాలని స్పష్టంగా ఉంది.

పై చట్టాలతో పాటు ఇన్‌క్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ డిజేబుల్‌ సెకండరీ స్టేజ్‌ పథకం, దీనదయాల్‌ డిసేబుల్డ్‌ రిహాబిలిటేషన్‌ స్కీం (డిడిఆర్‌ఎస్‌), నేషనల్‌ హ్యాండీక్యాప్డ్‌ ఫైనాన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌ఎఫ్‌డిసి) వంటివి సంక్షేమానికి ఉద్దేశించబడ్డాయి. ఎడ్యుకేషన్‌, ఎంప్లాయిమెంట్‌, ఒకేషనల్‌ ట్రైనింగ్‌, పరిశోధన, మానవ వనరుల అభివృద్ధి, పునరావాసం తదితర సమస్యలపైనా, వికలాంగులను ప్రధాన స్రవంతిలో భాగస్వాములను చేయడంపైనా ఇడిడిఆర్‌సిఎస్‌, సిఆర్‌సిఎస్‌లు పనిచేస్తున్నాయి. దేశ వ్యాపితంగా పట్టణ ప్రాంతాల్లో బస్సులపై వికలాంగులు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. జిల్లాల్లో టిక్కెట్‌పై 50 శాతం రాయితీ కల్పించారు. రైల్వేలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. వారితో ప్రయాణించేవారికి కూడా 50 శాతం రాయితీ అందిస్తున్నారు. ఇవే కాకుండా పింఛన్లు, వైకల్యోపకరణాలు, రుణాలు అందిస్తున్నారు. పలు వసతి గృహాలు నడుస్తున్నాయి. స్కాలర్‌షిప్పులు అందిస్తున్నారు. వాహనాలు, ర్యాంపు సౌకర్యాలు కల్పిస్తున్నారు. వికలాంగుల విద్య కోసం పనిచేసే ఎన్‌జిఒలకు నిధులు కేటాయిస్తున్నారు. అయితే వికలాంగ జనాభా నిష్పత్తికి తగ్గట్టుగా వీటిని అమలు చేయడంలో వైఫల్యం కనిపిస్తోంది.

నిత్య స్ఫూర్తి స్టీఫెన్‌ హ్యాకింగ్‌

కృష్ణబిలాలు, వర్మ్‌హోల్స్‌, గ్రహాంతర వాసులు, క్వాంటమ్‌ మెకానిక్స్‌, టైమ్‌ ట్రావెల్‌.. మొత్తానికి ఓ కాలం చరిత్రను కథలా చెప్పేసిన మహా శాస్త్రవేత్త స్టీఫెన్‌ హ్యాకింగ్‌. ఆయన లేని మానవ చరిత్రను ఆమోదించలేం. శాస్త్ర ప్రపంచంలో నేటి ఐన్‌స్టీన్‌గా కొలుస్తున్న స్టీఫెన్‌ విశ్వాన్నంతటినీ శోధించింది రెండు చక్రాల కుర్చీలో కూలబడే. మాట పెదవి దాటలేనంతగా వైకల్యం కుదించేసినా స్టీఫెన్‌ కృత్రిమ పరికరంతోనే శాస్త్ర ప్రపంచాన్ని కుదిపేసే సిద్ధాంతాన్ని వెలువరించారు. మెదుడులోనే విశ్వ విద్యాలయాన్ని తెరిచేసి విశ్వ రహస్యాల్ని శోధించారు. ఆయన జీవితం ఆధారంగా తీసిన ‘ది థియరీ ఆఫ్‌ ఎవ్రీథింగ్‌’ చిత్రానికి ఆస్కార్‌ అవార్డులు వస్తే లక్షలాది మందిలో వైకల్యాన్ని తరిమేసే ఆత్మవిశ్వాసం రివార్డు అయ్యింది. ఆయన 1963లో తన 21వ జన్మదినం తరువాత అత్యంత అరుదైన యామ్యోట్రోఫిక్‌ లేటరల్‌ సెలరోసిస్‌ అనే మోటార్‌ న్యూరోన్‌ వ్యాధి బారిన పడ్డారు. లూ గెహ్రిగ్‌ వ్యాధిగా కూడా పిలిచే దీనితో ఆయన తీవ్ర శారీరక అచేతనతో పూర్తి పక్షవాతానికి గురయ్యారు. ఆక్స్‌ఫర్డ్‌లో చివరి ఏడాది చదువుతుండగా ఓసారి మెట్లపై తూలిపడినపుడు ఈ వ్యాధి ఉన్నట్టు తెలిసింది. అయినప్పటికీ వెరవక విశ్వాంతరాలను శోధించారు.

vijetalu

నాట్యమంటేనే సుధాచంద్రన్‌

సుధాచంద్రన్‌ భారతీయ భరత నాట్య నృత్యకారిణి, నటి. తాను 1981 జూన్‌ నెలలో తమిళనాడులోని త్రీచీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయారు. అనంతరం కృత్రిమ కాలితో నాట్య ప్రదర్శనలు ఇచ్చి, అందరినీ విస్మయపరిచారు. వేల ప్రదర్శనలతో వందలాది అవార్డులను అందుకున్నారు. ఆమె తెలుగులో తన జీవితగాథను ఆవిష్కరిస్తూ ”మయూరి” సినిమాతో నట ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనేక సినిమాలు, టెలివిజన్‌ ధారావాహికల్లో ఆమె నటించారు. ఆమెది కేరళలోని కన్నూర్‌ ప్రాంతం. పేద తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి, పట్టుదలతో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించారు.

పట్టుదలకు మారుపేరు మరికొందరు

జర్సికా పట్టుదలకు మారుపేరు. పుట్టుకతోనే ఆమెకు చేతులు లేవు. అయితేనేం కాళ్లతో విమానం నడిపిన ఏకైక పైలెట్‌గా గిన్నిస్‌ రికార్డు సాధించారు. గద్వాల రాజు ప్రమాదంలో చేతి వేళ్లను పోగొట్టుకున్నా కుంచె పట్టుకుని ఆత్మస్థైర్యంతో అంగవైకల్యం శరీరానికేగానీ మనసుకు కాదంటూ చాటి చెప్పారు. పోలియోతో రెండు కాళ్లూ పోగొట్టుకున్న పద్మప్రియ రంగస్థలంపై అందరినీ మెప్పించి, రాష్ట్రపతి అవార్డుతో సహా ఎన్నో అవార్డులను గెలిచి ఆదర్శంగా నిలిచారు. విజయవాడకు చెందిన అంథురాలైన సుబ్బలక్ష్మి లలిత సంగీతంలో ఉవ్వెత్తున ఎగిసి పడ్డారు. మరో కళాకారిణి స్వాతి చూపు లేకపోయినా యాంకరింగ్‌ చేస్తూ టీవీ ఛానళ్లలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

వైకల్య ఆధారిత సినిమాలకు కాసుల వర్షం..

అటు బాలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌ రెండింటిలోనూ వైకల్య అధారిత సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. ”బర్ఫీ, మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌, తేరే జమీనా ఫర్‌, బ్లాక్‌, ఇక్బాల్‌, కోయి మిల్‌ గయా, ఆంకెన్‌, సద్మా, ఫా, భజరంగీ భాయిజాన్‌” తదితర సినిమాలు బాలీవుడ్‌లో కొత్త రికార్డులు నెలకొల్పాయి. తెలుగులో వచ్చిన ”మయూరి, ఆరాధన, ప్రేమించు, సిరివెన్నెల” వంటి చిత్రాలు అద్భుత కళాఖండాలుగా నిలిచిపోయాయి. ఇవే కాదండోరు వికలాంగుల సన్నివేశాలు ఉన్న ఎక్కువ సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు.

అరుణిమ ముందు చిన్నబోయిన ఎవరెస్టు

మృత్యువు అంచుల్లో నిలబడి, ఆఖరి శ్వాసలో విజయగీతం ఆలపించిన యువతి కథ ఇది. మరణ మృదంగంలో అమరనాదం వినిపించిన సబల కథ ఇది. ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌ నగర్‌లో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సాదాసీదా అమ్మాయి అరుణిమా సిన్హా. పట్టుదలతో వాలీబాల్‌, ఫుట్‌బాల్‌ క్రీడల్లో జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగారు. అయితే 2011 ఏప్రిల్‌ 11న ఢిల్లీలో జరిగే ఇంటర్వ్యూకు బయలుదేరిన ఆమె జీవితం మలుపు తిరిగింది. ఆమె ఎక్కిన జనరల్‌ బోగీలోకి ప్రవేశించిన కొందరు దుండగులు నగదును దోచుకునేందుకు యత్నించారు. తీవ్రంగా ప్రతిఘటించిన ఆమెను నడుస్తున్న రైలులోంచి బయటకు విసిరేశారు. పక్కనే ఉన్న పట్టాలపై ఆమె పడిపోగా, మరో రైలు ఆమె కాళ్లపై నుంచి వెళ్లిపోయింది. అనంతరం కోలుకున్నాక, కృత్రిమ కాళ్లు అమర్చుకుని, ఎవరెస్టు శిఖరం ఎక్కాలని అరుణిమ నిశ్చయించుకున్నారు. 52 రోజులపాటు ఎముకలను కొరికేసే చలిలో సైతం ప్రయాణించి.. 2013 మే 21 నాటికి శిఖరాగ్రాన్ని చేరారు. ప్రపంచంలోనే ఎత్తెన శిఖరాన్ని అధిరోహించిన వికలాంగ మహిళగా అరుణిమ చరిత్రకెక్కారు.

కోడూరు అప్పలనాయుడు – 9491570765

➡️