ఎవరీ ఉత్తర భారత పెరియార్‌ – లలై సింగ్‌ ?

Feb 9,2024 07:15 #Editorial

                    ద్రవిడోద్యమ నాయకుడు, సంఘసంస్కర్త ఇ.వి.రామస్వామి పెరియార్‌ ‘కీమాయణాన్ని’ తొలిసారి ‘సచ్చీ రామాయణ్‌’ శీర్షికతో హిందీలోకి అనువదించిన రచయిత లలై సింగ్‌ యాదవ్‌. ఆ స్క్రిప్టు చూసి యు.పి నుండి ఢిల్లీ దాకా ఏ ప్రచురణకర్తా ముందుకు రాలేదు. మనువాదులు సృష్టించిన భయం అందుకు కారణం. అప్పుడాయన తన 15 ఎకరాల భూమి అమ్మి ఒక ప్రింటింగ్‌ ప్రెస్సే ప్రారంభించాడు. అందులో సచ్చీ రామాయణ్‌ ప్రచురించాడు. అయితే అది గొప్ప సంచలనమయ్యింది. హిందూ ధర్మ పరిరక్షకులమని భావించే వారంతా తమ ధార్మిక భావనలు దెబ్బ తిన్నాయని పెద్ద ఎత్తున రోడ్డెక్కి ప్రదర్శనలిచ్చారు. వారి ఒత్తిడికి తలొగ్గిన ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం, గజెట్‌ 20 డిసెంబర్‌ 1961న విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆ పుస్తకం హిందీ, ఇంగ్లీషు ప్రతుల్ని జప్తు చేసుకుంది. న్యాయం కోసం లలై సింగ్‌ అలహాబాదు హైకోర్టు తలుపు తట్టాడు.

ఈ పుస్తకం అధిక సంఖ్యాకులైన హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తోందనీ, పుస్తకాన్ని నిషేధించడం అవసరమని ప్రభుత్వ లాయరు తన వాదన వినిపిం చాడు. లలై సింగ్‌ పక్షాన వాదించిన అడ్వొకేట్‌ ‘సచ్చీ రామాయణ్‌’ ఔన్నత్యాన్ని బలంగా వినిపించి, కేసును నెగ్గిం చారు. 1971 జనవరి 19న జస్టిస్‌ ఎ. కీర్తి వెలువరించిన తీర్పు-రెండు మూడు విషయాలు స్పష్టం చేసింది. దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది కాబట్టి, మూల రచయిత పెరియార్‌ రామసామి తన అభిప్రాయాలు తెలియజేశారనీ, ఈ లలై సింగ్‌ కేవలం పెరియార్‌ పుస్తకాన్ని అనువదించాడని, ఇది అంత తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదని చెప్పింది. బహుజన క్రాంతి నాయకుడైన లలై సింగ్‌ గెలిచి, మనువాదుల నోళ్ళు వారి చేతిలో కీలుబొమ్మగా మారిన ఆనాటి ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం వారి నోరూ మూయించాడు. పెరియార్‌ ఇ.వి. రామసామి ఆలోచనల్ని జనంలోకి బాగా తీసుకు పోయినందుకు జనం లలై సింగ్‌ను ‘ఉత్తర భారత పెరియార్‌’ అని పిలుచుకున్నారు.

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అంతటితో ఆగి-తన గౌరవం కాపాడుకుంటే బాగుండేది. కానీ తను తీసుకున్న చర్చలకు విరుద్ధంగా తీర్పు వచ్చినందుకు కేసును మళ్ళీ సుప్రీంకోర్టుకు తీసుకెళ్ళింది. సుప్రీంకోర్టు 1976 సెప్టెంబర్‌ 16న పుస్తక రచయిత, ప్రచురణకర్త అయిన లలై సింగ్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించిది. అంటే-అలహాబాదు హైకోర్టు ఇచ్చిన తీర్పు సబబుగా ఉందని సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేసింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ వాదనను తిప్పికొట్టింది. పెరియార్‌ ఇ.వి. రామసామి భావజాలానికి బాగా ఆకర్షితుడైన లలైసింగ్‌, ఆయన నాయకర్‌ను వదిలేసిన విధంగా-ఈయన కులం గుర్తుగా ఉన్న యాదవ్‌ను వదిలేశాడు. కాన్పూర్‌ దగ్గర ఏదో చిన్న ఊళ్ళో ఉండేవాడు. పెద్ద పెద్ద కోర్టులలో ఏళ్ళకేళ్ళు పోరాడి కేసులు గెలుస్తూ, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా తన చర్యను సమర్థించు కున్నందుకు సమాజం ఉలిక్కిపడింది. అందరి దృష్టి లలైసింగ్‌పై పడింది. ఎవరీ లలై సింగ్‌ యాదవ్‌? ఏమిటీ సచ్చీ రామాయణ్‌-అని తెలుసుకోవడం ప్రారంభించారు. క్రమంగా లలై సింగ్‌ దళిత, బహుజన నాయకుడిగా స్వాతంత్య్ర సమరయోధుడిగా ఎదుగుతూ పెరియార్‌ రామసామి ధోరణిలో రచనలు చేయడం ప్రారంభించాడు.

చౌధరీ లలై సింగ్‌ యాదవ్‌ (1 సెప్టెంబర్‌ 1911-7 ఫిబ్రవరి1993) ఉత్తర ప్రదేశ్‌ కాన్పూర్‌ దేహాత్‌ జిల్లాలో జిజక్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో కఠారా గ్రామంలో చౌధరీ గజ్జుసింగ్‌ యాదవ్‌, మూలాదేవి దంపతులకు జన్మించాడు. 1911లో దేశం ఒకవైపు బ్రిటీషు పాలనలో ఉంది. మరోవైపు మనువాదుల ఆధిపత్యంలో ఉంది. వీరిది ఆస్థిపాస్తులున్న సంపన్న కుటుంబమే, కానీ బ్రాహ్మణవాద ప్రభావం వల్ల సమాజంలో అణగిమణగి ఉండాల్సి వచ్చేది. శూద్రులయినందువల్ల ఆ గ్రామంలో చదువుకునే అవకాశం ఉండేది కాదు. ఇష్టమైన బట్టలు వేసుకోవడానికి లేదు. అత్యంత సాధారణ జీవితం గడపాల్సి వచ్చేది. ఆ రోజుల్లో శూద్రుల స్థాయి ఎలా ఉండేదో ఒక సంఘటన చూద్దాం! ఊళ్ళో ఎవరి ఇంట్లో పెళ్ళయినా, మహిళలంతా పెళ్ళి ఇంటికి వెళ్ళి పనుల్లో సహాయపడేవారు. ఒకసారి ఒక అగ్రవర్ణం వారి పెళ్లి పనులు చేయడానికి లలై సింగ్‌ తల్లి వెళ్ళింది. బయట ఉండి బయటి పనులు చేయకుండా తనకు వంట బాగా వచ్చు గనక, నేరుగా వంటశాలకు వెళ్ళింది. అక్కడ ఉన్న అగ్రశ్రేణి మహిళలంతా ఆమెను అవహేళన చేశారు. నానామాటలు అన్నారు. వివక్షకు వ్యతిరేకంగా పోరాడే ఆత్మస్థైర్యాన్ని తమ పుత్రుడికివ్వాలని ఆ రోజే ఆ దంపతులు నిర్ణయించుకున్నారు.

గజ్జూసింగ్‌ అభ్యుదయ భావాలు గలవాడు గనుక తన కొడుకు విద్యావంతుడు కావాలనీ, సంఘసంస్కర్తగా మారాలనీ కలలుగనేవాడు. తన పరిధిలో తాను కొన్ని దురాచారాలకు ఎదురు తిరిగేవాడు. సమాజంలో సవరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని గ్రహిస్తూ వచ్చాడు లలై సింగ్‌. తండ్రి ప్రోత్సాహానికి తోడు, తనకు కూడా ఆసక్తి ఉండడం వల్ల శ్రద్ధ చదువు మీద పెట్టాడు. దేశంలో బాల్యవివాహాలు ఉధృతంగా జరుగుతున్న రోజులవి. 18వ యేట ఫారెస్ట్‌ గార్డ్‌గా ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత 20వ యేట దులారి దేవిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత కొన్ని నెలలకే, గ్వాలియర్‌లో పారా మిలట్రీ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా కొత్త ఉద్యోగంలో చేరాడు. అక్కడ కూడా అసమానతలు, వివక్షా ఉన్న సంగతి గ్రహించి తిరుగుబాటు చేశాడు. ఒకే ఉద్యోగంలో ఉన్నప్పుడు అందరూ సమానులే కదా? కానీ, స్నానం చేసే చోట, భోజనం చేసే చోట ప్రతి విషయంలోనూ మనువాద ఆధిపత్యం కనిపించేది. అగ్రవర్ణాలనికి చెందిన కానిస్టేబుళ్ళు పైన స్నానం చేస్తే-వారు స్నానం చేసిన నీరు కిందకి పారినపుడు, ఆ నీళ్ళలో శూద్ర-నిమ్న కులాల కానిస్టేబుళ్లు స్నానాలు చేయాల్సి వచ్చేది. లలై సింగ్‌ ఆ పద్ధతిని ఎదిరించాడు. పై అధికారులకు అది క్రమశిక్షణా రాహిత్యంగా అనిపించి సస్పెండ్‌ చేశారు. పైనున్న ఒక బ్రిటీషు అధికారి అసలు విషయం తెలుసుకుందామని లలై సింగ్‌ను పిలిపించుకుని విచారించాడు. బయట సమాజంలో ఉన్న అమానవీయ విధానాలు పోలీసు – మిలట్రీ శాఖలలో కూడా ఉన్నాయని లలై సింగ్‌ వివరణ ఇచ్చుకున్నాడు. వివక్ష వికృతత్వాన్ని అర్థం చేసుకున్న ఆ బ్రిటీష్‌ అధికారి అందరూ సమానులే అని ప్రకటించాడు. పైగా లలై సింగ్‌ యాదవ్‌కు ప్రమోషన్‌ ఇచ్చి ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. ఇలాంటి అవకతవకల మీదే లలైసింగ్‌ తర్వాత కాలంలో ‘సిపాయి క తబాహీ’ అనే చిన్న పుస్తకం రాశాడు. ఉధృతంగా సాగుతున్న భారతదేశ స్వాతంత్య్రోద్యమానికి మద్దతు ప్రకటించాడు. బ్రిటీషు ఉద్యోగిగా ఉంటూ అలా చేయడం వల్ల ఐదేళ్ళు జైలు శిక్ష పడింది. ఆ రకంగా స్వాతంత్య్ర సమర యోధుడిగా చరిత్రలో నిలిచాడు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి లలైసింగ్‌ శిక్ష ఇంకా సంవత్సరం కూడా పూర్తికాలేదు. మిగతా శిక్ష పూర్తి కాకుండానే స్వతంత్ర భారతంలో విడుదలై బయటికొచ్చాడు. లలై సింగ్‌ జీవితంలో ఒకే సమయంలో రెండు పోరాటాలు చేశాడు. ఒకటి-బ్రిటీష్‌ వారితో పోరాటం! మరొకటి పెరియర్‌ రామసామి, డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ల అనుయాయిగా బ్రాహ్మణవాదులతో పోరాటం!!

భార్య, కుమార్తె చనిపోవడంతో వ్యక్తిగతంగా లలై సింగ్‌ జీవితాంతం దుఖ:మయమైన జీవితం గడపాల్సి వచ్చింది. మళ్ళీ పెళ్ళి చేసుకుని జీవితం పునరుద్ధరించుకోమని బంధుమిత్రులంతా చెప్పారు. కానీ, ఆయన అందుకు సమ్మతించలేదు. దృష్టి సమాజ ఉద్ధరణ మీద, మూఢనమ్మకాల నిర్మూలన మీద, కొనసాగుతున్న వివక్ష మీద చెయ్యాల్సిన పోరాటాల మీద పెట్టి-జీవితం కొసాగించాడు. వీటికి అదనంగా ”సచ్చీ రామాయణ్‌ కేసు” హైకోర్టు సుప్రీం కోర్టులలో ఏళ్ళకేళ్లు ఎదుర్కోవడం మామూలు విషయం కాదు. చివరికి బౌద్ధం తీసుకుని లలైసింగ్‌ బౌద్ధగా మారిపోయాడు.

(వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, రిటైర్డ్‌ బయాలజీ ప్రోఫెసర్‌ – మెల్బోర్న్‌ నుంచి) డా|| దేవరాజు మహారాజు

➡️