కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : ప్రముఖ అథ్లెట్లు   

న్యూఢిల్లీ   :     రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) నూతన పాలకమండలిపై కేంద్రం బహిష్కరణ వేటుపై ప్రముఖ అథ్లెట్లు ఆదివారం స్పందించారు. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ఈ నిర్ణయం ఆలస్యమైందని అన్నారు. స్పోర్ట్స్‌ బాడీ నిబంధనలను ఉల్లంఘించిన డబ్ల్యుఎఫ్‌ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్రం ముందుగానే స్పందించాల్సి వుందని వారు పేర్కొన్నారు. రెజ్లర్లకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఒలింపియన్‌ మరియు రెజ్లర్‌ గీతా ఫోగట్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. ”డబ్ల్యుఎఫ్‌ఐ పాలక మండలిని క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్‌ చేసింది. ఆలస్యంగానైనా రెజ్లర్లకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉంది” అని గీతా ఫోగట్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘‘ ఓ మహిళ  రెజ్లింగ్‌ను విడిచిపెడుతున్నట్లు ప్రకటించారు. మరో రెజ్లర్‌ పద్మశ్రీని వెనక్కి ఇచ్చేశారు. ఇప్పుడు రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ను సస్పెండ్‌ చేశారు. కేంద్రం ముందుగానే చర్యలు తీసుకుని ఉండాల్సింది’’ అని  ఇండియన్‌ బాక్సర్‌, ఒలింపిక్‌ పతక విజేత, కాంగ్రెస్‌ నేత విజేందర్‌ సింగ్‌ పేర్కొన్నారు.

డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్‌గా బ్రిజ్‌ భూషణ్‌ సన్నిహితుడు సంజయ్  సింగ్‌ ఎన్నికైన సంగతి తెలిసిందే. అండర్‌ 15 మరియు అండర్‌ 20 నేషనల్స్‌ యుపిలోని గోండా జిల్లాలో నందినీ నగర్‌లో ఈ ఏడాది చివరలో జరుగుతాయని కొత్తగా ఎన్నికైన డబ్ల్యుఎఫ్‌ఐ అధ్యక్షుడు సంజరు సింగ్‌ డిసెంబర్‌ 21న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చర్య డబ్ల్యుఎఫ్‌ఐ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని కేంద్రం పేర్కొంది.

➡️