Weightlifting World Cup: మీరాభాయి చానుకు ఒలింపిక్స్‌ బెర్తు

ఫుకెట్‌(థాయిలాండ్): భారత స్టార్‌ మహిళా వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. వరల్డ్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఫెడరేషన్‌ ప్రపంచకప్‌ గ్రూప్‌-బి మహిళల 49కిలోల విభాగంలో మీరాభాయి చాను మూడోస్థానంలో నిలిచింది. గత ఆసియా క్రీడల్లో గాయపడ్డ చాను పునరాగమనం తొలి పోటీలైన థారులాండ్‌లోని ఫుకెట్‌లో జరుగుతున్న ఐడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ కప్‌లో బరిలోకి దిగింది. మొత్తంగా రెండు ప్రయత్నాల్లో మీరా 184 కిలోల(81 కిలోలు, 103 కిలోలు) బరువు ఎత్తింది. దాంతో, ఒలింపిక్స్‌ బెర్తు ఖరారు చేసుకున్న భారత తొలి వెయిట్‌లిఫ్టర్‌గా మీరా నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో మీరా వెండి పతకంతో మెరిసిన విషయం తెలిసింది.గాయపడి ఆరునెలల తర్వాత తొలిసారి లిఫ్టింగ్‌ పోటీల్లో పాల్గొంటున్న చాను.. సోమవారం జరిగిన 49కిలోల విభాగంలో 184కిలోల బరువును లిఫ్ట్‌ చేసింది. స్నాచ్‌లో 81కిలోలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 103కిలోల బరువును ఎత్తింది. 2017 ప్రపంచ ఛాంపియన్‌ అయిన 29ఏళ్ల ఛాను ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 2వ స్థానంలో ఉంది. 2021లో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భాగంగా స్నాచ్‌లో 88కిలోలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 119కిలోల బరువును ఎత్తి ప్రపంచ రికార్డును తన పేర లిఖించుకుంది. పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళా లిఫ్టర్‌ మీరాభాయి చాను మాత్రమే.

➡️