వ్యర్థమవుతున్న తిండి – ఐదో వంతు ఆహారం వృథా

– యుఎన్‌ఇపి ఆహార వ్యర్థాల సూచిక నివేదిక 2024
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా తిండి లభించగా కోట్లాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. కానీ, ఆహారం అందుబాటులో ఉన్నవారు మాత్రం దానిని వృథాగా పారేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్న మొత్తం ఆహారంలో దాదాపు ఐదో వంతు ఇలాగే వ్యర్థమవుతున్నది. యూఎన్‌ఈపీ ఆహార వ్యర్థాల సూచిక నివేదిక-2024 ఈ విషయాన్ని వెల్లడిస్తున్నది.
ఈ నివేదిక సమాచారం ప్రకారం.. 2022లో 1.05 బిలియన్‌ టన్నుల ఆహార వ్యర్థాలు (తినదగని భాగాలతో సహా) ఉత్పత్తయ్యాయి. ఇది వినియోగదారులకు అందుబాటులో ఉన్న మొత్తం ఆహారంలో దాదాపు ఐదవ వంతు. ప్రతి వ్యక్తి, ప్రపంచంలోని గృహాలలో సంవత్సరానికి సగటున 79 కిలోల ఆహారాన్ని వఅథా చేస్తున్నారు. భారత్‌లో మాత్రం ఇది సంవత్సరానికి తలసరి 55 కిలోలుగా ఉన్నది. సరఫరా గొలుసులో ఆహార నష్టం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై వ్యర్థాల సంఖ్య దాదాపు 1 ట్రిలియన్‌ డాలర్లుగా అంచనా వేయబడింది. 78.3 కోట్ల మంది ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు. మానవాళిలో మూడింట ఒక వంతు మంది ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు.
2022లో ప్రపంచ ఆహార వ్యర్థాల మొత్తం.. 2022-23లో భారతదేశపు ఆహారధాన్యాలు, నూనెగింజలు, చెరకు, ఉద్యానవన ఉత్పత్తుల మొత్తం ఉత్పత్తి కంటే ఎక్కువ కావటం గమనార్హం. 2022లో ప్రపంచవ్యాప్తంగా వృథా అయ్యే మొత్తం ఆహారంలో 60 శాతం గృహ స్థాయిలో, 28 శాతం ఆహార సేవల స్థాయిలో, 12 శాతం రిటైల్‌లలో జరిగింది. దేశంలోని ఆహార వ్యర్థాల డేటా అటువంటి వ్యర్థాలు కేవలం ‘సంపన్న దేశం’ సమస్య కాదని చెప్పటం గమనార్హం.
గృహ స్థాయిలో ప్రతి సంవత్సరం తలసరి ఆహార వ్యర్థాలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. 2019లో 74కిలోల నుంచి 2022లో 79కిలోలకు పెరిగింది. అదేవిధంగా, అదే సమయంలో భారతదేశంలో ఏడాదికి తలసరి 50 కిలోల వ్యర్థాల నుంచి 55 కేజీలకు పెరిగింది. 2022లో మాల్దీవుల్లో ఏడాది 207 కిలోల తలసరి ఆహార వ్యర్థాలు గృహ స్థాయిలో అత్యధికంగా ఉన్నాయి. ” ప్రపంచవ్యాప్తంగా ఆహారాన్ని వృథా చేయటంతో లక్షలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఇది ఒక ప్రధానాభివృద్ధి సమస్య మాత్రమే కాదు.. ఇటువంటి అనవసరమైన వ్యర్థాల ప్రభావాలు వాతావరణం, ప్రకృతికి గణనీయమైన ఖర్చులను కలిగిస్తున్నాయి” అని యుఎన్‌ఇపి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఇంగర్‌ ఆండర్సన్‌ అన్నారు. ప్రస్తుతం, చాలా తక్కువ, మధ్య-ఆదాయ దేశాలు 2030 నాటికి ఆహార వ్యర్థాలను సగానికి తగ్గించే సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్‌ (ఎస్డీజీ)ని చేరుకోవటానికి, ముఖ్యంగా రిటైల్‌, ఆహార సేవలలో పురోగతిని ట్రాక్‌ చేయటానికి తగిన వ్యవస్థలు లేకపోవటం గమనార్హం.

➡️