ఓ వైపు యుద్ధం.. మరో వైపు వర్షం, చలి.. : గాజాలో జన జీవితం దుర్భరం

Dec 15,2023 10:52 #cold wave, #Gaza, #Life, #miserable, #rains, #War

గాజా : ప్రస్తుతం గాజాలో ప్రజల జీవనం అధ్వానంగా ఉంది. ఒకవైపు ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. గాజాలో నిరంతర వర్షం, చలి పాలస్తీనా కుటుంబాల కష్టాలను మరింత పెంచింది. ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వస్తోంది. ప్రజలు గుడారాల్లో దాక్కుని జీవిస్తున్నారు. అవి కూడా నీటితో నిండిపోతున్నాయి. కుండపోత వర్షాలు పాలస్తీనియన్లకు కొత్త సవాలును సష్టించాయి. ఇజ్రాయెల్‌ సైన్యం ఆదేశాలను అనుసరించి, వారు తమ ఇళ్లను వదిలి దక్షిణం వైపు పారిపోవాలని నిర్ణయించుకున్నారు. గాజాలో పరిస్థితి నిరంతరం దిగజారుతోంది. గాజాలో ప్రస్తుత పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం గాజా పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. నీరు, ఆహారం, మందుల కోసం ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. వర్షాలు, వరదల కారణంగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. గాజాలో ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. దీని నుండి తప్పించుకోవడానికి వేలాది మంది పాలస్తీనియన్లు దక్షిణం వైపు కారు, ట్రక్కు, గుర్రపు బండి లేదా కాలినడకన పరుగెత్తుతున్నారు. ఇజ్రాయిల్‌ మారణకాండలో ఇప్పటివరకూ 18,608 మంది పాలస్తీనియన్లు మరణించారు. దాదాపు 50,594 మంది గాయాల పాలయ్యారు. మృతుల్లో అత్యధికులు మహిళలు, పిల్లలే.

89 మంది జర్నలిస్టులు మృతి

ఇజ్రాయిల్‌ సైన్యం ఇప్పటివరకూ 89 మంది జర్నలిస్టుల్ని హత్య చేసింది. ప్రస్తుత పరిస్థితులపై ప్రపంచానికి సమాచారాన్ని అందజేస్తున్న జర్నలిస్టులను చంపడాన్ని పాలస్తీనియన్‌ జర్నలిస్ట్స్‌ సిండికేట్‌ (పిజెఎస్‌) తీవ్రంగా ఖండించింది. ఉత్తర గాజాలో ఇజ్రాయిల్‌ వ్యక్తి కాల్పుల్లో గాయపడిన జర్నలిస్ట్‌ అబేద్‌ అల్కరీమ్‌ ఔడా బుధవారం మరణించాడు. ఇజ్రాయిల్‌ సైన్యం బాంబులతో దాడి చేయడంతో రష్యా టుడేలో ట్రైనీగా పనిచేస్తున్న మరో మహిళా జర్నలిస్ట్‌ నెర్మిన్‌ కవాస్‌ తన ఇంటిలోనే మరణించారు. ఇప్పటివరకు హత్యకు గురైన జర్నలిస్టుల్లో పదిమంది మహిళా జర్నలిస్టులు ఉన్నట్టు పిజెఎస్‌ గుర్తించింది. వార్తా సంస్థల ప్రధాన కార్యాలయాల్ని కూడా ఇజ్రాయెల్‌ సైన్యం ధ్వంసం చేసిందని పిజెఎస్‌ విమర్శించింది. యూరోపియన్‌ సమ్మిట్‌ సమావేశంలో పిజెఎస్‌ అధ్యక్షుడు నాసర్‌ అబూ బేకర్‌ మాట్లాడుతూ.. ‘గాజాలో నా సహచరులు నీరు, ఆహారం, నివాసం లేక దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. ఇజ్రాయెల్‌ బాంబు దాడుల కారణంగా చాలామంది జర్నలిస్టులు, వారి కుటుంబాలు నివాసం కోల్పోయి వీధులు, పాఠశాలలు, ఆసుపత్రులు, బహిరంగ ప్రదేశాల్లో ఉంటున్నారు.’ అని అన్నారు.

పాలస్తీనా సమస్యను శాశ్వతంగా పరిష్కరించండి : ఐక్యరాజ్య సమితికి రష్యా పిలుపు

మాస్కో : పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ మారణకాండకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్‌రోవ్‌ బుధవారం ఐక్యరాజ్య సమితి చీఫ్‌ ఆంటానియో గుటెరస్‌ను కోరారు. పాలస్తీనా దేశం ఏర్పడాలని రష్యా కోరుకుంటోంది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడమొక్కటే దీనికి గల పరిష్కారమని లావ్‌రోవ్‌ స్పష్టం చేశారు. భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలతో తక్షణమే సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. రష్యన్‌ సెనెటర్లతో మాట్లాడుతూ ఆయన, ఆ సమావేశంలో అరబ్‌ లీగ్‌, ఇస్లామిక్‌, గల్ఫ్‌ సహకార మండలికి చెందిన ప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు. ఇటువంటి సమావేశం ఏర్పాటులో ఐక్యరాజ్య సమితి కీలక పాత్ర పోషించాలన్నారు. ఇటువంటి చొరవ తీసుకునే సామర్ధ్యం గుటెరస్‌కు ఉందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. పాలస్తీనియన్లకు నిరంతరంగా అన్యాయం జరుగుతూనే వుందన్నారు. హమాస్‌ చెరలో వున్న బందీలందరినీ విడిపించేందుకు మాస్కో చేయగలిగిన కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

➡️