అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ కార్మికులకు వేతనాల పెంపు

  • రమణదీక్షితులుపై వేటు
  • టిటిడి పాలకమండలి నిర్ణయాలు

ప్రజాశక్తి – తిరుమల : టిటిడిలోని వివిధ విభాగాల్లో అన్‌స్కిల్డ్‌, సెమీస్కిల్డ్‌, స్కిల్డ్‌, హైలీస్కిల్డ్‌ కేటగిరీల్లో పనిచేస్తున్న కార్పొరేషన్‌, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న తొమ్మిది వేల మందికి వేతనాలు పెంచుతున్నట్లు టిటిడి చైౖర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి వెల్లడించారు. ఈ ప్రాతిపదికన ఒక్కొక్కరికి రూ.మూడు వేల నుంచి పది వేల వరకూ పెరిగే అవకాశం ఉందన్నారు. సిఎం జగన్‌, టిటిడిపై విమర్శలు చేసిన రమణ దీక్షితులును గౌరవ ప్రధాన అర్చకుని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు ఆయన వివరించారు. ఇక నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. తిరుమల పెద్ద జీయర్‌స్వామి అనుమతితో ద్వారపాలకులు జయవిజయలకు బంగారు తాపడం చేయనున్నామని, రూ.నాలుగు కోట్లతో మంగళసూత్రల తయారీకి నాలుగు ప్రముఖ బంగారు వ్యాపార సంస్థలకు టెండర్లకు అప్పగించనున్నామని చెప్పారు. పాదిరేడులోని ఉద్యోగుల ఇంటి స్థలాల లేఅవుట్‌ అభివృద్ధికి రూ.8.16 కోట్లు తుడాకు చెల్లిస్తామన్నారు. రూ.3.15 కోట్లతో తిరుమలలో పలుచోట్ల కొత్త మోటార్‌ పంపుసెట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తిరుమలలో ఎఫ్‌ఎంఎస్‌ సేవలకు మరో మూడేళ్లు పొడిగించనున్నట్లు చెప్పారు. ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఎ పెంచుతామని,ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి స్విమ్స్‌లో ఉచిత వైద్యం అందింస్తామని, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు క్యాంటీన్‌లో రూ.పదికే భోజనం అందిస్తామని చెప్పారు.

➡️