తుపాను ప్రాంతాల్లో నేడు సిపిఎం బృందాల పర్యటన

Dec 6,2023 09:04 #cpm, #Tufan

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :’మిచౌంగ్‌’ తుపాను ధాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో సిపిఎం బృందాలు నేడు (బుధవారం) పర్యటించనున్నాయి. బాపట్ల, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో మూడు వేర్వేరు బృందాలు పర్యటిస్తాయని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తుపాను దెబ్బకు రాష్ట్రం అతలాకుతలమైందని, లోతట్టు ప్రాంతాలు మునిగి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. సహాయక శిబిరాలు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ అరకొర సౌకర్యాలే ఉన్నాయని, వరిపంట నీటిలో మునిగిందని, ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా తేమ పేరుతో కొనుగోళ్లు జరగక కళ్లాల్లోనే ధాన్యం ఉండిపోయిందని వివరించారు. వరిపంట గాలికి పూర్తిగా నేలకొరిగిందని, మరో రోజు ఇలానే వర్షం కొనసాగి, గాలొస్తే అరటి, మిర్చి, ప్రత్తి పంట పూర్తిగా దెబ్బతిని చేతికి రాకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుచేసి పెట్టుబడి పెట్టిన కౌలురైతులు మరింత నష్టపోతారని, ఈ నేపథ్యంలో సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తుపాను ప్రభావిత వరద ప్రాంతాల్లో నాయకులు పర్యటించనున్నారని తెలిపారు.

బాపట్ల జిల్లాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కార్యదర్శివర్గ సభ్యులు డి రమాదేవి, రాష్ట్ర కమిటీ సభ్యులు కె ధనలక్ష్మి బృందం పర్యటించనుంది. కృష్ణా జిల్లాలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు వి కృష్ణయ్య, జిల్లా కార్యదర్శి వై నరసింహారావు, కౌలురైతు సంఘం కార్యదర్శి ఎం హరిబాబుతో కూడిన బృందం పర్యటించనుంది. నెల్లూరు జిల్లాలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు, నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు కె ఉమామహేశ్వరరావులతో కూడిన బృందం పర్యటించనుంది.

➡️