‘విశాఖ-అమరావతి’ ఆర్థిక వ్యూహం- రాష్ట్రాభివృద్ధి!

Mar 12,2024 06:25 #AP, #BJP, #edite page, #election, #JanaSena, #TDP, #YCP

‘విజన్‌ విశాఖ’ డాక్యుమెంట్‌ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విశాఖపట్నంలో మార్చి 5వ తేదీన ‘ఎ.పి డెవలప్‌మెంట్‌ విత్‌ సి.ఎం’-అనే కార్యక్రమంలో సుదీర్ఘ ప్రసంగం చేశారు. రాష్ట్ర సత్వర అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వ విధానం, ఆలోచనలు వెల్లడించారు. రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలంటే విశాఖపట్నం మహానగరంగా అభివృద్ధి కావాలని, పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. విశాఖ పరిపాలనా రాజధానిగా మార్పుతో పాటు ముఖ్యమంత్రి విశాఖ నుండే పరిపాలన చేస్తే విదేశీ, స్వదేశీ పెట్టుబడులు విశాఖకు వరదలా వచ్చి విశాఖ రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజన్‌గా మారుతుందని అన్నారు. అదే అమరావతి అయితే అంతా ఖాళీ బీడు భూమి అని, రోడ్లు, విద్యుత్‌, మంచినీరు వంటి కనీస మౌలిక సదుపాయాలకు ఎకరాకు రూ.2 కోట్లు చొప్పున ఖర్చు చేయలని అన్నారు. 20 ఏళ్ళలో కూడా దీనిని పూర్తిచేయలేమని…అదే విశాఖ నగరంలో అన్ని సదుపాయాలు ఉన్నాయని, కొద్దిపాటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే సరిపోతుందనే వాదన తీసుకొచ్చారు.
స్థూలంగా విశాఖ నగరాన్ని హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై లాగా అభివృద్ధి చేస్తే రాష్ట్ర్రం మొత్తం అభివృద్ధి అవుతుందని ముఖ్యమంత్రి వాదన. ఇది పూర్తిగా తప్పు. నయా ఉదారవాద విధానాలు అమలులోకి వచ్చిన తరువాత ఈ వ్యూహాన్ని ముందుకు తెచ్చారు. పెట్టుబడులకు అనుకూలంగా మహా నగరాలను సృష్టిస్తే అభివృద్ధి జరుగుతుందనే సిద్ధాంతాన్ని అమలులోకి తీసుకొచ్చారు. కానీ గత రెండు దశాబ్దాల అనుభవం చూస్తే ఈ అభివృద్ధి నమూనా తీవ్ర అసమానతలతోపాటు సంపద కేంద్రీకరణ పెంచింది.
హైదరాబాద్‌ నగరాన్నే పరిశీలిద్దాం. 2022-23లో తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (ఎస్‌జీడిపి) రూ.13.13 లక్షల కోట్లు. సగటు తలసరి ఆదాయం రూ. 3.13 లక్షలు. ఒక్క హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల నుండే సుమారు రూ. 5 లక్షల కోట్లు ఆదాయం వచ్చింది. దాదాపు ఇది 38 శాతం. రంగారెడ్డి తలసరి ఆదాయం రూ. 8.15 లక్షలు, హైదరాబాద్‌ జిల్లా తలసరి ఆదాయం రూ. 4 లక్షలు ఉంది. మిగిలిన జిల్లాలు చూస్తే అత్యధిక జిల్లాల తలసరి ఆదాయాలు రాష్ట్ర సగటు తలసరి ఆదాయం కంటే దిగువనే ఉన్నాయి.
తెలంగాణ వ్యవసాయ రంగం మీద కోటి యాభై లక్షల మందికి పైగా ఉన్నారు. వీరి నుండి వస్తున్న ఆదాయం కేవలం 16 శాతం లోపే. దీనిని బట్టి అర్ధమవుతుందేమిటి? సంపద అంతా హైదరాబాద్‌ చుట్టే కేంద్రీకృతమౌతున్నది. తీవ్ర అసమానతలు పెరుగుతున్నాయి. వ్యవసాయ రంగంపై ఆధారపడిన ప్రజలు అభివృద్ధికి దూరంగా నెట్టివేయబడుతున్నారు. హైదరాబాదు మహా నగరంలో కూడా ప్రజల మధ్య అసమానతలు తీవ్రంగా కనిపిస్తాయి.
కర్ణాటకలో జరుగుతున్న మార్పు కూడా తెలంగాణలో వలె ఉంది. కర్ణాటక రాష్ట్ర జిడిపిలో బెంగళూరు నుండే 37 శాతం వస్తున్నది. బెంగళూరు నగర జనాభా రాష్ట్ర జనాభాలో ఆరో వంతు మాత్రమే. బెంగుళూరు తలసరి ఆదాయం రూ. 6.2 లక్షలు ఉంటే రాష్ట్రంలోని 24 జిల్లాల తలసరి ఆదాయాలు రాష్ట్ర సగటు తలసరి ఆదాయం కంటే దిగువన ఉన్నాయి. కల్బుర్గి జిల్లా అయితే తలసరి ఆదాయం కేవలం లక్షా 25 వేలు మాత్రమే. కర్ణాటకలో అత్యధిక జిల్లాలు వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉన్నాయి. తెలంగాణ వలె కర్ణాటకలో కూడా సంపద బెంగుళూరు నగరంలో కేంద్రీకరణతో పాటు అసమానతలు, వెనుకబాటు, పేదరికం పెరిగింది.
చంద్రబాబు ఆర్థిక నమూనా కూడా ఇదే. ఇందులో భాగంగానే నూతనంగా అమరావతి అనే మహా నగరాన్ని నిర్మించాలనే ఊహాచిత్రాన్ని ముందుకు తీసుకువచ్చారు. 32 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు. ఆ భూముల్ని బడా వ్యపార వాణిజ్య సంస్థలకి పంపిణీ చేసి భారీ కట్టడాలు నిర్మిస్తే అమరావతి కూడా హైదరాబాద్‌, బెంగళూరు వలె ఒక మహా నగరంగా ఏర్పడి రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజన్‌గా మారుతుందని చంద్రబాబు చెప్పారు. ఐదేళ్ళపాటు రంగురంగుల గ్రాఫిక్స్‌ చుట్టూ పరిపాలన తిప్పాడు. విశాఖ, అమరావతి చుట్టూ కేంద్రీకరించి ఆంధ్రప్రదేశ్‌ను నిర్లక్ష్యానికి గురిచేస్తున్నారు.
చంద్రబాబు-జగన్‌ల విధానం ఒకటే. పెద్ద పెద్ద రోడ్లు, ఎయిర్‌పోర్టులు, పోర్టులు, స్టార్‌ హోటళ్లు, అంతర్జాతీయ స్టేడియంలు, మెగా షాపింగ్‌ మాల్స్‌, మెట్రో రైలు, భారీ కట్టడాలు తదితర మౌలిక సదుపాయాలు ఒక నగరం చుట్టూ వస్తే ఆ రాష్ట్రం త్వరిత గతిన అభివృద్ధి అవుతుందని అంటున్నారు. వాస్తవంగా మౌలిక సదుపాయాల కల్పన దృక్పధంలో పాలక వర్గాల్లో తీవ్ర మార్పు వచ్చింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో ప్రజల తక్షణ అవసరాలు, ఉపాధి, వ్యవసాయ రంగం, అసమానతలు, వెనుకబాటుతనం…వంటివి ఆధారంగా ప్రభుత్వమే మౌలిక సదుపాయాల రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేసింది. భారీ పరిశ్రమలను కూడా ఈ దృక్పధంతోనే ప్రభుత్వం నిర్మించింది. ఇప్పుడు భారత దేశంలో మనం చూస్తున్నవన్నీ ఈ దృక్పధం నుండి వచ్చినవే.
నయా ఉదారవాద విధానాల అమలుతో 1991 అనంతరం మౌలిక సదుపాయాల ధృక్పధంలో మార్పు వచ్చింది. అప్పటి వరకు అనుసరించిన విధానానికి స్వస్తి పలికారు. పెట్టుబడిదారుల లాభాలే కేంద్రంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. డెడికేటివ్‌ కారిడార్లు, ఆరు వరుసల రోడ్లు, బుల్లెట్‌ రైళ్ళు, స్టార్‌ హోటళ్ళు, విమానాశ్రయాలు, ప్రభుత్వ భూములు కేటాయింపు వంటి చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే నిర్మించబడ్డ మౌలిక సదుపాయాలను కార్పొరేట్‌ వర్గాలకు ధారాదత్తం చేస్తున్నారు. గతంలో బ్రిటీష్‌ పాలకులు కూడా భారతదేశంలో ముడిసరుకులను తమ దేశానికి తరలించుకుపోవడానికి, అక్కడ తయారైన సరుకులను భారతదేశంలో అమ్ముకోవడానికి భారతదేశంలో పోర్టులు, రైల్వేల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి చేశారు. ఇదే వ్యూహం నేడు మన రాష్ట్రంలోను, దేశంలోను అమలు జరుగుచున్నది.
జగన్‌ మోహన్‌రెడ్డి ముందుకు తెచ్చిన హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై, ముంబాయి, ఢిల్లీ, కలకత్తా నగరాలన్నీ ప్రభుత్వ పెట్టుబడులతోనే మహా నగరాలుగా అభివృద్ధి అయ్యాయి తప్ప…జగన్‌ మోహన్‌రెడ్డి, చంద్రబాబుల ఆర్థిక నమూనా ద్వారా కాదనేది అర్థం చేసుకోవాలి.
విశాఖ నగరం అభివృద్ధి క్రమాన్ని పరిశీలిస్తే దేశంలో నగరాల అభివృద్ధికి మూలమేమిటో తెలుసుకోవచ్చు. స్వాతంత్య్రం వచ్చేనాటికి విశాఖ జనాభా కేవలం లక్ష మాత్రమే. స్వాతంత్య్రం అనంతరం విశాఖలో ఉన్న విదేశీ, స్వదేశీ, పెట్టుబడిదార్ల ఆధీనంలో ఉన్న హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌, కాల్‌టెక్స్‌ ఆయిల్‌ కంపెనీలను జాతీయం చేశారు. బ్రిటీష్‌ ఆధీనంలో ఉన్న విశాఖ పోర్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ తరువాత తూర్పు నావికాదళాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి యుద్ధ నౌకల మరమ్మతు యార్డుతోపాటు ఢిపెన్స్‌ కార్యకలాపాల శాఖలను నెలకొల్పారు. ఆ తరువాత బిహెచ్‌పివి, హిందుస్థాన్‌ జింక్‌, ఎన్‌టిపిసిలను నెలకొల్పారు. విశాఖ పోర్టును విస్తరించారు. మత్య్సకారులకు ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించారు. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా కార్యాలయాలు వచ్చాయి. ప్రభుత్వ బ్యాంకింగ్‌ వ్యవస్థ విస్తరించింది. ప్రభుత్వ రంగంలో విద్య, వైద్య సామాజిక, మౌలిక సదుపాయాల కల్పనలలో ఏర్పడ్డాయి. లక్షల మందికి శాశ్వత ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి. ప్రభుత్వరంగ పరిశ్రమల ఆధారంగా అనేక చిన్న పరిశ్రమల కేంద్రాలు, ప్రైవేట్‌ భారీ పరిశ్రమలు ఏర్పడ్డాయి. వ్యాపార, వాణిజ్య, సేవా కార్యకలాపాలు విస్తరణ జరిగింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ రాకతో విశాఖనగరం మహా నగరంగా మారింది. ఈ ఆర్థిక పరిణామ క్రమాన్ని బిజెపి నేడు ధ్వంసం చేస్తున్నది. జగన్‌-బాబు జంట బిజెపి విధ్వంసాన్ని మరింత ముందుకు తీసుకెళుతున్నారు.
విభజన వల్ల హైదరాబాద్‌ని కోల్పోయి అనేక కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ రాష్ట్ర జిడిపిని రూ.13.17 లక్షల కోట్లకు, రాష్ట్ర సగటు తలసరి ఆదాయం రూ.2.19 లక్షలకు పెంచగలిగామని ముఖ్యమంత్రి గొప్పగా తన ప్రసంగంలో పేర్కొన్నారు. వాస్తవంగా విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్‌ వ్యవసాయ రాష్ట్రంగా మారిపోయింది. రాష్ట్ర ఆర్థిక సామాజిక సర్వే 2022-23 ప్రకారం రాష్ట్ర జిడిపి పారిశ్రామిక వాటా 23.36శాతం, సేవారంగం వాటా 40.45శాతంకి గడిచిన పదేళ్ళలో క్షీణించి వ్యవసాయ రంగం వాటా 37శాతానికి పెరిగింది.
అయితే వ్యవసాయ రంగంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2022-23లో వ్యవసాయ రంగం నుండి రూ.4.39 లక్షల కోట్లు ఆధాయం వస్తే ఇందులో అత్యధిక మంది ప్రజలు ఆధారపడ్డ ఆహార పంటల నుండి కేవలం 12.33 శాతం మాత్రమే వచ్చింది. ఉద్యానవనాల నుండి 28 శాతం, పశుసంబంధిత ఆదాయం 32 శాతం, చేపలు, రొయ్యల నుండి 25 శాతం సమకూరింది. 60 శాతం ఆదాయం చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ నుండి వస్తున్నదని స్పష్టమౌతున్నది. ఇంకా ఆశ్చర్యం కలిగించే ఆంశమేమంటే 61,682 మంది మాత్రమే జీవనం సాగిస్తున్న రొయ్యలు, చేపల చెరువుల నుండి లక్షా 11 వేల కోట్ల ఆదాయం వస్తే, 50.92 లక్షల మంది (కౌలు రైతులు మినహా) ఆధారపడి ఉన్న ఆహార పంటల నుండి రూ.54.161 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. దీనిని బట్టి వ్యవసాయ రంగంలో సృష్టించబడుతున్న ఆదాయం ఎవరి చేతుల్లోకి వెళుతున్నదో అర్థం చేసుకోవచ్చు.
పారిశ్రామిక రంగంలో తయారీ రంగం ఎదుగూ బొదుగూ లేకుండా రాష్ట్ర జిడిపిలో 10 శాతం చుట్టే తిరుగుతున్నది. సేవారంగం నుండి వస్తున్న ఆదాయంతో 35 శాతం రియల్‌ ఎస్టేట్‌, ఫైనాన్స్‌ రంగం నుండే వస్తున్నది. ఇక రాష్ట్ర తలసరి ఆదాయం ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చూస్తే 13 జిల్లాలో 9 జిల్లాలు రాష్ట్ర సగటు తలసరి ఆదాయం కంటే దిగువ స్థాయిలో ఉన్నాయి.
కనుక విశాఖ, అమరావతి మహానగరాల ఆర్థిక నమూనా ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామనే జగన్‌-చంద్రబాబుల విధానం శ్రామిక జనావళి అభివృద్ధికి ఏ మాత్రం దోహదపడేది కాదు. సంపద మరింత కేంద్రీకృతమవుతుంది. అసమానతలు, ప్రాంతాల వెనుకబాటుకు దారితీస్తాయి. నేడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మరింత పెరుగుతాయి. కనుక ఈ కార్పొరేట్‌ ఆర్థిక వ్యూహాన్ని ప్రజలు సంఘటితమై తిప్పికొడితేనే రాష్ట్రానికి, జనానికి మేలు జరుగుతుంది.

 

డా|| బి.గంగారావు

 వ్యాసకర్త సెల్‌ : 9490098792

➡️