వైరస్‌ పట్టిన మెదళ్లు

Jan 7,2024 06:10 #Poetry, #Sneha
virus mids poetry

 

డిజిటల్‌ యుగపు రోబోలు

వైరస్‌ పట్టిన నర సాఫ్ట్‌వేర్‌లు

అర్థం పర్థంలేని ఆరాటాలు

గమ్యమెరుగని గత్తర పరుగులు

ఆద్యంతమే లేని ధనదాహాలు

నైతికత ఇంకిన మర మనుషులు !

 

అశ్లీలతను ఆరాధించే నేత్రాలు

అబద్ధాలు ఆస్వాదించే చెవులు

తుమ్మ ముళ్ళను తలపించే స్పర్శలు

నరమే లేని నర నాలుక నర్తనలు

కంపుకొట్టే స్వార్థ కపట దుర్గంధాలు

పతనం అంచున పంచేంద్రియాలు !

 

విచక్షణ మరిచిన దురాలోచనలు

దురాశలతో వేలాడే ఊడలు

మర్యాదల వెనుక మతలబులు

ఈర్ష్యలు నిండిన ఇకమతులు

ఇరుగు పొరుగంతా పరలోకులు

చేయూతలు తరిగిన చేతులు !

 

బంధాలన్నీ వ్యాపార వస్తువులు

స్నేహాలన్నీ తేనె పూసిన కత్తులు

విత్తం వెంట వేలం వెర్రి పయనాలు

నరతోలు తొడుక్కున్న గుంట నక్కలు

నవ్వుల వెనుక వెర్రి ప్రతీకార జ్వాలలు

హితవరుల వేషంలో అసురులు !

 

అంతర్జాల సాగరమధనాలు

సాధించాలి స్మార్ట్‌ ఆణిముత్యాలు

నిర్మించాలి ప్రేమల పొదరిల్లు

చేరాలి ఆనందపు అంచులు

వికసించాలి నవ్వుల పువ్వులు

పరిమళించాలి వసుదైక కుటుంబాలు !

 

చిగురించాలి మానవీయతలు

నాటాలి అంతటా అవినీతి విత్తులు

చెరపాలి అవాంఛనీయ గోడలు

విలువలతో వర్ధిల్లాలి ఆత్మీయతలు

ఇంటర్‌’నెట్‌’ అల్లాలి అనుబంధాలు

నరులు కావాలి నారాయణులు !

 

  • మధుపాళీ – 9949700037
➡️