కానిస్టేబుల్‌ చెంపపై కొట్టిన బిజెపి ఎమ్మెల్యే : వీడియో వైరల్‌

Jan 6,2024 15:27 #BJP MLA, #pune

పూనె : సునీల్‌ కాంబ్లే అనే బిజెపి ఎమ్మెల్యే డ్యూటీలో ఉన్న ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ చెంపపై కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పూనె కంటోన్మెంట్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీల్‌ కాంబ్లే శుక్రవారం పూనెలోని సాసూన్‌ జనరల్‌ హాస్పిటల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లారు. ఈయనతోపాటు ఆ రాష్ట్ర డిప్యూటీ సిఎం అజిత్‌ పవార్‌ కూడా హాజరయ్యారు. ఈ వీడియోలో… సునీల్‌ కాంబ్లే మెట్లపై నుంచి దిగుతూ ఉండగా.. పక్కనే ఉన్న వ్యక్తి చెంపపై కొట్టడం కనిపిస్తుంది. ఆ వ్యక్తి బండ్‌గార్డెన్‌ పోలీస్‌ స్టేషన్‌కి అనుబంధంగా విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్‌ అని అధికారులు వెల్లడించారు. అయితే సునీల్‌ కాంబ్లే ఈ ఘటనను ఖండించారు. ‘నేను ఎవరిపైనా దాడి చేయలేదు. నేను మెట్లు దిగి వస్తున్నప్పుడు ఎవరో అడ్డంగా వచ్చినప్పుడు నేను అతనిని తోసుకుని ముందుకు వెళ్లాను’ అని కాంబ్లే చెప్పారు. ఇక ఈ ఘటనపై కానిస్టేబుల్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాంబ్లేపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 353 (ప్రభుత్వ సేవకుడిని తన విధులను నిర్వర్తించకుండా నిరోధించడానికి దాడి లేదా క్రిమినల్‌ ఫోర్స్‌) కింద కేసు నమోదు చేసినట్లు ఓ అధికారి తెలిపారు.

➡️