వారు ఎటుంటే… అటే గెలుపు

Mar 27,2024 22:03

నియోజకవర్గంలో యాదవ, ముస్లింలదే హవా..

అభ్యర్థులకు తెలీని ఓటరు నాడి.. !

డబ్బు, మద్యం ప్రభావం చూపుతుందా..

లేక  నిజాయితీ, అభివద్ధికి పట్టం కడతారా..!

ప్రజాశక్తి- పుంగనూరు పుంగనూరు నియోజకవర్గంలో 2024 జరగబోవు శాసనసభ ఎన్నికల్లో గెలుపు ఓటములు యాదవ, ముస్లిం సామాజిక వర్గాలపై ఆధారపడి ఉంటుంది. ఏ పార్టీ ప్రచారానికి వెళ్లిన మా ఓటు మీకే అంటూ ఓటరు చెప్పడంతో అభ్యర్థులు ఎవరికి ఓటు వేస్తారని ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు పార్టీ అభ్యర్థులు ఇచ్చే తాయిలాలకు ఓటు వేస్తారా.. లేక నియోజకవర్గంలో జరిగిన అభివద్ధి చూసి ఓటు వేస్తారా.. డబ్బు, మద్యం ప్రభావం ఏమైనా చూపుతోందా, నీతి నిజాయితీకి పట్టం కడతారా అని పలు సందేహాలతో ప్రసుత్తం అభ్యర్థుల్లో తలెత్తుతున్నాయి. నియోజకవర్గంలో యాదవులు, ముస్లిం మైనారిటీలు, మహిళలే ఏ పార్టీ గెలవాలి, ఏ పార్టీ ఓడిపోయాలో నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. యాదవ ఓటర్లు సుమారు 28వేలు, ముస్లిం ఓటర్లు సుమారు 35వేలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనాలు. నియోజకవర్గంలో అత్యధిక శాతం వీరే.. వీరు ఎవరికైతే ఓటు వేస్తారో వారు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే గతంలో యాదవ సామాజికవర్గం ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతూ ఓటు వేసేవారు. నియోజకవర్గాల పునర్విభజన తరువాత కొంత భాగం వైసీపీ వైపు మొగ్గు చూపడం జరిగింది. 2019లో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున బోడె రామచంద్ర యాదవ్‌ పోటీ చేయగా సుమారుగా 16వేలు ఓట్లు సాధించాడు. వీటిలో ఎక్కువ భాగం యాదవ సామాజిక వర్గం వారు ఓట్లు వేశారని అప్పట్లో చర్చ నడిచింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి భారత చైతన్య యువజన పార్టీని కొత్తగా స్థాపించడంతో బోడె రామచంద్ర యాదవ్‌ పుంగునూరు శాసనసభ్యులుగా పోటీలో దిగుతున్నారు. కాగా మైనారిటీ ఓట్లు ఎక్కువ శాతం వైసీపీకి పడే అవకాశం ఉండగా, ఎస్‌డిపిఐ (సోషల్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా) పార్టీ తరపున మైనార్టీలు అభ్యర్థి నిలబెట్టనున్నట్లు పట్టణంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే జరిగితే ఎస్‌డిపిఐ పార్టీ పోటీలో ఉంటే నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు చిలే అవకాశాలున్నాయి. పుంగునూరు మండలంలో నేతిగుట్లపల్లి రిజర్వాయర్‌ ఏర్పాటు కోసం ఆ ప్రాంత రైతులు నుండి 876 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సుమారు 10 గ్రామాలకు సంబంధించిన రైతులు భూములు పోగొట్టుకున్నారు. వారికి ఇప్పటివరకు ఎలాంటి నష్టపరిహారం అందలేదు. నేతిగుట్లపల్లి, దిగువ చింతవారిపల్లి, ఆవులవారిపల్లి, అరంట్లపల్లి, కమ్మవారిపల్లి, పట్టుపల్లి తండా మరో కొన్ని గ్రామాలకు చెందిన రైతులు నేతిగుట్లపల్లి రిజర్వాయర్‌ ఏర్పాటు భూములు కోల్పోయారు. ఈ ప్రాంత వాసులంతా తమకు డబ్బు కాదు, బంగారు ఇచ్చినా వైసీపీకి ఓటు వేయమని కరాకండిగా చెబుతున్నారు. ఈ ప్రాంత ఓట్లు బిసివైపికి లేక తెలుగుదేశం పార్టీకి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. యాదవ సామాజిక వర్గంలో వైసిపిలో ఒకరిద్దరుకు పదవులు ఇచ్చారు కానీ యాదవులను చిన్నచూపు చూస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే పరిస్థితి చౌడేపల్లి మండలంలోను కొనసాగుతున్నది. బోయకొండ అభివద్ధి మండలి ఛైర్మన్‌ యాదవ సామాజికవర్గానికి కేటాయించాలని అప్పట్లో పలువురు కోరారు. అయితే పుంగునూరు మండలంకి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించడంతో చౌడేపల్లి మండలంలో యాదవ సామాజిక వర్గం అంతా వైసీపీలో వ్యతిరేక భావనలు కనిపిస్తున్నాయి. యాదవులపై పట్టుసాధించాలని నియోజకవర్గ కేంద్రమైన పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనలతో యాదవ గర్జన సభను ముడ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి యాదవ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర, జిల్లాస్థాయిలో యాదవ నాయకులను పిలిపించి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సభను విజయవంతంకి కషి చేశారు. నియోజకవర్గంలో యాదవులు ముస్లింలు తరువాత కాపులు ఉన్నారు. తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలు కూటమి మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థిని కాపులు బలపరుస్తారా లేక వైసిపి పార్టీకి ఓటు వేయడం జరుగుతుందా అనే చర్చ మాత్రం నియోజకవర్గంలో నడుస్తుంది. నియోజకవర్గంలో యువత మాత్రం కొంతమేరకు జనసేన పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా చల్లా రామచంద్రారెడ్డి, వైసిపి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బీసీవైపు బోడె రామచంద్ర యాదవ్‌, ఎస్‌డిపిఐ పార్టీలో పోటీలో నిలవనున్నాయి. పుంగనూరు నియోజకవర్గం నాలుగు పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు తలపడుతున్నారు.

➡️