ప్రముఖ గాయని ప్రభ ఆత్రే కన్నుమూత

Jan 13,2024 16:34 #passed away, #pune, #singer Prabha Atre

పూనె : ప్రముఖ శాస్త్రీయ సంగీత గాయని, పద్మ విభూషణ్‌ అవార్డు గ్రహీత ప్రభా ఆత్రే (92) శనివారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఈరోజు ఉదయం ఆమెకు గుండెపోటు రావడంతో.. పూణెలోని దీనానాథ్‌ మంగేష్కర్‌ ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈరోజు ఆమె ముంబై వెళ్లారు. అయితే కార్యక్రమంలో పాల్గొనకముందే ఆమె గుండెపోటు వల్ల చనిపోయారు. ఇక ఆమె మృతిపట్ల మహారాష్ట్ర ఆర్థికమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ సంతాపం వ్యక్తం చేశారు. ‘ప్రభ ఆత్రే మృతి చెందడం చాలా బాధకరం. భారతీయ సంగీతం ఆమెకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. ఆమెకు నా హృదయ పూర్వక నివాళులు అర్పిస్తున్నాను.’ అని అన్నారు. ఇక మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ సంతాపం వ్యక్తం చేస్తూ.. ‘ప్రభాజీ మరణంతో శాస్త్రీయ సంగీతం యొక్క అద్భుతమైన శకానికి ముగింపు పలికింది. ఆమె మరణం దేశ సంగీత రంగానికి, కళా రంగానికి తీరని లోటు. ఆమెకు నివాళులు అర్పిస్తున్నాను’ అని అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ఆమె మృతికి సంతాపం తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో ప్రభ అంత్యక్రియలు జరపాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆమె బంధువులు విదేశాల్లో ఉన్నారు. వారు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె అంత్యక్రియలు మంగళవారం పూనెలో నిర్వహించనున్నారు.

కాగా, ప్రభా ఆత్రే 1932 సెప్టెంబర్‌ 13న పూనెలో జన్మించారు. ఆమెకు 1990లో పద్మశ్రీ, 2002లో పద్మ భూషణ్‌, 2022లో పద్మ విభూషణ్‌ అవార్డులు దక్కాయి. గతేడాది డిసెంబర్‌ 25న మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ అటల్‌ సంస్కృతి అవార్డును కూడా అందించారు.

➡️