డబ్బు విలువ

Mar 31,2024 11:00 #Sneha, #Stories

వింజమూరులో నివసించే రత్నాలయ్య వ్యాపారం చేస్తూ ఉంటాడు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడని పేరుంది. ఇంట్లోనూ, దుకాణంలోనూ ఒక్క రూపాయి కూడా వృథా కాకుండా చూస్తాడు.
ఒకసారి రత్నాలయ్య ఏదో పనిమీద బయటకు వెళుతూ పదిహేనేళ్ల కొడుకు రమణని దుకాణంలో కూర్చోబెట్టాడు. అప్పుడే కొందరు భక్తులు వచ్చి, దేవాలయ నిర్మాణానికి చందా అడిగారు. పెట్టెలో నుండి తీసి వంద రూపాయలిచ్చాడు రమణ. తిరిగి వచ్చిన రత్నాలయ్యకి విషయం తెలిసింది. ఎదురుగా కొడుకుని కూర్చోబెట్టి ‘కష్టపడి సంపాదించడం ముందు నేర్చుకో. తరువాత దానధర్మాలు చెయ్యి’ అని కోపంగా చెప్పాడు.
రత్నాలయ్య పదేళ్ల కూతురు ఇంట్లో ఉన్నప్పుడు ఒక బిచ్చగాడు వచ్చాడు. అతనికి కడుపు నిండా అన్నం పెట్టి, ఇంటికి తీసుకెళ్లమని బియ్యం ఇచ్చింది కూతురు. అది తెలిసిన రత్నాలయ్య కూతురి మీద కోపమయ్యాడు. మరోసారి అలా చెయ్యొద్దని గట్టిగా హెచ్చరించాడు. భర్త గురించి బాగా తెలిసిందే కాబట్టి రత్నాలయ్య భార్య మాత్రం డబ్బు విషయంలో ఎప్పుడూ మాట పడలేదు.
ఒకసారి రత్నాలయ్య దుకాణానికి మాసిన గడ్డం, చినిగిన దుస్తులతో ఒక ముసలి వ్యక్తి వచ్చాడు. కొట్లో ఉన్న పనివాళ్లని రత్నాలయ్య గురించి అడిగాడు. అతడిని చూడగానే బిచ్చగాడనుకున్నారు పనివాళ్ళు. వెంటనే అక్కడ నుంచి వెళ్లిపొమ్మన్నారు. అతడిని అక్కడ చూస్తే యజమాని తిడతాడని వాళ్ల భయం. వచ్చిన వ్యక్తి వెళ్లిపోకుండా రత్నాలయ్య కోసం చాలాసేపు ఎదురుచూసాడు.
కొంత సమయం తరువాత దుకాణానికి వచ్చాడు రత్నాలయ్య. దుకాణం దగ్గర నిలుచున్న వ్యక్తిని గుర్తుపట్టి, అతడిని లోపలకు తీసికెళ్లాడు. ఒక కుర్చీలో కూర్చుండబెట్టి తాగడానికి నీళ్లు ఇచ్చాడు. కడుపు నిండా భోజనం పెట్టాడు. కొంతసేపు అతనితో మాట్లాడి, పదివేలు డబ్బు ఇచ్చి పంపించాడు. ఆ దృశ్యం చూసిన పనివాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏవో సరుకుల కోసం ఇంటి నుండి వచ్చిన రత్నాలయ్య కొడుకు రమణ ఇదంతా చూసి నమ్మలేకపోయాడు.
‘వంద రూపాయలు చందా ఇచ్చానని నా మీద, బిచ్చగాడికి బియ్యమిచ్చిందని చెల్లి మీద కోప్పడ్డావు. ఎవరో తెలియని వ్యక్తికి పదివేల రూపాయలు దానమెలా ఇచ్చావు నాన్నా? ‘ అనడిగాడు రమణ.
రత్నాలయ్య నవ్వి ‘అపరిచితుడు కాదు. బాగా బ్రతికిన వాడే. తెలిసిన వ్యక్తే’ అనేసి మళ్ళీ పనిలో నిమగమయ్యాడు. రమణ ఇంటికి వెళ్లి తల్లికి ఈ విషయాన్ని చెప్పాడు. అదేమిటో తెలుసుకోవాలన్న ఉత్సాహంతో రత్నాలయ్య భార్య దుకాణానికి వచ్చింది.
‘మీరెవరికీ ఉచితంగా ఇవ్వరని తెలుసు. పది రూపాయలు ఖర్చుపెట్టినా లెక్కలు చెప్పమనే మీరు అపరిచితుడికి పది వేలు ఇచ్చారంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఇంతకీ ఎవరతను?’ అనడిగింది రత్నాలయ్య భార్య.
రత్నాలయ్య ‘ఈ సంగతి నీ వరకు వచ్చిందా? అపరిచితుడు కాదు. ఆయనెవరో నీకు తెలుసు. మన పెళ్లయిన కొత్తలో మా బంధువులు మోసం చేసి, మనల్ని బయటకు పంపిన విషయం గుర్తుందా? చేతిలో రూపాయి లేకుండా చంటి పిల్లలతో వీధిలో నిలబడి బాధపడ్డాం. అప్పుడు మనకు ఆశ్రయం ఇచ్చి, భోజనం పెట్టారొక మహానుభావుడు. అంతేకాకుండా కొంత డబ్బిచ్చి, వ్యాపారం పెట్టుకోమన్నాడు. గుర్తుందా?’ అనడిగాడు.
‘గుర్తుంది. ఆయన పరంధామయ్య. వారి మేలు ఎప్పటికీ మరచిపోలేను’ అందామె.
‘ఇప్పుడొచ్చింది ఆయనే. ఆయన ఆస్తులన్నీ తీసుకొని కొడుకులు బయటకు తరిమారట. ఆయన భార్యకు వైద్యం అవసరమనీ, డబ్బు కావాలనీ అడిగాడు. అందుకే సహాయం చేశాను. ఆయనిచ్చిన పెట్టుబడితోనే మనమిలా గొప్ప స్థాయికి చేరు కున్నాం. అప్పుడు పొందిన సహాయానికి కృతజ్ఞత చూపించే అవకాశం నాకిప్పుడు వచ్చింది’ అన్నాడు రత్నాలయ్య.
‘ఆయనకి ఇంత పెద్ద కష్టం వచ్చిందా? ఈసారి ఆయనొస్తే ఇంటికి తీసుకురండి. కోరినన్ని రోజులు ఉంచి భోజనం పెడదాం’ అంది రత్నాలయ్య భార్య. అలాగేనన్నాడు రత్నాలయ్య.
తండ్రి వైపు ఆశ్చర్యంగా చూస్తున్న కొడుకుతో ‘ఎన్నో కష్టాలు, అవమానాలు దిగమింగుతూ మనం ఈ స్థితికి వచ్చాము. ప్రతి పైసా ఎంతో కష్టపడి సంపాదించాము. అందుకే డబ్బు విలువ నాకు తెలుసు. మన దగ్గర లేనప్పుడు ఎవరినీ చేయి చాచి అడగలేం. అందుకే డబ్బు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టమని చెబుతాను. అందుకే’ అన్నాడు రత్నాలయ్య.
‘పెద్దలు ఏది చెప్పినా పిల్లల మంచి కోసమేనని, వాళ్ళేది చేసినా దాని వెనుక ఏదో అంతరార్థం ఉంటుందని’ గ్రహించాడు రమణ. తండ్రి చర్యలను చూసి అపోహ పడకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం నేర్చుకున్నాడు.

  • నారంశెట్టి ఉమామహేశ్వరరావు, 94907 99203
➡️