వరించే ప్రేమకు వందనం

valentine's day 2024 story

‘కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే/ ప్రియతమా నీవచట కుశలమా/ నేనిచట కుశలమే..’ లాంటి మధురమైన పాటలు, కావ్యాలు ప్రేమ అనే అవ్యక్తానుభూతి నుంచే వచ్చాయి. ప్రేమ అనే పదానికి సరైన అర్థం తెలియని ఆలోచన, ఆకర్షణల మధ్య సంఘర్షణలో యువత. ప్రేమంటే ఓ క్రేజ్‌.. ఇష్క్‌తో కుష్‌ అయిపోవడమే తెలుసు. మనసులో ఏదో తెలియని అలజడి.. అంతలోనే సందడి.. ఉత్సాహం.. ఉల్లాసం.. ఉత్తేజం.. కాస్త బిడియం.. కూసింత చలాకీగా ఉండాలనే ఉద్విగత.. మరికొంచెం ధైర్యంగా కనిపించాలనే ఉత్సుకత అన్నింటి మేళవింపుతో దిల్‌ ఖుష్‌ కావొచ్చు. అన్నింటికీ మించి ప్రేమంటే ఒక అవగాహన. స్వచ్ఛమైన, సహజమైన మానవత్వ భావన. నిజమే.. ప్రేమంటే మనసు అనే హృదయఫలకంలో ప్రభవించే హరివిల్లు. ప్రేమతత్వంగా మెలగడం సమాజహితంగా ఉంటే అదో స్ఫూర్తిదాయకం. ఇప్పటికే అనేక కథలు, కవితలు ఇలా అనేక ప్రక్రియల్లో మనసును ఓలలాడించే సాహిత్యం రూపొందుతూనే ఉంది. ఈ నెల 14న ‘ప్రేమికుల రోజు’ సందర్భంగా ప్రత్యేక కథనం.

ప్రేమ ఒక ఇష్క్‌.. ప్యార్‌.. మొహబత్‌.. రెండు హృదయాలు ఒక్కటవ్వడం..రెండు మనుసుల కలయిక.. అనేది నేటి యువత చెప్పే ప్రేమ మాటలు. ఇద్దరి మధ్య ఒకరి పట్ల ఒకరికి గౌరవం, అభిమానంతో ఏర్పడే అనుబంధం నిజమైన ప్రేమ. ప్రేమ అనేది ఒకరు చెబితే కలిగేది కాదు. ఒకరి అభిరుచులు, అభిప్రాయాలు కలిసినప్పుడు కలిగే ప్రేమానుభూతి.ఒకరి వైపు ఇంకొకరు ఆలోచించగలిగేది. ఒకరికోసం ఒకరు ప్రాణం ఉండేది ప్రేమ. ప్రేమకు గాయపరచడం, ప్రాణం తీయడం తెలియదు. అలా చేస్తే ఉన్మాదం అంటాం. అందుకే ప్రేమంటే ప్రేమే. వరించేదే ప్రేమ.. అలాంటి ప్రేమకు వందనం చెప్పాలి.

ఈ రోజెందుకు?

వాలెంటైన్స్‌ డే అనగానే వాలెంటైన్‌ అనే మత గురువే దీనికి మూలం అనే విషయం మనకు తెలుసుకదా! అదేనండి రోమ్‌ చక్రవర్తి క్లాడియస్‌ పరిపాలనలో సైనిక దళాల ఏర్పాటు యోచన చేశారు. దానికై నగరంలో ఎవరూ వివాహం చేసుకోకూడదనే నిబంధన పెడతాడు రాజు. దానికి వ్యతిరేకంగా వాలెంటైన్‌ రహస్య పెళ్ళిళ్ళు జరిపిస్తాడు. దీంతో అతనికి మరణ శిక్ష విధించి, కారాగారంలో బంధిస్తారు. అయితే జైలు అధికారి కుమార్తె అతని మీద అభిమానం చూపిస్తూండేది. తర్వాత ఆమెకు రాసిన ‘ప్రేమతో నీ వాలెంటైన్‌’ అనే లేఖ బయటపడుతుంది. లేఖ ఫిబ్రవరి 14న రాసినట్లు ఉండటంతో ఆ రోజును ప్రేమికుల రోజుగా జరుపుకుంటున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే ప్రేమంటే ఒకరోజు మాత్రమే ఉండేది కాదు. జీవితాంతం ప్రేమగా ఉండాలి.

గెలుపులోనే మధురం..

‘ప్రేమ ఎంత మధురం..!’ అన్నట్లు ప్రేమ ఒక అనిర్వచనీయమైనది.. మధురమైన బంధం, అపురూపమైన అనుభూతి.. అది అనుభవంలోనే అర్థమవుతుంది. ప్రేమించడం తప్పుకాదు.. అలాగని పెద్దలను నొప్పించడమూ సరికాదు. తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చెప్పడం అవసరం. తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి. అందరూ కలసిమెలసి ఉంటేనే ప్రేమకు అర్థం పరమార్థం.

మోసం వద్దు..

స్నేహం ప్రేమగా మారటానికి ఎంతో కాలం పట్టడం లేదు. సాంకేతికత పెరిగాక స్మార్ట్‌ఫోన్‌లు, వాట్సాప్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ల్లో ప్రేమజల్లు ఎక్కువగా కురుస్తోంది. ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవటం.. కొందరు అడ్డదారులు తొక్కడానికీ వెనుకాడటం లేదు. ఒక్కోసారి మోసాలకు తెగబడుతున్న సంఘటనలు చూస్తున్నాం. ఇవన్నీ ప్రేమపట్ల బాధ్యతగా మెలగకపోవడం, స్పష్టమైన అవగాహన లేకపోవడమే అనేది నిపుణులు చెప్తున్న మాట.

పరిపక్వత..

ప్రేమ కలగటానికి సమయం సందర్భం ఉంటుందా అంటే.. పరిపక్వత ఉండాలంటారు నిపుణులు. టీనేజ్‌లో సహజంగానే హార్మోన్ల ప్రభావంతో ఆకర్షణకు గురవుతారు. ఆ ఆకర్షణనే ప్రేమ అని భ్రమ పడుతుంటారు. ప్రేమను ప్రేమగా అర్థం చేసుకునే పరిణతి రావాలి. అప్పుడే ప్రేమ పటిష్టంగా ఉంటుంది. అలా కానప్పుడు జీవితంలో స్థిరపడకపోవడం, సరైన నిర్ణయాలు తీసుకోలేక పోవడం తదితర ప్రతిబంధకాలు ఎదురవుతాయి. దాంతో ‘నీ వల్లనే నేనిలా అయ్యా’ అని ఒకరినొకరు నిందించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రేమ విఫలమవ్వడానికీ దారితీస్తుంది. పరిణతి చెందిన ప్రేమకు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యం ఉంటుంది. ప్రేమకు నిర్వచనం శారీరక ఆకర్షణగా భావించడం సరికాదు. ఇలాంటివారు తాత్కాలిక ఆనందాలకు వెంపర్లాడతుంటారు. ప్రేమ అనేది శాశ్వతమైనది.

హితమైనది.. అతీతమైనది..

‘కులమేల మతమేల మనసున్న నాడు/ హితమేదో తెలియాలి మనిషైన వాడు/ నీ దేశమే పూ వనం/ పూవై వికసించనీ జీవితం..!’ అని కవి అన్న మాటలు అక్షరసత్యాలు. ప్రేమనేది వ్యక్తిత్వానికి సంబంధించింది. దానిని కులం, మతం, రంగు, శరీరం, అందం, డబ్బులతో ముడిపెట్టడం భావ్యం కాదు. వీటిలో ఏదీ ప్రేమతో ఎప్పటికీ సరి తూగలేదు.

వ్యాపారమయం..

సరళీకరణ విధానాల నేపథ్యంలో ప్రేమ కూడా సరకుగా మారిపోయింది. తత్ఫలితంగా సున్నితత్వాన్ని కోల్పోయి బహుముఖ రూపాల్లో దర్శనమిస్తోంది. ప్రేమికుల రోజున కోట్లలో వ్యాపారం నడుస్తోంది. దీనిని ఒక పెద్దాయన మాటల్లో.. ‘ప్రేమ ఫ్రాన్స్‌లో ఒక కామెడీ.. ఇంగ్లండులో ఒక ట్రాజెడీ.. ఇటలీలో ఒక ఓపెరా.. జర్మనీలో ఒక మెలోడ్రామా.. ప్రస్తుతం ప్రేమ ఒక మార్కెట్‌ సరుకు’ అని వ్యాఖ్యానించారు.

వాణిజ్యంలో వాలెంటైన్స్‌ డే..

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాదీ ప్రేమికుల రోజున 25 కోట్ల పువ్వులు అమ్ముడవుతున్నాయనేది ఒక అంచనా. అలాగే 36 కోట్ల గుండె ఆకారపు చాక్లెట్‌ బాక్స్‌లు అమ్ముడవుతున్నాయంట. ఇవేకాకుండా టెడ్డీబేర్‌లు, వాలెంటైన్‌ కార్డులు, రంగురంగుల ప్రేమలేఖలు, స్వీట్లు, ఇతర బహుమతులు కోకొల్లలుగా అమ్ముడవుతున్నాయి.

సజీవ స్రవంతి..

ప్రేమ ఒకరోజుతోనో, రోజా పువ్వులు ఇచ్చుకోవడంతోనో, మురిపించే బహుమతులు ఇవ్వడంతోనో ముగిసిపోయే క్షణికావేశం కాదు. జీవితకాలం కొనసాగాల్సిన సజీవ స్రవంతి. ప్రేమంటే ఒకరి కోసం బతకటం లేదా చావటం కాదు. ఒకరి పట్ల ఒకరికి గౌరవం, అర్థంచేసుకునే తత్వం కలిగి ఉండడం. ఒక లక్ష్యంతో పనిచేసేవారు.. ఆశయాలను, సిద్ధాంతాలను, బలాలను, బలహీనతలను ఒకరికొకరు పంచుకోవాలి. అవగాహన చేసుకోవాలి. ‘ప్రేమ అమ్మ పాల వంటి స్వచ్ఛత, నాన్న ఆప్యాయతలాంటి బాధ్యత ఉండాల్సిన అనుభూతి’ అంటాడో కవి. ఇరువురి మనసులో ఒకరిపట్ల ఒకరికి నమ్మకం.. చేతల్లో భరోసా ఉండడమే ప్రేమగా మెలగడం.

వారోత్సవాలు..

వాలెంటైన్స్‌ డే వారోత్సవాలుగా జరుపుతున్నారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 14 వరకు జరుపుకునే ప్రత్యేకతలు ఏమంటే.. 7వ తేదీన రోజ్‌డే, 8న.. ప్రపోజ్‌ డే, 9న.. చాకొలేట్స్‌ డే, 10న.. ప్రామిస్‌ డే, 11న.. టెడ్డీ డే, 12న.. హగ్‌ డే, 13న.. కిస్‌ డే, 14న.. వాలెంటైన్స్‌ డే. ఇవన్నీ నిజమైన ప్రేమకు అవసరం లేదు. కానీ మార్కెట్‌ మాయాజాలం వీటిని సరకుగా చేసుకునే కుతంత్రం చేస్తోంది. యువత మేల్కొవడమే పరిష్కారం.

ఉన్మాదం కాకూడదు..

ప్రేమ అనే భావవ్యక్తీకరణ భాష పుట్టుక ముందే పుట్టింది. ఇది ఆకర్షణ, అవసరం కానేకాదు.. వికసించి, వసివాడని కుసుమం. ఇది ఎవరూ నేర్పించేది కాదు. జీవనం నిజాయితీగా సాగేటప్పుడు పెల్లుబికే భావన. ప్రేమకు కులం, మతం, జాతి అనే గోడలు అడ్డుగా నిలుస్తున్నాయి. ఈ గోడల్లో కుల దురహంకార హత్యలు రాజ్యమేలుతున్నాయి. ఈ ఉన్మాదంలో కన్నబిడ్డలను కడతేర్చేందుకూ తల్లిదండ్రులు సిద్ధపడుతున్న దుస్సంఘటనలు జరుగుతున్నాయి. ప్రేమించానంటూ వెంటపడి వేధించడం, తిరస్కరిస్తే తట్టుకోలేక చంపడానికీ తెగబడడం చేస్తున్నారు. ప్రేమకు సరైన నిర్వచనం తెలీకపోవడమే వీటికి కారణం. ప్రేమ చావుని కోరుకోదు.. ప్రాణం పోసేదే నిజమైన ప్రేమ.

వివిధ దేశాలలో..

  • వాలెంటైన్స్‌డేని పురస్కరించుకుని వివిధ దేశాల్లో రకరకాలుగా జరుపుకునే విధానం కాస్త చిత్రంగానే ఉంది.
  •  ఉత్తర ఐరోపాలోని ఈస్టోనియాలో, ఫిన్‌ల్యాండ్‌లో వేలంటైన్స్‌ డేని ‘ఫ్రెండ్‌షిప్‌ డే’ గా జరుపుకొంటారు.
  • ఇంగ్లండ్‌ సరిహద్దు ప్రాంతమైన ‘వేల్స్‌’ దేశంలో ‘డే ఆఫ్‌ సాన్‌ డ్వైన్‌వెన్‌’ అనే పేరుతో జనవరి 25న జరుపుకుంటారు. వారు హృదయాకారంలో ఉండే చెక్క స్పూన్లు ఇచ్చిపుచ్చుకుంటారు.
  • దక్షిణకొరియాలో ప్రతి నెల 14వ తేదీని ‘ప్రేమికుల దినోత్సవం’గా జరుపుకొంటారు.
  • ‘ఘనా’ దేశ ప్రభుత్వం ఫిబ్రవరి 14ను ‘జాతీయ చాక్లెట్‌’ దినోత్సవంగా జరుపుతోంది.
  • ఫిలిప్పీన్స్‌లో ఈ రోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు జరుగుతాయి.

 

  • టాన్య, 70958 58888
➡️