బుందేల్‌ఖండ్‌ గౌరవ్‌ మహోత్సవంలో జరిగిన పేలుడులో నలుగురు చిన్నారులు మృతి

Feb 15,2024 16:24 #Explosion, #Uttar Pradesh

చిత్రకూట్‌ (ఉత్తరప్రదేశ్‌) : ఉత్తరప్రదేశ్‌ చిత్రకూట్‌లోని బుందేల్‌ఖండ్‌ గౌరవ్‌ మహోత్సవంలో జరిగిన పేలుడులో నలుగురు చిన్నారులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారని పోలీసులు గురువారం తెలిపారు. పండుగ సందర్భంగా బాణాసంచా కాల్చే సమయంలో పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం జరిగిన ఈ సంఘటనా స్థలం వద్దకు చిత్రకూట్‌ డిఐజి, ఆ జిల్లా అధికారితోపాటు ఎస్‌పి, అడిషనల్‌ ఎస్‌పిలతోపాటు పలువురు అధికారులు చేరుకున్నారు. అలాగే ఫోరెన్సిక్‌ టీమ్‌, బాంబ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌ (బిడిఎస్‌) బృందం కూడా చేరుకుందని ప్రయాగ్‌రాజ్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ (ఎడిజి) భాను భాస్కర్‌ చిత్రకూట్‌లో మీడియా వెల్లడించారు.

కాగా, ఈ ఘటనకు సంబంధించి ఎడిజి భాస్కర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ కేసుకు సంబంధించి ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాము. మరికొంతమంది పేర్లు నమోదు చేసే అవకాశం ఉంది. మేము ఈ కేసును కొత్త ఇన్వెస్టిగేటర్‌ హర్ష్‌ పాండేకి అప్పగించాము. ఈ కేసు దర్యాప్తులో న్యూఢిల్లీ, లక్నో, ఆగ్రాల నుండి వచ్చే పోలీసు బృందాలతో సమన్వయం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తాము. ఈ ఘటనలో మృతి చెందిన చిన్నారుల పోస్టుమార్టం ఇంకా పూర్తి కాలేదు. ఈ కేసులో మరింత మందిని విచారిస్తున్నాము. వారు ఇచ్చిన ఆధారాలతో దర్యాప్తు చేస్తున్నాము.’ అని ఆయన అన్నారు. ఇక ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ (ఎడిజి) ర్యాంక్‌ అధికారి నేతృత్వంలో ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు ఆర్థికసాయాన్ని ప్రకటించారు.

➡️