అప్రజాస్వామికం : జమిలి ఎన్నికల ప్రతిపాదనపై కమిటీకి సిపిఐ(ఎం) లేఖ

  • ప్రజాస్వామ్య స్ఫూర్తికి దెబ్బ
  • ఫెడరలిజం సూత్రాల ఉల్లంఘన

న్యూఢిల్లీ : దేశంపై జమిలి ఎన్నికలను రుద్దేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై సిపిఐ(ఎం) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విధానం పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఆరోపించింది. ‘ఒకే దేశం…ఒకే ఎన్నిక’పై కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీకి ఈ మేరకు ఆదివారం ఓ లేఖ రాసింది.

కమిటీ కార్యదర్శిని ఉద్దేశిస్తూ రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించింది. జమిలి ఎన్నికలపై సూచనలు కోరుతూ 2023 అక్టోబర్‌ 18న హైలెవెల్‌ కమిటీ రాసిన ఉత్తరానికి ప్రత్యుత్తరంగా సిపిఐ(ఎం) ఈ లేఖ రాసింది. ‘ఒకే దేశం…ఒకే ఎన్నిక’ విధానాన్ని రుద్దేందుకు జరుగుతున్న యత్నాలపై మేము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని ఉన్నత స్థాయి కమిటీకి ఇచ్చిన సూచనలు స్పష్టం చేస్తున్నాయి. దాని అమలు పైనే ఇప్పుడు సూచనలు స్వీకరిస్తున్నారు. జమిలి ఎన్నికల నిర్వహణ కోసం న్యాయపరమైన, పాలనాపరమైన వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అవసరమైన సూచనలు చేయడానికి మాత్రమే కమిటీ పరిమితమైందన్న విషయం అక్టోబర్‌ 18న మీరు రాసిన లేఖ ద్వారా స్పష్టమైంది. జమిలి ఎన్నికల అంశాన్ని పరిశీలించి, దేశంలో వాటిని నిర్వహించేందుకు సూచనలు చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు న్యాయ శాఖ 2023 సెప్టెంబర్‌ 2న ఓ తీర్మానం ద్వారా తెలియజేసింది. కమిటీ ఏర్పాటుపై సిపిఐ(ఎం) తీవ్ర నిరసనను తెలియజేసింది. ఎందుకంటే దాని అజెండాను, గమ్యాన్ని ముందే నిర్ణయించారు’ అని ఆ ప్రకటనలో సిపిఐ(ఎం) తెలిపింది. లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రతిపాదన వచ్చినప్పటి నుండి సిపిఐ(ఎం) తన వ్యతిరేకతను, ఆందోళనను వ్యక్తం చేస్తూనే ఉన్నదని ఆ లేఖలో పార్టీ గుర్తు చేసింది. ‘ఇదే అంశంపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు కోరుతూ లా కమిషన్‌ రాసిన లేఖపై సిపిఐ(ఎం) 2018 జూలై 4న ఒక నోట్‌ సమర్పించింది. అందులో వ్యక్తం చేసిన అభిప్రాయానికే మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాము. అదే పార్టీ అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తోంది. మీ పరిశీలన కోసం ఆ నోట్‌ను ఈ లేఖకు జత చేస్తున్నాము. మా అభిప్రాయం ప్రకారం జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. భారత రాజ్యాంగం ప్రజల అభీష్టానికి సంబంధించిన ప్రాధాన్యతను నిర్వచించింది. అందులో ఏముందంటే… భారతదేశ ప్రజలమైన మేము ఈ రాజ్యాంగాన్ని అంగీకరిస్తున్నాం. దీనికే కట్టుబడి ఉన్నాము. ప్రజలు తాము ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటారు. ఆ ప్రతినిధులు ప్రజలకు, కార్యనిర్వాహక వ్యవస్థ లేదా ప్రభుత్వానికి జవాబుదారీగా ఉంటారు. ఆ ప్రభుత్వం చట్టసభకు జవాబుదారీగా ఉంటుంది. రాజ్యాంగంలోని ఈ కోణాలన్నింటినీ సర్దుబాటు చేయలేము. వాటిని నీరుకార్చలేము’ అని సిపిఐ(ఎం) ఆ లేఖలో వివరించింది. జమిలి ఎన్నికల ప్రతిపాదన అప్రజాస్వామికమైనదని, ఫెడరలిజం సూత్రాలను ఉల్లంఘిస్తోందని ఉన్నత స్థాయి కమిటీకి రాసిన లేఖలో సిపిఐ(ఎం) తెలియజేసింది.

➡️