ప్రభుత్వానికి ‘సిపిఎం’ అంటే ఎందుకంత భయం : కె.లోకనాధం

Unchanged CM's visit

ప్రజాశక్తి-అనకాపల్లి : సీఎం జగన్‌ అనకాపల్లి పర్యటన నేపథ్యంలో సీపీఎం నేతలను నిర్భందం చేయడం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాథం అన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, డి.వెంకన్న, కె.గోవిందరావును, డి.శ్రీనివాస రావు, డివైఎఫ్‌ఎ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.శివాజీలను పోలీసులు గృహ నిర్బంధం చేయడాన్ని ఆయన ఖండించారు. ప్రజా సమస్యలపై పోరాడే సీపీఎం నాయకులంటే ఎందుకంత భయం అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు. నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అనకాపల్లి వస్తున్న సందర్భంగా పోలీసులు అత్యుత్సాహంతో సిపిఎం నాయకులను నిర్భంధించడం దుర్మార్గమన్నారు. సిఎం ఏ జిల్లాకు పర్యటనకు వెళ్ళినా ముందుగా సిపిఎం నాయకులను అరెస్టు చేయడం పరిపాటిగా మారిందని విమర్శిచారు. రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఎం నాయకులంటే ఎందుకు అంత భయం? అని ప్రశ్నించారు. మీరు ప్రజలకు చేస్తున్న అన్యాయాలపైన, జిల్లాలో అపరిష్కృతంగా వున్న అనేక సమస్యలపై నిలదీస్తారనా? చట్టాలను ఉల్లంఘించి, ప్రజాస్వామ్యంలో పౌరులు హక్కులకు భంగం కలిగించే విధంగా పోలీసులు వ్యవహరించిన తీరుని సిపిఎం ఖండిస్తోందన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా సిపిఎం నాయకులను గృహ నిర్భందం చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అణిచివేత, నిర్భంద చర్యలను మానుకొని ప్రజల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం వెంటనే మూసివేసిన మూడు షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపించాలని.. సుజల స్రవంతి ప్రాజెక్టు నిధులు కేటాయించాలని నాన్‌షెడ్యూల్‌లో గిరిజనుల సాగులో ఉన్న భూములకు ఆర్‌ఒఎఫ్‌ఆర్‌ పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. పరవాడ ఫార్మాలో రాంకీ వెదజల్లుతున్న రసాయన కాలుష్యాన్ని అరికట్టి తాడి గ్రామాన్ని తరలించాలన్నారు. ఎన్‌ఎఒబి నిర్వాసితులకు చట్ట ప్రకారం పరిహారం, నక్కపల్లిలో పిసిపిఐఆర్‌ భూ నిర్వాశితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారంర పరిహారం ఇవ్వాలన్నారు. స్థానిక పరిశ్రమల్లో స్థానికులకే 75శాతం ఉద్యోగాలు ఇవ్వాలని, అనకాపల్లి పట్టణంలో అండర్‌ గ్రౌండ్‌ డ్క్రెనేజీ ఏర్పాటు చేసి దోమలను నివారించాలని, జిల్లాలో అపరిష్కృతంగా వన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

➡️