కృష్ణపట్నం పోర్టులో దారుణం

– ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతి

– బొగ్గునౌక ట్యాంకర్‌ శుభ్రం చేస్తుండగా ఘటన

ప్రజాశక్తి-నెల్లూరు :నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులో శుక్రవారం ఇద్దరు కార్మికులు మరణించారు. నెల్లూరుకు చెందిన కదురువేలు (34), యశ్వంత్‌కుమార్‌ (22) అనే ఇద్దరు క్యాజువల్‌ కార్మికులు శుక్రవారం ఉదయం పోర్టులోని ఇండోనేషియాకు చెందిన బగ్గునౌక ట్యాంకర్‌ను శుభ్రం చేసేందుకు ట్యాంకులోకి దిగారు. అయితే కొద్దిసేపటికే వారికి ఆక్సిజన్‌ అందక అపస్మారక స్థితికి చేరుకున్నారు. కార్మికుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో తోటి కార్మికులు ట్యాంకులోకి దిగి చూడగ వారు అచేతనంగా పడి ఉన్నారు. వెంటనే వారిని యాజమాన్యం నెల్లూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించింది. అప్పటికే కార్మికులు మృతిచెందారని డాక్టర్లు ధ్రువీకరించారు.

మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, ఒకరికి పర్మినెంట్‌ ఉద్యోగం ఇవ్వాలని సిఐటియు జిల్లా నాయకులు గోగుల శ్రీనివాసులు, గడ్డం అంకయ్య డిమాండ్‌ చేశారు. యాజమాన్యం సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా కార్మికుల చేత పనులు చేయించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పలువురు కార్మికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి మృతి చెందిన కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలతో యాజమాన్యం చర్చలు జరుపుతోంది.

➡️